మంగళవారం 26 మే 2020
Sunday - May 17, 2020 , 00:48:43

ఈ అబ్బాయిచాలా మంచోడు!

ఈ అబ్బాయిచాలా మంచోడు!

ఎన్నో సీరియల్స్‌లో నటించాడు. కాస్త రఫ్‌గా.. కాస్త స్మార్ట్‌గా కనిపించినా.. ‘బిగ్‌బాస్‌'తో పూర్తి పిక్చర్‌ చూపించాడు.. అతనేమిటో.. అతడి వ్యక్తిత్వమేమిటో అందరికీ అర్థమైంది.. అంతా మంచోడని ముద్ర వేసేశారు. ఆ చట్రం నుంచి బయటపడటానికి కొంత నెగెటివ్‌ టచ్‌ ఉన్న పాత్ర ఒప్పుకొన్నా.. బయటకు వెళితే మాత్రం ‘ఓయ్‌.. మంచోడా’ అనే పిలుస్తారు. అతనే క్యూట్‌.. స్మార్ట్‌.. బుల్లితెర స్టార్‌ రవికృష్ణ.

ఇంట్లో సినిమాలు బాగా చూసేవాళ్లం. మెగాస్టార్‌ అంటే ఒకరకమైన పిచ్చి. దేవుడిలా భావించేంత అభిమానం. చిన్నప్పుడు స్కూల్‌లో టీచర్‌ ‘ఏమవుతావు?’ అని అడిగితే, యాక్టర్‌ అని చెప్పా. ఇంట్లో కూడా అదే మాట చెబితే..  ‘మన ఇంట్లో మొదటి ఇంజినీర్‌ నువ్వే కావాలి’ అంటూ బ్రెయిన్‌వాష్‌ చేశారు. కానీ అది నా మీద పనిచేయలేదు. ఇంటర్‌ అయ్యాక సినిమా మీద మక్కువ మరింత పెరిగింది. ఆ సమయంలో మా మేనత్త భర్త (మామయ్య) నా వైపు నిలబడి,  ఇంట్లో వాళ్లతో మాట్లాడాడు. ఇంజినీరింగ్‌ చదివించి డబ్బులు దండుగ చేయడం ఎందుకు? ఎలాగూ ఇండస్ట్రీకి వెళతానంటున్నాడు కాబట్టి, డిగ్రీలో చేర్పిద్దామని ఒప్పించాడు. అలా,  డిగ్రీ చేశా. ఐసెట్‌ కూడా రాశాను. మంచి ర్యాంకు వచ్చింది.

చెన్నై పయనం: డిగ్రీ అయ్యాక ఇంట్లోవాళ్లు ఎంసీఏ చేయమన్నారు. ఆ తర్వాత, ఇండస్ట్రీకి వెళ్లొచ్చని సర్దిచెప్పారు. నేను ససేమిరా అన్నాను. ఎలాగూ కౌన్సెలింగ్‌కి మూడు నెలల గడువు ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో నా అదృష్టాన్ని పరీక్షించుకుంటానని  చెన్నైకి బయలుదేరాను. నా ఫ్రెండ్‌ అక్కడ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసేవాడు. ఐదువేల రూపాయలు జేబులో పెట్టుకుని ట్రైన్‌ ఎక్కాను. పది రోజుల్లోనే  డబ్బులు అయిపోయాయి. ఆ కొంచెం సమయంలోనే  నా ఫ్రెండ్‌ పరిస్థితి  అర్థమైంది. అయినా రెండు మూడు రోజులు షూటింగ్‌లు చూస్తూ గడిపాను. నాలుగో రోజు అనుకుంటా, నా ఫ్రెండ్‌ పనిచేసే సీరియల్‌ డైరెక్టర్‌ కమ్‌ ప్రొడ్యూసర్‌ గణేష్‌ రాజేందర్‌ నన్ను పిలిచాడు. నా వివరాలు తెలుసుకున్నాడు. ‘ఈ రోజు నుంచి నా దగ్గర నువ్వు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నావు. రోజుకు 50 రూపాయల జీతం’ అని చెప్పాడు.

అసిస్టెంట్‌ నుంచి: అసిస్టెంట్‌గా తమిళ సీరియల్‌కి కొన్నిరోజులు పనిచేశాను. ఆ తర్వాత ఆ డైరెక్టర్‌ తెలుగులో చేస్తుండటంతో నన్నూ దానికి పనిచేయమన్నారు.  ఆడిషన్‌లు జరుగుతున్నప్పుడు అందరికీ సీన్‌ పేపర్లు ఇచ్చి ఎలా చేయాలో చెబుతుండేవాడిని. అది డైరెక్టర్‌గారు గమనించారు. నన్ను కూడా ఆడిషన్‌ చేసి ఓ పాత్రకు తీసుకున్నారు.  ‘విజయం’ అనే తెలుగు సీరియల్లో పనిచేశా. కానీ అది విజయం సాధించకపోవడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. తెలిసిన వాళ్లు హైదరాబాద్‌ వెళితే మంచిదని సలహా ఇచ్చారు.  రోజంతా బైక్‌ వేసుకొని అవకాశాల కోసం తిరుగుతుండేవాణ్ణి. మళ్లీ రెండు నెలలు ఒక సీరియల్‌కి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశా. అప్పుడే ‘మొగలిరేకులు’ సీరియల్‌ ఆడిషన్‌ గురించి తెలిసి వెళ్లాను. అవకాశానికి నానా కష్టాలూ పడ్డాను. అందులో మంచి పేరు తెచ్చుకున్నా. ఆ తర్వాత సోలో హీరోగా చాలా సీరియల్స్‌ చేశాను.

బిగ్‌బాస్‌తో: స్టార్‌ మాతో నాకు మొదటి నుంచీ మంచి అనుబంధం ఉంది. శ్రీనివాస కల్యాణంతో మాటీవీలో అడుగుపెట్టాను. చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత సుందరకాండ. అదీ టర్నింగ్‌ పాయింట్‌. ఇక, బిగ్‌బాస్‌. నా క్యారెక్టర్‌ని ఎక్కడా మార్చుకోకుండా స్థిరంగా ఉన్నా. అది అందరికీ నచ్చింది. ఏదైనా ఒక పని ఒప్పుకొంటే, దానికి 100 శాతం న్యాయం చేస్తా. అలా నా జీవితం బిగ్‌బాస్‌కి ముందు బిగ్‌బాస్‌ తర్వాత అని కూడా చెప్పుకోవచ్చు. అంతలా మారిపోయింది. బిగ్‌బాస్‌ నుంచి బయటకి వచ్చాక మాటీవీ ఇంకో మంచి ఆఫర్‌ ఇచ్చింది. ‘ఆమె కథ’ సీరియల్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చా. బిగ్‌బాస్‌కి ముందు చిన్నచిన్న రోల్స్‌ వచ్చాయి. ఒకసారి అయితే ‘దూకుడు’ సినిమాలో ఒక కాప్‌గా అడిగారు. కానీ ఆ సమయంలో డేట్స్‌ కుదరక చేయలేదు. ఇప్పటికీ ఆ బాధ ఇంకా వెంటాడుతున్నది. ప్రస్తుతం రాజ్‌తరుణ్‌ సినిమాలో విలన్‌గా చేసే ఛాన్స్‌ వచ్చింది. లాక్‌డౌన్‌ అయ్యాక షూటింగ్‌ జరుగుతుంది. మొదటిసారి వెండితెర మీద కనిపించబోతున్నా. మంచి పాత్రలు వస్తే తప్పకుండా సినిమాల్లో చేస్తాను. మాస్‌ క్యారెక్టర్‌  ఇష్టం.

పెండ్లి ఆలోచన..

అమ్మానాన్నా చూసిన అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్‌ అయ్యా. లవ్‌మ్యారేజ్‌ ఆలోచన ముందు నుంచీ లేదు. నా ఫ్యామిలీకి సెట్‌ అయ్యేలా, సోల్‌మెట్‌ అనిపించే అమ్మాయి ఇప్పటి వరకు నాకు తారసపడలేదు. పైగా చిన్నప్పటి నుంచి నా దారి నేను చూసుకుంటే...  అక్కాచెల్లి పరిస్థితి ఏంటి? అని ఆలోచిస్తూ పెరిగాను. అందుకేనేమో ప్రేమ అనేది నాకు ఎక్కలేదు. ఇప్పటికైతే సీరియస్‌గానే అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారు అమ్మానాన్నా.నేను పుట్టి పెరిగిందంతా విజయవాడలోనే. నాన్న ఆర్టీసీ ఉద్యోగి. ఒక అక్క, ఒక చెల్లి. చిన్నప్పటి నుంచీ అమ్మానాన్న నన్ను బయటికి వెళ్లనిచ్చేవారు కాదు. అందువల్ల ఫ్రెండ్స్‌ చాలా తక్కువ. చేసేదేం లేక అక్కతో, చెల్లితో ఆడుకునేవాణ్ని. తొమ్మిదో తరగతికి వచ్చిన తర్వాత  ‘మీతో ఉంటే ఇవే ఆడుతూ కూర్చుంటా...’ అని తేల్చి చెప్పేసి బయట తిరగడం మొదలుపెట్టా. స్కూల్‌ డేస్‌లో డ్యాన్స్‌ బాగా చేసేవాణ్ణి. అన్ని కల్చరల్‌ యాక్టివిటీస్‌లోనూ ఉండేవాణ్ణి.


logo