శుక్రవారం 05 జూన్ 2020
Sunday - Jan , ,

రైల్వే కూలీ కొడుకు.. కారును తయారుచేశాడు!

రైల్వే కూలీ కొడుకు..  కారును తయారుచేశాడు!

కాలినడకన వెళ్లేటప్పుడు ఒక సైకిల్ కావాలి అనిపించేది. సైకిల్ చేతికొచ్చాక బైక్ అయితే బాగుండు అనిపించేది. బైక్ సరదా తీరిపోయింది. ఇప్పుడు కారు కావాలి. ఇలా ఆలోచించేవాళ్లను.. ఆశపడేవాళ్లను ఎంతమందిని చూడటం లేదు మనం? భవిష్యత్‌లో కారు లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి వస్తుందేమో? అలాంటి కారును తయారుచేసింది ఎవరు? దాని వెనక ఉన్న కారణమేంటి? అసలు కారు చరిత్ర ఏంటి? తెలుసుకుందాం.

19వశతాబ్దంలో యంత్ర సహాయంతో నడిచే వాహనం ఆవశ్యకత తీవ్రరూపం దాల్చింది. అంటే అనివార్యమైంది. ఇదేసమయంలో పారిశ్రామికరంగంలో సమర్థవంతమైన శక్తి సాధనాల ఆవశ్యకత కూడా పెరిగింది. దీని ప్రభావం వల్లనే ఎన్నో ప్రయోగాలు పరిశోధనలుగా మారి అనేక సాధనాలు ఆవిష్కృతమయ్యాయి. విద్యుత్ మోటారు.. విద్యుచ్చక్తి ఉత్పాదన వంటివి అప్పుడే వెలుగులోకి వచ్చాయి. ఫలితాలు బాగానే ఉన్నప్పటికీ కొంతమంది శాస్త్రవేత్తలు వాయు ఇంజిన్‌లవైపు దృష్టి పెట్టారు. 1863లో ఫ్రాన్స్ ఇంజినీర్ ఎటీన్ లెనాయిర్ బొగ్గు వాయువుతో పనిచేసే ఇంజిన్‌ను తయారుచేసి దాని సాయంతో చిన్న కారును రూపొందించగలిగాడు. మరో ఇంజినీర్ మార్కన్ 1875లో పెట్రోలుతో కారును తయారుచేశాను అని ప్రకటించాడు. కానీ పోలీసులు వీటిని నిషేధించారు. 1884లో ఇంగ్లండ్ ఇంజినీర్ ఎడ్వర్ట్ జట్లర్ ఇంజిన్‌ను మెరుగుపరిచి పెట్రోల్‌తో నడిచేకారును ప్రదర్శించాడు. కానీ ఆ రోజుల్లో గుర్రం కాకుండా వేరే వాహనమేదీ గంటకు రెండు మైళ్ల వేగం కంటే మించి పోతే కఠిన చర్యలు ఉండేవి. ఇది బట్లర్‌కు శాపంగా మారి అది బయటకు రాలేదు. 1872లో జర్మన్ ఇంజినీర్ నికోలాన్ వాయు ఇంజిన్‌ను కనిపెట్టాడు. అతడికి డేమ్లిర్ అనే ఇంజినీర్ సహాయకుడు. అక్కడ పనిచేస్తూనే అంతర దహన యంత్రంలో పనిచేసే మొదటి మోటార్ సైకిల్‌ను డేమ్లర్ తయారుచేశాడు. 1885లో తన ఇంటి పెరట్లో ప్రయోగాత్మకంగా నడిపాడు. అలా కారును రూపొందించింది అతనే అని ప్రకటించుకున్నాడు. కొంతమంది నమ్మారు కూడా. 

కానీ.. అతని కంటే ఆర్నెళ్లు ముందుగానే తనకంటే పదేళ్ల వయసు చిన్నవాడైన కార్ల్ బెంజ్ అంతర దహన యంత్రంతో నడిచే కారును కనుగొన్నాడని తెలుసుకోలేదు. తెలిసిన తర్వాత డేమ్లిర్ ఆశ్చర్యపోయాడు. ఇంత చిన్న వయసులో తనను మించిన ఆవిష్కరణ తీసుకురావడం పట్ల ఆనందించాడు. అభినందించాడు. ప్రజలు కూడా కార్ల్‌బెంజ్ ఆవిష్కరణను స్వాగతించారు. సన్మానించారు. కారు వచ్చిందనే ఆనందంతో సంబురాలు జరుపుకొన్నారు. ఇప్పుడే ఇలా ఉంది.. ఆ రోజుల్లో ఎలా ఉంటుందో ఊహించుకోండి. నిజంగా ఓ అద్భుతం. ఏదైనా ఆవిష్కరణ తీసుకురావాలంటే ఆలోచన ఎంత ముఖ్యమో దాని గురించిన అన్వేషణ కూడా అంతే ముఖ్యం అని నిరూపించాడు కార్ల్ బెంజ్. వచ్చిన ఆలోచనను ఆవిష్కరించడం కూడా ఇంపార్టెంట్ అని నమ్మేవాడు. కార్ల్ బెంజ్.. 1844లో పుట్టాడు. ఇతనిది జర్మనీ. అంతర్గత దహన ఇంజిన్ శక్తితో నడిచే మొదటి ఆటోమొబైల్ ఆవిష్కర్తగా ఇతడిని సూచిస్తారు. బెర్తా బెంజ్‌తో కలిసి తయారుచేసిన మెర్సిడెస్ బెంజ్ మార్గదర్శక వ్యవస్థాపకుడు కూడా. 

బెంజ్ ఒక రైల్వే కూలీ కొడుకు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తల్లి గృహిణి. పేదవారే అయినా బయటకు వెళ్లి ఏనాడూ కూలీ పనిచేయలేదు. తండ్రి చేసింది కూలీ పనే అయినా అతడు బతికి ఉన్నంతకాలం ఏ లోటూ లేకుండా చూసుకున్నాడు. ఇక్కడే సమస్య వచ్చిపడింది. బెంజ్ వాళ్లమ్మ గతాన్ని తలుచుకుంటూ కుమిలి పోయేది. అలా అని బెంజ్‌ను ఇబ్బంది పెట్టేది కాదు. కానీ ఆ ప్రభావం పరోక్షంగా బెంజ్‌పై తీవ్రంగానే పడింది. కొన్నిసార్లు అయితే ఉపాసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండటం వల్ల బెంజ్ వాళ్లమ్మ రైల్వేలోనే కూలీ పని కోసం వెళ్లింది. కానీ మహిళ కావడం వల్ల అక్కడ ఎదురయ్యే సమస్యలు.. అవమానాలు భరించలేక ఎక్కువకాలం చేయలేకపోయింది. మరోచోట ప్రయత్నించింది. అక్కడా అదే అనుభవం ఎదురైంది. రోజురోజుకూ పరిస్థితి క్షీణిస్తున్నది. అప్పటి కంటే భవిష్యత్‌లో తమ పరిస్థితి ఎలా ఉంటుందో అనే దిగులు ఎక్కువయింది. అప్పుడప్పుడే చదువుపై పట్టు సాధిస్తూ తన ప్రతిభకు పదును పెడుతున్నాడు బెంజ్. కానీ పరిస్థితులు ఎక్కువకాలం అతడి చదువును సాగనీయలేదు. కుటుంబాన్ని పోషించే భారం బెంజ్‌పై ప్రత్యక్షంగా పడింది. చదువు సంక్షోభంలో పడింది. 

రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి కాబట్టి వర్క్‌షాప్‌లో లేబర్‌గా చేరాడు. పెద్దగా డబ్బులు వచ్చేవి కావు. కానీ పూట గడిస్తే చాలు అనుకొని ఎలాగోల బతుకు జట్కా బండి నడిపించాడు. ఇంతలోనే తల్లి అనారోగ్యం పాలైంది. బెంజ్ చేసేది తిండికే సరిపోని పరిస్థితి.. ఇంకా తల్లి ఆరోగ్యానికి చికిత్స ఎలా చేయించాలి? అని మనో వేదనకు గురయ్యేవాడు. కానీ.. ఓడిపోవద్దు. ఇప్పటికే తండ్రి చనిపోయిన బాధలో ఉన్న తల్లికి మరింత బాధను కలిగించొద్దు అనుకున్నాడు. రాత్రిళ్లు కూడా పని చేసి మొత్తానికి ఒకవైపు కుటుంబ అవసరాల కోసం.. మరోవైపు తల్లి ఆరోగ్యం కోసం డబ్బు సంపాదించాడు బెంజ్. 

కానీ, ఎన్ని రోజులు ఒకరి దగ్గర పనిచేస్తాం? సొంతంగా ఏదైనా పని ఏర్పరచుకోలేమా? అని ఆలోచించాడు. కొంత డబ్బు కూడబెట్టుకొని స్వతహాగా ఒక చిన్న వర్క్‌షాప్ ఏర్పాటుచేసుకున్నాడు. ఏళ్లు గడిచాయి. కానీ పరిస్థితిలో మార్పు లేదు. వర్క్‌షాప్ దగ్గరే ఆగిపోతే తన కష్టానికి అర్థం ఉండదని భావించాడు. ప్రయోగాలు చేయడంపై దృష్టి సారించాడు. సైకిల్‌పై మొదటి ప్రయోగం. సైకిల్ నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. సైకిల్ నమూనాను అనుసరించి యంత్ర సహాయంతో దానిని ఎలా మెరుగుపరచవచ్చో పరిశోధించాడు. లెనాయిర్ వాయు ఇంజిన్‌ను పరిశీలించాడు. పెట్రోలుని ఇంధనంగా వాడవచ్చుననేది అర్థమైంది. ఇలా చేయడం వల్ల డబ్బు కూడా ఆదా అవుతుందనేది అతడి ఆలోచన. నెలల తరబడి కృషి చేసి ఒక నమూనాను రూపొందించాడు. జేమ్స్ స్టార్లీ కనుగొన్న డిఫరెన్షియల్ గేర్ సాధనాన్ని కూడా తన మూడు చక్రాల కారు నిర్మాణంలో అమర్చాడు. రోడ్డు వంపు ఎక్కువగా ఉండే సందర్భాల్లో లోపలి చక్రాల కంటే బయటి చక్రాల వేగం అధికంగా ఉంటుందన్నమాట. ఇలాంటప్పుడు ఈ కొత్త గేర్ విధానం బాగా ఉపకరిస్తుంది. కారును ఇటూ అటూ తిప్పడానికి డ్రైవర్ సీటు వద్ద ఒక చిన్న చక్రాన్ని కూడా అమర్చాడు. 

1885లో ఒక రోజు..

వర్క్‌షాపు దగ్గరి మైదానం చుట్టూ తాను రూపొందించిన కారులో ఒకసారి తిరిగేసి గర్వంతోనూ.. సంతోషంతోనూ ఉబ్బి తబ్బిపోయాడు. కానీ పట్టరాని ఆ భావోద్వేగంతో కారును గోడకు ఢీ కొట్టడంతో మొదటి ప్రయోగం విఫలమైంది. చాలా బాధపడ్డాడు. చాలా ఓపికతో ఉండాల్సింది అనుకున్నాడు. తెలిసినవాళ్లు కూడా చివాట్లు పెట్టారు. ఏదైనా ఆవిష్కరించేటప్పుడు ముందు భావోద్వేగాలను అణుచుకోవాలి. అంతకాలం తిండీ తిప్పలు.. డబ్బులకు ఓర్చి కారును కనిపెట్టి తీరా ఒక్క ఐదు నిమిషాలు ఓపిక పట్టకపోవడంతో విఫలం అయ్యింది. తర్వాత నీ ఫార్ములాను అనుసరించి వేరేవాళ్లు కారు తయారుచేయరని నమ్మకం ఏంటి? నీకు ఇప్పుడు పట్టినంత సమయం కంటే ఈసారి ఎక్కువ పడుతుండవచ్చు. ఎందుకీ తొందరపాటు? నీ అద్భుతమైన ప్రతిభతో కారునే తయారుచేశావు. కానీ, ఈ భావోద్వేగాలను యంత్రించుకోలేకపోయావా? అని తన దగ్గరి సన్నిహితులు సద్విమర్శ చేయడంతో బాగా ఆలోచనలో పడ్డాడు. నిజమే కదా? అనుకున్నాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని అనుకున్నాడు. మునుపటి కంటే ఎక్కువ కష్టపడ్డాడు. ప్రయోగం విజయవంతం అయ్యింది. 1887లో ప్యారిస్ ప్రదర్శనలో తాను రూపొందించిన కారును అందరికీ పరిచయం చేశాడు. కానీ దీని గురించి ఎవరూ అంతగా పట్టించుకోలేదు. గతంలో చేసిన తప్పిదం ఇక్కడ మైనస్ అయింది. మళ్లీ బాధపడ్డాడు. కానీ వెనక్కి తగ్గేది లేదని నిర్ణయించుకున్నాడు. ఆల్రెడీ నేను ప్రూవ్డ్. ఏదో చిన్న పొరపాటు వల్ల సమస్య ఎదురైంది. అంతమాత్రాన నా ఆవిష్కరణకు అది అడ్డు వస్తే చూస్తూ ఊరుకుంటానా? అని తనకు తానే ధైర్యం తెచ్చుకున్నాడు. 

మరో సంవత్సరం తర్వాత.. మ్యూనిచ్ నగర వీధుల్లో కారు జోరుమీద నడుపుతూ కేరింతలు పెట్టి మరీ అందరికీ దీనిని పరిచయం చేశాడు. తన కారులో 125 మైళ్లు ప్రయాణించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అప్పట్లో ఇదొక సంచలనం. ఇంత మంచి ఆవిష్కర్తను పట్టించుకోలేదే అని ప్రముఖ శాస్త్రవేత్తలు సైతం బాధపడ్డారు. ప్రపంచ దేశాల నుంచి బెంజ్ రూపొందించిన కారు కోసం ఆర్డర్లు కోకొల్లలుగా వచ్చాయి. కలిసొచ్చిన మరో విషయం ఏంటంటే.. తన ఇద్దరు కుమారులు వాళ్ల అమ్మను ఇదే కారుపై పోర్ట్ హీమ్‌కు తీసుకెళ్లి క్షేమంగా తిరిగొచ్చారు. పైగా మధ్యలో చిన్నపాటి రిపేర్ వస్తే కూడా చేసుకున్నారట. అంటే ఏదైనా మరమ్మతు వస్తే కూడా చేసుకోవచ్చనేది బెంజ్‌కే కాదు అందరికీ తెలిసిపోయిందన్నమాట. ఆవిష్కరణలు చేయాలంటే ధనవంతులే కావాల్సిన అవసరం లేదు. ఆలోచనలో దమ్ముండాలి. ఆచరణలో ధైర్యం ఉండాలి. చూశాం కదా? కార్ల్ బెంజ్ ఆఫ్టరాల్ ఒక రైల్వే కూలీ కొడుకు. కానీ అతడు దానిని ఆఫ్టరాల్ అనుకోలేదు. అదే గొప్ప అనుకున్నాడు. సమస్యలు ఎంత దయలేకుండా దాడిచేసినా మొక్కవోని ధైర్యంతో మొదటి అంతర్గత దహన ఇంధన శక్తితో నడిచే కారును కనిపెట్టాడు. ఇవాళ మనందరినీ కారుతో శాసిస్తున్నాడు. 

దాయి శ్రీశైలం, సెల్: 8096677035


logo