పచ్చి మక్కల్ని రోట్లో మెత్తగా రుబ్బి, అట్ల పెనం మీద నూనె రాసి, పల్చగా అట్టేసి కాలిస్తే ఆ వాసనకి సగం ఆకలి పారిపోవాల్సిందే. అట్లకోసం పిండి రుబ్బుకోవడమూఓ కళే. దోశపిండిలా మరీ మెత్తగా కాకుండా,కాస్త బరకగా పట్టుకోవాలి. లేత కంకుల్ని ఎంచుకుంటే అట్లు తియ్యగా, కమ్మగా వస్తాయి.
తెలంగాణలో విరివిగా పండే పంటల్లో మక్కజొన్న ఒకటి. ఈ మధ్య కాస్త తగ్గినా, పల్లెల్లో ఒకప్పుడు బియ్యం కంటే మక్కజొన్న వాడకమే ఎక్కువ. మక్క గట్క, మక్క అటుకులు, మక్క కుడుములు, మక్కట్లు..తెలంగాణలో ఫేమస్ వంటకాలు. పంట వేసింది మొదలు కాస్త గింజలైతే చాలు గారెలు, అట్లు అంటూ రోలూ రోకలికి పని చెప్పాల్సిందే.
మక్కట్లకు తీపి, కారం ఏ కాంబినేషనైనా అదిరిపోతుంది. కారంగా తినాలనుకుంటే పిండి రుబ్బేటప్పుడే కాస్త ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసుకోవాలి. అట్లకి తోడుగా పల్లి, కొబ్బరి, అల్లం పచ్చళ్లు జోడించవచ్చు. తీపి కావాలంటే పిండిలో ఏమీ వేయకుండా చిటికెడు ఉప్పు మాత్రమే వేసి రుబ్బుకోవాలి. తేనె, చక్కెర జత చేయవచ్చు.
ఎముకల దృఢత్వానికి అవసరమయ్యే లవణాలు మక్కజొన్నలో పుష్కలం. ఈ గింజల్లో మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మూత్రపిండాల ఆరోగ్యానికి కీలకం.
మక్కజొన్నలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతిమంతం చేస్తాయి. మక్కట్లకు మంచి కాంబినేషన్ పాల పడియం. వెనుకటి రోజుల్లో పిండి రుబ్బిన తర్వాత, రోలు కడిగిన నీటితో
దీన్ని చేసేవాళ్ళు. రుబ్బిన పిండిలో నుంచి కొంత తీసుకుని నీటిలో బాగా కలిపి పాలు, చక్కెర లేదా బెల్లం వేసి ఉడికించుకుంటే చాలు. ఒకప్పటి పాల పడియమే ఇప్పుడు ‘కార్న్ పాయసం’ పేరుతో పాపులర్ అయ్యింది.
రుచిలోనే కాదు, పోషకాల్లోనూ మక్కట్లు తక్కువేం కాదు. పచ్చిమక్కల్లోని పీచు జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. మలబద్ధకం, మొలలు వంటి వ్యాధులను దరిచేరనీయదు. పేగు క్యాన్సర్‌ను
అరికట్టడంలో సాయపడుతుంది. మక్కజొన్నలో లినోలిక్ యాసిడ్, విటమిన్-ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లెవిన్ అపారంగా ఉంటాయి.
మక్కజొన్నలోని ఫోలిక్ యాసిడ్ రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారు సైతం నిరభ్యంతరంగా తినవచ్చు. ఇందులోని విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్వల్ల జుట్టు ఒత్తుగా ఉంటుంది. కొత్త మెరుపూ వస్తుంది.