బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సమయానికి నాకు పెద్దగా నటన గురించి తెలియదు. డైలాగ్ చదివి వాటిని చెప్పమనేవారు. అప్పట్లో టీఆర్పీ అంటే కూడా తెలియదు. ఆ ధారావాహికకి మొదట 80 ఎపిసోడ్లకు మాత్రమే సంతకం చేశా. అది కాస్త 515 ఎపిసోడ్లు ప్రసారమైంది.
‘చిన్నారి పెళ్లికూతురు’గా బుల్లితెరపై అలరించి.. ‘ఉయ్యాల జంపాల’తో హీరోయిన్గా మారిన ముంబయి బ్యూటీ అవికా గోర్. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నది అల్లరిపిల్లగా, అందాల భామగా వరుస సినిమాలు చేస్తున్నది. ఉత్తరాదితోపాటు దక్షిణాదిన కూడా అభిమానులను సంపాదించుకున్నది. వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న అవిక తాజాగా ‘షణ్ముఖ’ సినిమాతో మరోసారి టాలీవుడ్‌ని పలకరించింది. కొన్ని సినిమాలు నిరాశపరిచినా.. కెరీర్ పరంగా చాలా సంతోషంగా ఉన్నానంటున్న అవిక పంచుకున్న కబుర్లు..
మిలింద్ నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. అతని సాహచర్యంలో నా బలాన్ని, సామర్థ్యాన్ని గుర్తించా! నన్నెంతో ప్రోత్సహిస్తాడు. నేను బరువు తగ్గడం నుంచి నిర్మాతగా మారడం వరకు అన్నిట్లో మిలింద్ నా వెంటే ఉన్నాడు. తను లేకుంటే నేనిక్కడి వరకు వచ్చేదాన్నే కాదు.
కామన్ ఫ్రెండ్స్ ద్వారా మిలింద్ పరిచయమయ్యాడు. ఆరు నెలలపాటు స్నేహితులుగా ఉన్నాం. మా ఇష్టాయిష్టాలు కలిశాయి. నా అభిప్రాయాలకు అతనిచ్చే గౌరవం నాకెంతో నచ్చింది. మా మనసులు కలిశాయి. అంటే.. నా దృష్టిలో మానసికంగా మా పెళ్లి జరిగిపోయినట్టే.
అవికా స్క్రీన్ క్రియేషన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ప్రారంభించాం. ఇప్పటికి రెండు సినిమాలు తీశాం. మరిన్ని మంచి చిత్రాలు తీయాలన్నది నా కోరిక. ‘నిర్మాతగా మారడం చాలా రిస్క్’ అని చాలామంది హెచ్చరించారు. కానీ, నేను చాలెంజ్‌గా తీసుకున్నా. ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా అభిమానుల ప్రేమ, ఆశీర్వాదాలే నన్ను ముందుకు నడిపిస్తాయి.
ఒక నటిగా భిన్నమైన కథలకే మొగ్గు చూపుతాను. కథలో బలం ఉంటే.. అందులోని పాత్రలన్నీ పండుతాయి. దర్శకుడు, నటీనటులు, సినిమా బృందం అందరూ కష్టపడతారు. జయాపజయాలు మాత్రం ప్రేక్షక దేవుళ్లు నిర్ణయిస్తారు. సృష్టిలో ఏం జరిగినా.. దాని వెనక ఓ కారణం ఉంటుంది. మనం చేయాల్సిందల్లా కాలంతోపాటు ముందుకు సాగడమే. ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపర్చుకునే ప్రయత్నం చేస్తాను.
కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా చాలా విషయాలు నేర్చుకున్నా. సమస్యలు, అనుభవాలతోనే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని గ్రహించాను. ఇప్పటివరకూ నటన గురించే ఆలోచించాను. ఫిట్నెస్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. కొద్దిగా బరువు పెరిగితే అందరూ ‘బొద్దుపిల్ల’ అంటున్నారు. అందుకే ఒకే బరువు మెయింటేన్ చేయాలని నిర్ణయించుకున్నా! బలంగా సంకల్పిస్తే.. ఏదైనా సాధించగలం.
15 ఏండ్ల వయసులో సినిమాల్లో హీరోయిన్గా నటించాలనే కోరిక ఉందని ఒక ఇంటర్వ్యూలో చెప్పా. మొదట మరాఠీ, గుజరాతీ సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. తర్వాత తెలుగులో చాన్స్ వచ్చింది. మొదట్లో తెలుగు అర్థం చేసుకోవడం కష్టమయ్యేది. ఇప్పటికీ తెలుగు మాట్లాడలేను కానీ, అర్థం చేసుకోగలను.