ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లాలంటే బయటికి రావాల్సిందే. కానీ, ఆ ఊరిలో ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లడానికి గడప దాటితే చాలు. ఆరుబయటికి రావాల్సిన అవసరమే లేదు. ఎండ, వాన, మంచు భయమే లేకుండా ఆ ఇంటికీ ఈ ఇంటికీ హాయిగా తిరగొచ్చు. ఇంత అద్భుతమైన ఇళ్లు ఎక్కడున్నాయి? ఎవరు కట్టారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయిదువేల ఏళ్ల క్రితం నవీన శిలాయుగపు మానవులు కట్టుకున్న కాలనీ అది!
Skara Brae | స్కాట్లాండ్లోని ఓర్క్నీ దీవి పశ్చిమ తీరంలో స్కారా బ్రే గ్రామం ఉంది. చారిత్రక యుగానికి పూర్వం నాటి జీవన విధానాన్ని స్కారా బ్రేలోని ఆనవాళ్లు కళ్లకు కడుతున్నాయి. ఇక్కడ అనేక ఇళ్లను ఒకే ప్రదేశంలో గుర్తించారు. ఇవన్నీ ఒకే విధమైన వైశాల్యంలో, ఒకే విధమైన నిర్మాణంతో ఉన్నాయి. ఈ ఇళ్లను దీర్ఘచతురస్రాకారంలో, సమాన ఘన పరిమాణంలో ఉన్న రాతి పలకలతో నిర్మించారు. ప్రతి ఇంటిలో ప్రత్యేకమైన వసతి కోసం ప్రదేశాన్ని కేటాయించారు. వస్తువులు భద్రపర్చుకునేందుకు గోడల్లో అరలు ఏర్పాటు చేసుకున్నారు. అనేక అరలు ఒకదాని కింది మరొకటి కనిపిస్తాయి. స్కారా బ్రేలోని పురాతన నిర్మాణాలు క్రీ.పూ. 3180 నుంచి క్రీ. పూ. 2500 మధ్య కాలానివి. ఐరోపా నాగరికతలో పూర్తిగా నవీన శిలాయుగ నాగరిక వాసులు నివసించిన ప్రదేశం ఇది. ఈ ఆవాసం ఈజిప్ట్‌లోని గిజా పిరమిడ్ (క్రీ.పూ. 2500), ఇంగ్లండ్‌లోని స్టోన్‌హెంజ్ (క్రీ.పూ. 3100) నిలువురాళ్ల వలయం కంటే ప్రాచీనమైనది. అందుకే ఇది ఐరోపా చరిత్రలో అత్యంత ప్రాధాన్యం కలిగినదని గుర్తించి, ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించింది.
ఈ ఇంటి ద్వారానికి రంధ్రాలు చేసి, ఎముకలను గడియగా ఉపయోగించారు. అతి శీతలమైన వాతావరణంలో బయటికి వెళ్లకుండా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి చేరుకోవడానికి సొరంగాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటి పడకింట్లో బెడ్ ఉన్నట్టే స్కారా బ్రేలో బయటపడ్డ ఇళ్లలోనూ రాతి మంచాలను గుర్తించారు. నేడు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ముస్తాబైనట్టే ఆనాటి ఆదిమ మానవులు అలంకరించుకునేందుకు కావాల్సిన అలంకారాలన్నీ ఒకే అరలో పెట్టుకునేవాళ్లు. కూర్చోవడం కోసం రాతి పీటలు తయారు చేసుకున్నారు. ఈ పురాతన ఆవాసంలో ఉన్న ఏడు ఇళ్లలోని ఫర్నిచర్ ఒకే విధంగా, ఒకే దిక్కులో ఉండటం విశేషం. ఇంటి ద్వారానికి ఎదురుగా అలంకరణకు ఉపయోగించే వస్తువులు పెట్టుకునే అరలు ఉన్నాయి.
ఈ ఇళ్లలో నిల్వ చేసుకునే పెట్టెలు, అలంకరణకు ఉపయోగించే ప్రత్యేకమైన ఏర్పాట్లున్న ప్రదేశం లేదు. కానీ, చెల్లాచెదురుగా పడి ఉన్న ఎముకలు, దుప్పి కొమ్ములు తవ్వకాల్లో గుర్తించారు. ఈ ఇళ్లలో మంచం లేదు. కానీ, ప్రత్యేకమైన అవసరాల కోసం తయారు చేసుకున్న పనిముట్లు లభించాయి. ఎముకలతో తయారుచేసిన సూదులు, రాతి గొడ్డళ్లను గుర్తించారు. రాతిని అరగదీసి నీటిని, ఆహారాన్ని దాచిపెట్టుకునేందుకు తయారుచేసిన పెట్టెలు, పాత్రలు ఉన్నాయి. మట్టికుండలు కూడా అక్కడ లభించాయి. అక్కడ దొరికిన కళాఖండాలు వీళ్లకు కళా ప్రవేశం కూడా ఉందని రుజువుచేశాయి. రాతి వస్తువులపై గీసిన బొమ్మలున్నాయి. 1970లో జరిపిన తవ్వకాల్లో బార్లీ ఆనవాళ్లు దొరికాయి. ఇళ్లలో సముద్రపు చేపముళ్ల కుప్పలు బయటపడ్డాయి. ఒక రాతి పెట్టె నిండా నత్త గుల్లల కర్పరాలను గుర్తించారు. రాతి పెట్టెలను ఆహార నిల్వ కోసం ఉపయోగించేవారని, సముద్రపు వేట సాగించారని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఉత్తర ఐరోపాలో చలి అధికంగా ఉంటుంది. అత్యల్ప ఉష్ణోగ్రతల్లో ఉన్నప్పుడు ఇంట్లో వేడిని పెంచేందుకు కట్టెలు కాలుస్తారు. ఈ మంటలు వ్యాపించకుండా ఉండేందుకు ఇంటి నిర్మాణంలో భాగంగా గూడులాంటి పొయ్యి నిర్మిస్తారు. ఇది మన ఇళ్లలో ఎప్పుడూ నివురు గప్పిన నిప్పు ఉండే దాలి పొయ్యి లాంటిది. ఇలాంటి ఏర్పాటు అయిదు వేల ఏళ్లనాటి ఈ ఇళ్లలోనూ ఉండటం విశేషం. ప్రతి ఇంటిలో కట్టెలు కాల్చేందుకు రాతి పలకలతో గూడు నిర్మించారు. ఆ మంట వల్ల వచ్చే పొగ బయటికి పోవడానికి రాతి గోడకు చిన్న రంధ్రం పెట్టారు. దాలిలో కాల్చడానికి కట్టెలు, పేడను ఉపయోగించినట్టుగా అక్కడి ఆనవాళ్లను బట్టి పురావస్తు పరిశోధకులు గుర్తించారు. ఈ ఇళ్లను దర్శించడానికి ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే అనుమతిస్తారు. ఈ ఏడాది మార్చి 28 వరకు పర్యాటకులు సందర్శించవచ్చు.
ప్రతి ఇంటిలో రెండు రాతి మంచాలను పరిశోధకులు గుర్తించారు.. అందులో ఒకటి పెద్దది. మరొకటి చిన్నది. పెద్ద మంచం గదిలోప ఎడమవైపు మూలలో ఉంది. చిన్న మంచం కుడి వైపు మూలలో ఉంది. ‘హెబ్రిడియన్ ఆచారం ప్రకారం భార్యకు చిన్న మంచం, భర్తకు పెద్ద మంచం కేటాయిస్తారు. ఈ ప్రదేశంలో గుర్తించిన ఇళ్లలో కూడా రెండు రకాల మంచాలు ఉన్నాయి. 20వ శతాబ్దం వరకు కొనసాగిన హెబ్రిడియన్ ఆచారానికి 5 వేల సంవత్సరాల చరిత్ర ఉంది.’ అని చరిత్రకారుడు, పురావస్తు శాస్త్రవేత్త లాయిడ్ లేయింగ్ చెబుతున్నారు.