Jaya Senapathi | జాయ సేనాపతి.. చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ : తన కొడుకు హరిహరుని మీద రాజవైద్యుని సహాయకుడు కొండుభొట్లు విషప్రయోగం చేసినట్లు అక్క నారాంబ చెప్పడంతో తీవ్ర ఉద్రేకానికి గురయ్యాడు జాయపుడు. కొండుభొట్లు హత్య కూడా అంతఃపుర ప్రయోగమేనని తెలిసి మ్రాన్పడిపోయాడు. మరునాడు చక్రవర్తి కొలువుకు వెళ్లాడు.
జరిగిన కథ : తన కొడుకు హరిహరుని మీద రాజవైద్యుని సహాయకుడు కొండుభొట్లు విషప్రయోగం చేసినట్లు అక్క నారాంబ చెప్పడంతో తీవ్ర ఉద్రేకానికి గురయ్యాడు జాయపుడు. కొండుభొట్లు హత్య కూడా అంతఃపుర ప్రయోగమేనని తెలిసి మ్రాన్పడిపోయాడు. మరునాడు చక్రవర్తి కొలువుకు వెళ్లాడు. జాయపుణ్ని కొంతకాలం వెలనాడు మండలేశ్వరునిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు చక్రవర్తి గణపతిదేవుడు. అయితే.. తను ఇక్కడ లేకపోతే తన అక్క, మేనల్లుళ్ల రక్షణ ఏమిటి?? అని ఆలోచిస్తూనే.. రాజపత్రం అందుకున్నాడు జాయపుడు.
చతుర్ధ, పంచమ కులస్తులతో సహా అన్ని సామాజికవర్గాలు.. గ్రామరట్టలు, కరణాలు, విద్యావంతులైన పండితులు, సాహితీవేత్తలు, కళాకారులు, సమయాల సెట్టిలు, అవదేశిలు, పరదేశిలు, నానాదేశి పెక్కండ్రు, పంచాణం వారు, స్థపతులు, స్థానాపతులు, విదేశీ బేహారులు.. ఎంతోకొంత ప్రపంచ అవగాహన ఉన్నవారు కాబట్టి అన్నివృత్తులలో మేధావివర్గం అధికంగా ఉన్న ప్రాంతం వెలనాడు.
ఇటు సముద్రతీరం వల్ల విదేశీవ్యాపారంతో కోట్ల కోట్ల రూకల డబ్బు, మణుగుల కొద్దీ విదేశీ బంగారం ఇళ్లలో పాతరలు వేసి, గాదెల్లో పోసి, పుర్రెలు కట్టి మహారాజులకే అప్పులు ఇవ్వగల వణిక్ ప్రముఖులు, బలింజ వర్తకులు గ్రామగ్రామానా ఉన్నారు. చరిత్ర తొలిరోజుల్లోనే విదేశీ వాణిజ్యం జరుపుతూ ఐరోపా, మధ్య ప్రాచ్య, తూర్పు దేశాలలో విస్తృతంగా వాణిజ్య కార్యకలాపాలలో రాటుతేలిన మహానావికుల స్వర్ణభూమి వెలనాడు.
వెలనాడుకు ఉన్న ఒకే ఒక్కశాపం అతివృష్టి, అనావృష్టి. ఇంత సౌభాగ్యం.. ఒక్క తుపానుతో సముద్రం పాలవుతుంటుంది. మళ్లీ కొత్త వ్యవసాయం మొదలుపెడతారు.. బతికి ఉన్న రైతులు. ఇటు పడమట ప్రాంతం కర్మనాడు.. అదే కమ్మనాడుగా పిలుస్తున్నారు. విశ్వకర్మ వారసులుగా చెప్పుకొనే కార్మికులు.. ఏ వ్యాపారం, ఏ కోట నిర్మాణం, ఏ దేవాలయ నిర్మాణం, ఏ బిడారు.. దేనికైనా నాణ్యమైన అత్యుత్తమ సాంకేతిక నిపుణులు, మేధావులు, నిపుణులైన కార్మికులు దొరికేచోటు కర్మనాడు. నాణ్యమైన బట్టను నేయడంలో ఈ రాజ్య నేతపనివారు ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. రవ సెల్లాలు లేదా మస్లిన్ అనే పేరుతో ఇక్కడ నేసే వస్త్రం బుద్ధుని కాలానికి ముందే ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. రాజకుటుంబాల వారికి కూడా కొనడానికి దొరకదు. పూర్తిగా ఎగుమతి ద్వారా గ్రీకు, రోమన్ దేశస్తులే.. కోరినంత బంగారం సంవత్సరాల ముందే చెల్లించి ముందస్తు ఒప్పందాల ద్వారా కొనుగోలు జరుపుతుండటం ఈ వస్త్రానికున్న ప్రత్యేకత. అలాగే నౌకా వ్యాపారం, నౌక నిర్మాణ సంస్థలు, నౌక మరమ్మత్తులు.. తోపాటు విదేశీ నౌకలు వచ్చినప్పుడు జరిగే చిల్లర వ్యాపారం ఈ గ్రామాల వాసులకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెడుతున్నాయి. ఎంతోమంది కులీనులు ఆయా విదేశాలకు వెళ్లి వ్యాపారసంస్థలు, కూటములు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడి వాస్తు, శిల్పకళా చాతుర్యతను మరింత రంగరించి వెళ్లిన చోటల్లా ఎన్నెన్నో దేవాలయాలు నిర్మిస్తున్నారు. అక్కడే స్థిరపడుతున్నారు. రాజ్యాలు స్థాపిస్తున్నారు కూడా.
అలాంటి ప్రజా స్వర్గసీమ వెలనాడుకు రాజధాని ధనదప్రోలు. ధనదవ్రోలు, ధనదవోలు, సనదవోలు, సనదుపోలు.. ఇలా సామాన్య ప్రజలు, సాహితీవేత్తలు, శాసన లిపికారులు వారి ఇష్టానుసారం రాసే, పలికే ఈ ఊరుకు అసలు అర్థం.. కుబేరపురం. ధనదుడు అంటే కుబేరుడు. ధనవంతుల ఊరు కాబట్టి ధనదుపురం అన్నారు. మరోవిశేషం ఏమిటంటే.. నిజంగానే కుబేరుడు అనే మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. ప్రస్తుత పాలక కుటుంబమైన అయ్యవంశంవారి మరో వారసుడు జాయప సేనాపతి ఇప్పుడు వెలనాడు మండలేశ్వరుడు కాబోతున్నాడు.
పినచోడుడు పరమపదించాక ఆయన పెద్ద కొడుకు పృథ్వీశ్వరచోడుడు పరిపాలనకు రాగా.. ఇప్పుడు హఠాత్తుగా ఆయన రెండవ కుమారుడు జాయపచోడుణ్ని వెలనాడు మండలేశ్వరునిగా పంపించాడు చక్రవర్తి గణపతిదేవుడు. యుద్ధవీరుడుగా, నాట్యాచారుడిగా పేరొందిన జాయపుడు తమవాడుగా తమ రాజ్యానికే మండలేశ్వరుడిగా రావడం.. వెలనాడు ప్రజలకు మరింత ఆనందంగా ఉంది. ఆరోజు ఆయన సింహాసనం అధిష్ఠించబోతున్న రోజు.. తండోపతండాలుగా తరలివచ్చిన ప్రజలతో ధనదప్రోలుకోట రాజనగరులో సమావేశ మందిరం కిటకిటలాడుతున్నది. జాయపుడు తలగడదీవిలో పుట్టినా ఎక్కువకాలం అనుమకొండలో పెరగడంవల్ల.. బాలుడిగా కూడా చూడని ఇప్పటి మహామంత్రులు, సేనానులు, నియోగాధిపతులు, భటులు, పరిచారికలు సైతం ఎప్పుడెప్పుడు ఆయనను చూద్దామా అని ఉవ్విళ్లూరుతున్నారు.
“అక్కల కోసం.. చెప్పాపెట్టకుండా ఏదో గూడుబండి ఎక్కి అనుమకొండ వెళ్లిపోయాడట!”. “అక్కడ వీధుల్లో బిచ్చమెత్తుకున్నాడట!”. “ఛ ఛ.. తప్పు! చక్రవర్తే నాట్యం నేర్పించాడట. అంటే చక్రవర్తి చేరదీసినట్లే కదా!”. “అది తర్వాత. ముందు ఆయనను చేరదీసింది ఆస్థాన వేశ్య, మహాకళాకారిణి నీలాంబిక. ఆమెను ఈయనగారు ‘అక్కా’ అని పిలుస్తాడు. అబ్బ.. ఆయన నాట్యం చేస్తుంటే చూడాలి.. అదిరిపోతుందట!”. “నాట్యం సంగతేమో గానీ గొప్ప యుద్ధవీరుడట. యుద్ధభూమిలో కత్తివేటుకు నలుగుర్ని నరకగలడట!”. “గుర్రాలు, ఏనుగులు ఆయన చెప్పినట్లు చేస్తాయట. యోజనాల దూరం నుంచి సంజ్ఞ చేస్తే శత్రువును తొక్కి తొక్కి చంపేస్తాయట!”.
“ఏమా ప్రతిభ.. అలాంటివాడు మన మహారాజంటే.. తిప్పరా మీసం”. “మనదృష్టం. ఇటు కత్తి తిప్పడంలో అటుకాలుకదపడంలో.. రెండిటిలో గొప్పోడు అంటే చరిత్రలో చాలా గొప్పోడన్న మాట!”. “నిజమే.. ఇట్టాంటోడు మనకు తెలినంతవరకూ మరొకడు లేడు. అది మన అదృష్టం”. ప్రజలు గుసగుసలాడుతుండగా మందిరంలోకి ప్రవేశించాడు జాయపుడు. నిలువెత్తు అందానికి ప్రతిరూపమైన జాయపుడు.. చీనీ ఎర్రపట్టు ధోవతి కట్టి, ముందు వెనకా కుచ్చుళ్లు పోసి పచ్చని అంచులుతీసి బయటికి కనిపించేలా పైకిలాగి నడుము వద్ద దోపాడు. పసిడి ఉత్తరీయం నడుముకు చుట్టి దానిపై రత్నాలు పొదిగిన బంగారు మొలతాడు.. దానిలో పచ్చల పిడిబాకు, పక్కగా పొడవుగా వేలాడుతున్న బంగారు ఒరతో ఖడ్గం.. పైన నీలపు కంచుకం.. ఆపైన రంగురంగుల తలపాగాతో వినయవంతుడైన మహాయోధుడిలా భాసిల్లాడు.
అక్షతలు చేతపట్టి వేదమంత్రాలు పఠిస్తున్న పండితోత్తములు, సంప్రదాయ ఛత్ర, కేతన, చామరాలు అలంకరిస్తున్న మంత్రివర్యులు, వింజామరలు పట్టుకున్న పరిచారికలు, అడపంధారి, మండలేశ్వరుని ఆంతరంగిక నిర్వహణాధికారి.. అందరూ కళ్లు విప్పార్చి ఆ సుందర దృశ్యాన్ని కళ్లలో నింపుకొంటున్నారు. వందిమాగధులు వినసొంపుగా స్తోత్ర వర్ణనలు చేశారు.
“కాకతీయసామంత వెలనాడు మండలేశ్వరా.. జాయప చోడా జయహో.. జయ జయ జయ జయహో.. జయ జయ జయ జయహో!!”.. సమస్త ఆహూతులు అక్షతలతో.. ‘దీర్ఘాయుష్మాన్ భవ’ అని ఆశీర్వదించారు. పట్టాభిషేక క్రతువు పూర్తయ్యాక బాబయగారు బ్రహ్మయ్యను, అన్న పృథ్వీశ్వరుణ్ని చెరో పక్కకు పిలిచి.. భుజాలపై చేతులుంచి చెప్పాడు కొత్త మండలేశ్వరుడు జాయపచోడుడు.
“నా వెలనాడు ప్రజలకు నమస్కారం!
మహోన్నత కాకతీయ సామ్రాజ్యంలో భాగమైన వెలనాడు సీమకు మండలేశ్వరుడిగా నేను ప్రమాణం చేశాను. మహామనిషి, మహామండలేశ్వరులు శ్రీశ్రీశ్రీ గణపతిదేవులవారి మాటపై నేనీ పదవిని అధిష్ఠించాను. నిజానికి నాలుగుతరాలుగా మా అయ్యవంశంవారు ద్వీపసీమను పరిపాలిస్తున్నారు. వెలనాడును జయించిన చక్రవర్తి దయతో మా తండ్రిగారిని వెలనాడుకు సామంత ప్రభువుగా నియమించారు. నేడు నన్ను ఆ బాధ్యతలు తీసుకోమన్నారు. అంతా వారి ఆజ్ఞ. కాదు అనే సాహసం నాకులేదు. కారణం నా జీవితం వారికి అంకితం. అయితే ఇక్కడ నేనున్నా, అన్న ఉన్నా, బాబయగారున్నా ఒక్కటే. పాలన వారే ఎప్పటిలాగే నిర్వహిస్తారు. అందరూ తమ తమ సమస్యలు చెప్పుకోవచ్చు. మనపై ఎవ్వరూ చిన్న మట్టిగెడ్డ కూడా విసరలేరు. రక్షణ నా బాధ్యత. సుఖవంతమైన జీవితం, సంపద పెంచడం మీ బాధ్యత. అందుకు సదా ఆ రుద్రేశ్వరుడు మనల్ని కాపాడుతుంటాడు. నా సింహాసనాధీష్ట మహోత్సవం సందర్భంగా వృత్తి కాణికలను, గుడ్డేగు మాడలను, పుట్టి హండి, పుట్టి కొలువు, ఉపకృతి, పశువుల పుల్లరి రద్దు చేస్తున్నాను!”..
పట్టాభిషేకం సమయాన తప్ప మరెప్పుడూ జాయపుడు ఆ సింహాసనంలో కూర్చోలేదు. * * * మంచికో చెడుకో తగిన సమయంలోనే చక్రవర్తి కొత్త బాధ్యతలు జాయపుని నెత్తిన పెట్టాడు. అనుమకొండలో వీడ్కోలు తీసుకుంటూ అంతఃపురం వెళ్లాడు జాయపుడు. నారాంబ కన్నీరుమున్నీరయ్యింది. తమ్ముణ్ని ఆర్తిగా అల్లుకుంది. “తమ్ముడు మండలేశ్వరుడైనందుకు సంతోషించాలో.. నాకున్న ఒకే ఒక్క తోడు దూరం అవుతున్నందుకు బాధపడాలో తెలియడంలేదు..”అక్క, మేనల్లుళ్లపై కుట్రలు జరుగుతున్న సమయంలో వాళ్లకు దూరం కావాల్సిరావడం.. జాయపుణ్ని కొంత విచికిత్సకు లోను చేసింది. ఆ భయాన్ని తొలగిస్తూ అభయమిచ్చాడు గణపతిదేవుడు.
“నీ అక్కకు, నీ మేనల్లుళ్లకు వచ్చిన బాధలేమీలేవు. పట్టమహిషి తత్వం తెలిసినవాడిగా ఇద్దరి మధ్య అడ్డుగోడలు కట్టించాం. మళ్లీ కొన్నాళ్ల తర్వాత ఆ గోడలు మేమే తొలగించాం. తప్పుచేశామా.. లేదు. తత్వాలు బయటపడతాయి. సంఘర్షిస్తాయి. రానురానూ సర్దుకుంటాయి. ఇద్దరూ ఒకటవుతారు. చూస్తుండు!”. అక్కాపిల్లలను ఆయన కంటే తను బాగా చూసుకోగలడా.. లేదు కాక లేదు. ఆయన దూరదృష్టిని గుర్తించి మనసు ఆహ్లాదపడింది. వంగి ఇద్దరి కాళ్లకూ నమస్కరించాడు. ఇద్దరూ కాస్త తటపటాయించి.. ఇబ్బందిగా కదలడం జాయపుడు గుర్తించాడు. “అక్కా.. ఏమిటి? చెప్పు.. ఏమైనా చెప్పాలని.. చెప్పలేక!”.. గణపతిదేవుడు ముందుగా ప్రస్తావనగా అన్నాడు. “అదే.. నీ వివాహం. నీకొక కుటుంబం ఏర్పడితే బావుంటుందని మేమిద్దరం ఆశ పడుతున్నాం జాయా.. మీ అక్క ఈ విషయమై తీవ్ర వ్యధ చెందుతున్నది..”
“అవున్రా.. జాయా! నువ్వొక ఇంటివాడివైతే మాకు కాస్త అలజడి తగ్గుతుంది”. నిజానికి వాళ్లిద్దరూ తనను ఆజ్ఞాపించి పెళ్లి చెయ్యగల అధికారం ఉన్నవాళ్లే. కానీ, తడుముకుంటూ మాటలు కలుపుకొంటూ వాక్యాలు పూర్తిచేయడం.. ముఖ్యంగా చక్రవర్తి అలా అభ్యర్థిస్తున్నట్లు మాట్లాడటం.. కదిలిపోయాడు జాయపుడు.. ఏమి చెప్పాలి.. లోలోపలి సంఘర్షణ జ్వలించి జ్వలించి కొంత స్థిరత్వాన్ని పొందింది. “ప్చ్.. మీకు ఇలా జవాబు ఇవ్వాల్సిన సమయం వస్తుందని అనుకోలేదు బావగారూ. నేనొక అమ్మాయిని.. ఓ గ్రామీణ యువతిని ఇష్టపడ్డాను. నిజానికి ఇద్దరం ఏకమయ్యాం.. మానసికంగా శారీరకంగా. కానీ కానీ ఆమె నన్నొక దురూహతో వదిలి మాయమైంది. నేనెంత సతమతమయ్యానో.. నన్ను మళ్లీ మనిషిని చెయ్యడానికి మీరెంత సతమతమయ్యారో అందరికీ తెలుసు. ఆమె.. ఆమె భావనలు.. అనునిత్యమూ నన్ను వదలడంలేదు. ఆమె నాలోనే నాతోనే ఉన్నట్లు.. దగ్గరగా.. కాస్త దూరంగా.. కనిపించి కనిపించకుండా నేనే తన ప్రాణంగా తిరుగాడుతున్నది. అందువల్ల నేను మరో స్త్రీని భార్యగా స్వీకరించలేను. ఏదోనాటికి ఆమె నన్ను చేరుతుంది. అప్పటివరకు నేను నిరీక్షించాల్సిందే!”..
ఇద్దరూ నిరత్తరులయ్యారు. “మీరిద్దరూ నాకు దేవతలు. నా పెళ్లి ప్రసక్తి మళ్లీ నావద్ద తేవద్దని మీ ఇద్దరిని ప్రార్థిస్తున్నాను”. అప్రయత్నంగా ఆమె కళ్లు కన్నీటి సంద్రాలయ్యాయి. చీర కొంగుతో కళ్లు ఒత్తుకుంది. తల తిప్పుకొన్న భర్త కళ్లు ఒత్తుకోవడం ఆమె కంటపడలేదు. ఇద్దరూ కాస్త తేరుకుని చూస్తే జాయపుడు అక్కడ లేడు. వారిద్దరికీ స్పష్టంగా అర్థమైంది. జాయపుణ్ని మరెప్పుడూ.. ‘పెళ్లి చేసుకో!’ అని అడగడం కుదరదు!! (సశేషం)
నిజానికి వాళ్లిద్దరూ తనను ఆజ్ఞాపించి పెళ్లి చెయ్యగల అధికారం ఉన్నవాళ్లే. కానీ, తడుముకుంటూ మాటలు కలుపుకొంటూ వాక్యాలు పూర్తిచేయడం.. ముఖ్యంగా చక్రవర్తి అలా అభ్యర్థిస్తున్నట్లు మాట్లాడటం.. కదిలిపోయాడు జాయపుడు.. ఏమి చెప్పాలి.. లోలోపలి సంఘర్షణ జ్వలించి జ్వలించి కొంత స్థిరత్వాన్ని పొందింది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

