చదువు పూర్తికాగానే ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని, తమకంటూ ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలని కలలు కంటారు చాలామంది. కానీ బాల్యంలోనే 56 కంపెనీలు స్థాపించి చైల్డ్ ఆంత్రప్రెన్యూర్ అనిపించుకున్నాడు బీహార్‌కు చెందిన సూర్యాన్ష్. అతిచిన్న సీయీవోగా రికార్డు సృష్టించిన ఆ బాలమేధావి గురించి..
ముజఫర్‌పూర్‌కు చెందిన సూర్యాన్ష్ బాల్యంనుంచీ టెక్నాలజీపై ఆసక్తి చూపేవాడు. అది గమనించి తల్లిదండ్రులూ ప్రోత్సహించారు. ప్రస్తుతం, ఆ బాల వ్యాపారవేత్త పదో తరగతి చదువుతున్నాడు. ఇంటికి రాగానే వ్యాపార వ్యవహారాలు చూసుకుంటాడు. ఫుడ్ డెలివరీ, మ్యాట్రిమోనీ సేవల నుంచి క్రిప్టో కరెన్సీ వంటి క్లిష్టమైన ఆర్థిక వ్యవహారాల వరకూ.. అన్ని సేవలూ అందిస్తున్నాడు. త్వరలోనే తన కంపెనీలన్నీ లాభాల బాట పడతాయని సూర్యాన్ష్ ధీమాగా చెబుతున్నాడు. సూర్యాన్ష్ కాంటాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఛత్రం కింద యాభై ఆరు స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. వాటిలో ‘మంత్రా ఫై’ అనేది క్రిప్టో కరెన్సీ కంపెనీ. ఆర్థిక వ్యవహారాలపై అవగాహన లేనివారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ‘జస్ట్ బిజినెస్’ క్విక్ కామర్స్ సంస్థ. ఓలా తరహాలో జిప్సీ క్యాబ్స్‌ను స్థాపించాడు. కులాంతర వివాహాల కోసం ‘షాదీ కరో’ అనే మ్యాట్రిమోని కంపెనీ ఏర్పాటు చేశాడు చైల్డ్ ఆంత్రప్రెన్యూర్ సూర్యాన్ష్.