జరిగిన కథ ప్రియుని ఎడబాటుతో చంద్రహత్థి పిచ్చిదే అయిపోతుంది. లంకా దహనం తోలుబొమ్మలాట మిషతో.. కుసుమ శ్రేష్ఠి భవనం తగలబెడతారు కల్లణసీహుని మనుషులు. ప్రాణాలకు తెగించి రోహాదేవిని, సిరిసత్తిని కాపాడుతాడు కువిందుడు. తన ప్రియుని బాధ తలచుకుని సౌగంధిక; ప్రియురాలిని తలుచుకొని పోటిసుడు దుఃఖిస్తుంటారు. ఆ తర్వాత..
క ళింగ పట్టణంలో.. ‘నాలుగు రోజులు గడిచిపోయింది. ఇది ఐదవ రోజు! ఈపాటికి కల్లణసీహుడు ధన కనక కాంతామణులతో మన ముందు ఉండవలసిన వాడు! ఇంకా ఎందుకు రాలేదు..? సంపదను చూసి వాని బుద్ధి మారిందా? సౌందర్యవతులను చూసి మనస్సు చలించిందా? అశ్మక రాజుకు విషయం తెలిసి, నా మనుషులందరినీ..’ అని పరిపరివిధాల మధనపడుతున్న ఈసాణుడి చెవిలో.. అమృతం పోసినట్లు భటుడు ఒక చల్లని వార్త తెచ్చినాడు. “ప్రభూ! తమ దర్శనార్థం కల్లణసీహుడు వేంచేసియున్నాడు!” అని. సంతోషంతో ఈసాణుడి మనసు గంతులు వేసింది. ‘వెంటనే ప్రవేశపెట్..’ అనబోయి, అంతలోనే ఏదో గుర్తుకువచ్చి.. “ఆగు! ఇక్కడ కాదు; ఆ సార్థవాహులను బంధించిన గృహానికి వాడు తెచ్చినవన్నీ తీసుకొని రమ్మను! ఆ.. ఆడవాళ్లను కూడా!” అన్నాడు. “చిత్తం ప్రభూ!” అంటూ నిష్క్రమించినాడు వార్తాహరుడు. ‘ఇక ఆ తండ్రీకొడుకులతో ఆటాడుకోవచ్చు! వాళ్ల ఎదురుగానే ఆ సుందరాంగులను అవమానించి, మానములను హరించవచ్చు..’ అనుకుంటూ వికటాట్టహాసం చేసినాడు. ఆ నవ్వు రాజమందిరం అంతటా ప్రతిధ్వనించింది.
తర్వాత దేహానికి సుగంధ ద్రవ్యాలు పులుముకొని; అందమైన వస్త్రాలను అలంకరించుకొని; బారెడు మల్లెపూల మాలను చేతికి చుట్టుకొని కుసుమ శ్రేష్ఠిని బంధించిన గృహంలోకి వెళ్లినాడు ఈసాణుడు. అక్కడ అతను ఊహించుకున్నట్లు సుందరాంగులు లేరు; ధనం, కనకం ఉన్న ఛాయలు లేవు. అనుమానంగా, అసహనంగా కల్లణసీహుని చూసినాడు.. వాని మొహంలో నెత్తురు చుక్కలేదు! మనసేదో కీడును శంకిస్తుండగా మందలించినాడు కల్లణసీహుని.. “కల్లణసీహా! ధనమేది? కనకం ఎక్కడ దాచినావు?? అన్నిటినీ మించి ఆ కాంతామణులు.. ఎక్కడ???” అన్నాడు కళ్లతోనే ఆ పరిసరాలన్నీ వెతుకుతూ.. తలవంచుకున్నాడు కల్లణసీహుడు. “మరేం వెరగు పడనవసరం లేదు. జరిగిన సంగతులన్నీ వివరంగా చెప్పు! ఏమేం జరిగింది? ఏమేం తెచ్చినావు? ఎక్కడున్నాయి?” తనను తాను నిగ్రహించుకుంటూ; ఆందోళనను, భయాన్ని కడుపులో దాచుకుంటూ; లేని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇంకా ఇట్లా అన్నాడు ఈసాణుడు.. “పాపం! ఆ విషయాలన్నీ తెలుసుకోవాలని నాకంటే ఎక్కువగా ఆరాటపడుతున్నాడు ఈ మూగ సార్థవాహుడు కుసుమ శ్రేష్ఠి. ముందు ఆ సుందరాంగుల సంగతి.. అదే వీని భార్య, కోడలి సంగతి చెప్పు.. ఎక్కడున్నారు వాళ్లు?” మళ్లీ కల్లణసీహుని మౌనమే సమాధానమయ్యింది. “కల్లణా!”.. భయంకరంగా గర్జించినాడు ఈసాణుడు. ఆ మాట అక్కడ ప్రకంపనలు సృష్టించింది.
ఇంకా మౌనం వహిస్తే అది ప్రాణానికే ప్రమాదం అన్న భయంతో గొంతు విప్పినాడు కల్లణసీహుడు.. “మన్నించండి ప్రభూ! మనం అనుకున్నవి ఏవీ జరగలేదు..” అన్నాడు వంచిన తల ఎత్తకుండా. ఆ మాటలను విన్న కుసుమ శ్రేష్ఠి ముసిముసిగా నవ్వుకున్నాడు. అది ఈసాణుడికి పుండు మీద కారం చల్లినట్లయ్యింది. కల్లణుడి మాటలు జీర్ణించుకోలేక పోయినాడు. సర్రున ఒరలో నుంచి కత్తిని దూసి, ఆ కత్తి మొన కల్లణుడి గుండెకు ఆనించినాడు. “చెప్పు! నిజం చెప్పు! ఎక్కడ ఆ రత్నరాసులు? ఎక్కడ ఆ అంగనామణులు?” అన్నాడు కోపంగా. “నన్ను నమ్మండి ప్రభూ! ఏదీ జరగలేదు!” భయంతో వణికిపోతూ అన్నాడు కల్లణుడు. “జరుగలేదా.. తోలుబొమ్మలాట?” “ప్రదర్శించినాం..” “కుసుమ శ్రేష్ఠి అందాల కోట?” “తగులబెట్టినాం!” ఉలిక్కిపడ్డాడు కుసుమ శ్రేష్ఠి. ఈ మాటలన్నీ పక్క గదిలో నుంచి వింటున్న జయసేనుడు కూడా ఆందోళన చెందినాడు. “మరి ధనము.. ఆ రాణులూ..” “లభించలేదు ప్రభూ!” “ఆపు నీ నాటకం!” నమ్మలేకపోతున్నాడు ఈసాణుడు.
“నిజం ప్రభూ! అక్కడొక పెద్ద వయస్సు భటుడు మమ్ములను అడ్డుకున్నాడు. ఆ రాణులను ఒక రహస్య ద్వారం వద్ద మాయం చేసినాడు” అన్నాడు కల్లణసీహుడు. “నిన్ను మించిన మహేంద్రజాలికులు ఉన్నారా కల్లణా!” అన్నాడు ఇంకా నమ్మబుద్ధి కాక ఈసాణుడు. “అది ఇంద్రజాలం కాదు ప్రభూ! వాస్తు కళ గొప్పతనం. వాడు అంతఃపురాంగనలను ఆ ద్వారంలోకి పంపి మూసేసిన తర్వాత మళ్లీ తెరుచుకోలేదు. మరి కొంచెం సేపటికి అక్కడ ద్వారం ఉన్న ఆనవాళ్లు కూడా కనిపించలేదు” కల్లణసీహుణ్ని పరిశీలించి చూసినాడు ఈసాణుడు. అతను అబద్ధం ఆడటం లేదనిపించింది. అంతలోనే గుర్తుకొచ్చింది.. “మరి ఆ వృద్ధయోధుని బంధించి, హింసించి ఆ రహస్యం గ్రహించలేకపోయినారా?” “సాధ్యం కాలేదు ప్రభూ!” అన్నాడు మాటలు కూడగట్టుకుంటూ కల్లణుడు. “ఏం? ఎందుకు?” ఈసాణుడి కనుబొమ్మలు ముడివడ్డాయి. “తొందరపడి.. మన మనుషులు అతణ్ని చంపేసినారు!” ఆ మాట విన్న కుసుమ శ్రేష్ఠి స్పృహ కోల్పోయినాడు. తల పట్టుకొని కూలబడిపోయినాడు ఈసాణుడు. పక్కగదిలో ఉన్న జయసేనుని కళ్లల్లో నీళ్లు నిండినాయి. “మనవాళ్లందరినీ పిలిపించు!” మళ్లీ ఏదో గుర్తుకొచ్చింది ఈసాణుడికి. “ఒక్కరు కూడా మిగలలేదు ప్రభూ! సగం మందిని ఆ యోధుడు పొట్టన పెట్టుకున్నాడు. మిగతా సగం మందిని పోదన రాజభటులు మట్టు పెట్టినారు. నేనొక్కడినే ప్రాణాలు నిలబెట్టుకోగలిగినాను!” చావు కబురు చల్లగా చెప్పినాడు కల్లణసీహుడు.
* * *
చెంచు గూడెంలో.. మూడు రోజులకే చంద్రహత్థిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఆ గొప్పతనం అంతా రాయహత్థిదే. చంద్రను తన సొంత చెల్లెలి కన్నా మిన్నగా భావించి సేవలు చేసింది. మంచి ఆహార పానీయాలతోపాటు గాడి తప్పిన మనసును దారిలోకి తెచ్చింది. ఆవేదనను ఆవేశంగా మార్చి నిరాశలో ఆశయాన్ని నింపింది. పోటిసుడు తనకికలేడని; అతను లేని జీవితం తనకు అవసరం లేదనుకొని ఎడారిలా మారిన చంద్రహత్థి మనసులో ఆశల బీజాలు నాటి, అంకురింపజేసింది. పోటిసుడు ఆమెను ఎన్నటికీ మరువడని; అతను తన కర్తవ్యం నెరవేర్చడానికి మహావీరుడై సాహసం చేయడానికి ముందుకు పోయినాడని; ఇప్పుడు ఏడుస్తూ కూర్చోవడం కంటే అతనికి తోడుగా నిలబడటమే ముఖ్యమని.. ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నూరిపోసి, స్వస్థత చేకూరేటట్లు చేసింది. కానీ.. రామేశ్వరం పోయినా వదలని శనేశ్వరంలా దాపురించినాడు కటిలుడు. కటిలుడి కన్ను ఎప్పటినుంచో చంద్రహత్థి మీదున్నది. ఆమె ఉమ్మేసినా తుడుచుకొని వెంట తిరుగుతున్నాడు. పోటిసుడు ఆమెను కాదని వెళ్లిపోవడం తనకు వరంగా పరిణమిస్తుందనుకొని అదే తనకు చివరి అవకాశంగా భావించి , వదలకుండా నీడలా వెంటాడుతున్నాడు.
రాయహత్థిని మంచి చేసుకుంటే చంద్రను సొంతం చేసుకోవచ్చునని, ఇప్పుడు కొత్తగా ఆమెను ‘వదినా’ అని వరుసపెట్టి పిలుస్తున్నాడు. వరుస ఏదైనా వాని దృష్టిలో వనితలందరూ భోగ వస్తువులే. ఈ సంగతి రాయహత్థి ఎప్పుడో కనిపెట్టింది. చంద్రహత్థిని వాళ్ల ఇంటి వద్ద వదిలిపెట్టి వస్తున్న రాయహత్థితోపాటు ఆమె ఇంటికి చేరుకొని, ఒంటరిగా ఉన్న ఆమెను వంకర బుద్ధితో చూస్తూ, “వదినా!” అన్నాడు. వాని పాప చింతనను గ్రహించిన రాయహత్థి ఇంటి గోడ మీద చిత్రించిన రామ లక్ష్మణ సీతల బొమ్మను చూపిస్తూ.. “మరది లక్ష్మణుండు, మరది యనంగ పో టిసుడె నిజముగ కపటీ! గ్రహించు చూడు రామచరిత సుందముగ గోడ మీద కలదు చదువుకోదగు నది. (గోడ మీద చిత్రించిన రామ కథను చక్కగా చూసి చదువుకొని గ్రహించు! మరిది అంటే లక్ష్మణునిలా ఉండాలి; మరిది అంటే పోటిసునిలా ఉండాలి అని నీకు తెలుస్తుంది. అందరూ నిజమైన మరుదులు కాలేరు! లక్ష్మణుని దారిలో నడవగలిగినప్పుడే నీవు మరిదివి కాగలవు!)” అన్నది.m కటిలుడు కుటిల స్వభావం గలవాడని లోకమంతా ఎప్పుడో గ్రహించింది. వానికి మాత్రమే ఇంతకాలం తాను నడుస్తున్న దారి సరైనది కాదని అర్థం కాలేదు. ఇప్పుడు రాయహత్థి మాటలతో కళ్లు తెరుచుకున్నాయి. తనది కాని దానికోసం ఆరాటపడటం అర్థరహితమని గ్రహించి తనను తాను పునస్సమీక్షించుకుంటూ తలవంచుకొని అక్కడి నుంచి కదిలినాడు.
తృప్తిగా నవ్వుకున్నది రాయహత్థి. అంతలోనే చంద్రహత్థి అక్కడ ప్రత్యక్షమై.. “పద! నేను సిద్ధం!” అన్నది. ఒక్కక్షణం ఒళ్లు జలదరించింది రాయహత్థికి. ‘అరే! మళ్లా ఏమైంది దీనికి? పిచ్చి తిరగబెట్టలేదు కదా!’ అనుకున్నది రాయహత్థి. “ఎక్కడికి?” అన్నది, భయాన్ని కప్పిపుచ్చుకుంటూ. “నా రాజు వద్దకు!” అన్నది సిగ్గుతో వంకర్లు తిరుగుతూ చంద్రహత్థి. ‘ఇప్పుడు దీన్ని కాదంటే మరింత గాయపడే అవకాశం ఉన్నది’ అనుకొని, రాయహత్థి యుక్తియుక్తంగా.. “హమ్మయ్య! ఇన్నాళ్లకు నీకు అన్నీ చక్కగా అర్థం అవుతున్నాయి. చంద్రా! నాకు చాలా ఆనందంగా ఉందే!” అంటూ గుండెకు గట్టిగా హత్తుకున్నది. అది చంద్రహత్థిలో ఆనందంతోపాటు ఆత్మవిశ్వాసాన్నీ పెంపొందించింది. “అక్కా!” అంది ఆనందబాష్పాలతో. “అవును చంద్రా! నీ ప్రాణాలన్నీ పోటిసుని మీదనే ఉన్నాయన్న సంగతి నాకు తెలుసులే! పోటిసుడు నీవాడే! అతను ఎప్పటికీ నీవాడే! నా మరిదిని దక్కించుకోవడం నీకే కాదు నాకూ ముఖ్యమే! అతను అతని కర్తవ్యాన్ని వెతుక్కుంటూ పోయినాడు; మనం అతన్ని వెతుక్కుంటూ పోదాం! అందుకు ఏం చేయవలెనో ఆలోచిద్దాం..” అన్నది అనునయంగా ఆమె వీపును నిమురుతూ.
ఆ మాట చంద్రహత్థిని అమితమైన భావోద్వేగానికి లోను చేసింది. రాయహత్థిని అల్లుకొని ముఖాన్ని ముద్దులతో ముంచెత్తింది. ఆమె కన్నీటి బిందువులతో రాయహత్థి ముఖం తుషార బిందువులను అలంకరించుకున్న కమలంలా మెరిసిపోయింది. ‘చంద్రహత్థి భావోద్వేగాలను అదుపులో పెట్టి సరైన మార్గంలో నడిపించడం ఎలా?’ అని ఆలోచిస్తుండగా, కటిలుడు మళ్లీ కనిపించినాడు. నిజానికి వాడక్కడి నుంచి వెళ్లనే లేదు. మనిషి ఒక్కక్షణంలో మారిపోవడం అనేది తరచూ జరిగే పని కాదు. పరివర్తన తేలికగా సంభవించేది కాదు. ఒక హఠాన్ పరిణామం, ఒక తీవ్రమైన మానసిక విఘాతం, ఒక అద్భుతం జరిగినప్పుడే మనిషిలో ఒక పరివర్తన సంభవిస్తుంది. లక్ష్మణుని కథ గుర్తుచేసిన రాయహత్థి మాటలు వాడిమీద చాలా ప్రభావాన్ని చూపినాయి. తన గురించి తాను ఆలోచించుకునేలా చేసినాయి. కానీ.. వాని ఆలోచనలు ఏ మార్పులు తీసుకొని వచ్చాయో, ఎటువైపు నడిపించడానికి వాణ్ని సన్నద్ధుని చేస్తున్నాయో కాలమే నిర్ణయించాలి! ఇంతకూ వాడు మళ్లీ రావడంలో వాని ఉద్దేశం ఏమిటో..
కటిలుడు కుటిల స్వభావం గలవాడని లోకమంతా ఎప్పుడో గ్రహించింది. వానికి మాత్రమే ఇంతకాలం తాను నడుస్తున్న దారి సరైనది కాదని అర్థం కాలేదు. ఇప్పుడు రాయహత్థి మాటలతో కళ్లు తెరుచుకున్నాయి. తనది కాని దానికోసం ఆరాటపడటం అర్థరహితమని గ్రహించి తనను తాను పునస్సమీక్షించుకుంటూ తలవంచుకొని అక్కడి నుంచి కదిలినాడు.