హిందూ సంప్రదాయంలో సిందూరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆంజనేయ స్వామికి ప్రియమైనది. ఈ సిందూరం చెట్టు కాయల నుంచి వస్తుంది. సిందూరం చెట్టును ‘లిప్స్టిక్ ట్రీ’ అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు శాస్త్రీయ నామం ‘బిక్సా ఒరెల్లానా’. సిందూర చెట్టుని పెరటిలో పెంచుకుంటే ఆ ఇంట్లోవాళ్లు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. దీని ఆకులు కాషాయ రంగులో ఉంటాయి. స్ట్రాబెర్రీల్లా ఉండే సిందూర కాయలు ప్రాంతాన్ని బట్టి ఎరుపు, మెరూన్ రంగుల్లో ఉంటాయి. కాయలోని గింజల నుంచి సిందూరం తయారవుతుంది.
సిందూరం ఉష్ణమండల నేలల్లో సులభంగా పెరుగుతుంది. మండు వేసవిలోనూ ఈ చెట్టు కింద కూర్చుంటే ఏసీలో ఉన్నట్టుగా చల్లగా ఉంటుంది. దక్షిణాది రాష్ర్టాల రైతులు సిందూర చెట్లను వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. విత్తనాల ద్వారా, కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేసుకోవచ్చు. ఈ చెట్టు మహావృక్షం కాదు. కానీ, పెద్ద చెట్టే. దీనిని ఎటువంటి చీడ పీడలు ఆశించవు. నాటిన మూడు ఏండ్లకు పుష్పించి, కాయలు కాస్తాయి. పక్వానికి వచ్చిన కాయలు విచ్చుకుని లోపలి గింజలు బయటికి కనిపిస్తాయి. గుత్తులుగా కాసే ఈ కాయలు పల్లేరు కాయల్లా ముళ్లు కలిగి వుంటాయి. వీటిని క్యాప్సుల్స్ అంటారు.
పండిన కాయ సగం మూత తెరిచినట్టుగా పైకి లేస్తుంది. కానీ ఒక్క గింజ కూడా బయటికి పోదు. ఎండిన కాయలు సేకరించి, కర్రలతో కొట్టి గింజలను రాలుస్తారు. వీటి ఉత్పత్తులు సహజ రంగుల కోసం వస్త్ర పరిశ్రమలో, సౌందర్య సాధనాల తయారీ, ఆహార పరిశ్రమలో విరివిగా వాడతారు. యాంటి ఆక్సిడెంట్, యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వల్ల చర్మ సమస్యలు తొలిగిపోవడానికి, జీర్ణక్రియ సాఫీగా సాగడానికి, జ్వరానికి విరుగుడుగా సిందూరాన్ని ఔషధంగా వాడతారు. సింథటిక్ రంగులతో నకిలీ సిందూరం తయారు చేస్తున్నారు. దీనిని వాడితే దురద కలుగుతుంది. చర్మంపై నల్ల మచ్చ ఏర్పడుతుంది.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు