సాహిత్య చంద్రుడు

అలతి పదాల్లోనే అందమైన భావాలను పొదుగుతాడు.నిండైన సాహిత్యపు విలువలతో అద్భుతమైన
పాటలను అల్లుతాడు.సంగీతానికి సరితూగే పదాలు ప్రయోగిస్తూ.. సినీ గీతానికి సరికొత్త వన్నెలద్దుతాడు. ఆయనే.. అక్కల చంద్రమౌళి,అచ్చ తెలంగాణపాటల లోగిలి.యువ కవిగా, సినీ గేయ రచయితగా తన ప్రతిభను చాటుతున్నారు అక్కల చంద్రమౌళి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్ చంద్ర స్వస్థలం. తల్లిదండ్రులు అక్కల రాజేశ్వరి – లచ్చన్న. 1983 జూన్ 8న జన్మించిన చంద్రమౌళి, చిన్నతనం నుంచే కవిత్వంపై, పాటలపై ఆసక్తి పెంచుకొన్నారు. పాఠశాల స్థాయిలో అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. సినీ గేయ రచయితగా ఎదగాలనే సంకల్పంతో, గానాన్ని అభిరుచిగా మలుచుకొని ఆ దిశగా అడుగులేశారు. హైదరాబాద్‌లో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీఏ పూర్తిచేశారు. ఆతర్వాత, ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.
‘శతమానం భవతి’ అంటూ..
సినీకవిగా ఎదగాలన్న లక్ష్యంతో ఎన్నో ప్రయత్నాలు చేశారు చంద్రమౌళి. ఎట్టకేలకు, తన కృషి ఫలించి.. 2013లో తొలి అవకాశాన్ని అందుకొన్నారు. ‘గులాబీ’ చిత్రం కోసం పాటలురాసే అవకాశం వచ్చింది. ‘శతమానంభవతి చరితల్లోనే మురిసే’ అనే పాటతో గీత రచయితగా చిత్రసీమకు పరిచయమయ్యారు. ఈ పాటలో ‘సిరి నవ్వుల్లో విరిసేనమ్మా సిందూరాలే, చిరుజల్లులో కురిసేనమ్మా మందారాలే’ అంటూ గొప్ప అభివ్యక్తిని ప్రకటించారు. ఇదే చిత్రంలోని ‘సొగసు చీరలో నిశీధి వేళలో’ పాటను శృంగారభరితంగా రాశారు. వీటితోపాటు ‘ఇది కవి రాయని శ్లోకమే’, ‘మేఘమొదిలే మెరుపై కదిలే’ పాటలు కూడా నిండైన కవితాత్మతో తొణికిసలాడుతాయి. సినిమాలోని ప్రతి పాటా ప్రత్యేకమే. ‘మరిన్ని మంచి పాటలు రాయాలన్నదే నా సంకల్పం’ అంటారాయన.

తెలంగాణ యాసలో..
అచ్చ తెలంగాణ యాసలో పాటలు రాయడంలోనూ చంద్రమౌళి ఆరితేరారు. ‘పరేషాన్’ (2021) సినిమా కోసం ‘సౌ సారా సౌ సారా చటక్కారా.. పోదాం పారా..’ అనే పాటను మట్టి వాసనతో అందించారు. ‘మెయిల్’ (2021)లో ‘హే.. బొమ్మా బొరుసంటూ వేసే పంట ఏదో ఒకటేనంటా..’ అనే పాటలో సరికొత్త పద ప్రయోగరీతి కనిపిస్తుంది. 2015లో జపాన్ వరల్డ్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్ కోసం రాసిన‘నా తెలంగాణ..’ అనే పాట అంతర్జాతీయ గుర్తింపును పొందింది. ఆయన రాసిన ‘మొక్కలు నాటితే మనమే’ అనే హరితహారం పాట.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ‘అటవీశాఖ కాలర్ డయల్ టోన్ అఫీషియల్’గా ఎంపికైంది. అనేక ప్రైవేటు ఆల్బమ్స్‌కు కూడా రాశారు. ఎందరో అభిమానులను సొంతం చేసుకొన్న చంద్రమౌళి.. నిరంతర కృషితో ముందుకు సాగుతున్నారు.

జానపదాలను కలుపుకొంటూ..
జానపద శృతిని రంగరించుకొన్న ప్రణయ గీతాలెన్నో చంద్రమౌళి అలవోకగా రాశారు. 2017లో వచ్చిన ‘శివకాశీపురం’ చిత్రంకోసం ‘ఇన్నాళ్లుగా నా కళ్లల్లో నువ్వే..’ అంటూ విరహాన్ని ఒలికించారు. విరహంతో, విషాదంతో రగిలిపోతున్న ప్రేమ హృదయాల్ని ఆవిష్కరించారు. ఇదే సినిమాలో ‘బంతీపూలతో బండికట్టినానే.. మల్లేపూలతో పందిరేసినానే’ అంటూ జాన పదాలతో సాగే హుషారు గీతాన్ని రాశారు. దాంతోపాటు ‘తొలివరమై రావా! కలవరమైనావా!’ పాట కూడా హృద్యంగా సాగుతుంది. 2018లో వచ్చిన ‘కారులో షికారుకెళ్తే’ సినిమాకోసం ‘హే దుమ్మేసేయ్ ఈలగొట్టి’ అనే పాటను రాశారు చంద్రమౌళి. ‘దిక్కుల్ని తెంచిగొట్టేయ్.. చుక్కల్ని బంతికొట్టేయ్’ అంటారీ పాటలో. కాలాన్ని వృథాచేయకుండా ఆనందాన్ని సొంతం చేసుకోమంటూ సుఖ జీవనసారాన్ని తెలుసుకోమంటారు. తాను విలాసభరితమైన గీతాలు కూడా రాయగలనని ఈ పాట ద్వారా చంద్రమౌళి నిరూపించారు.
-తిరునగరి శరత్ చంద్ర , 6309873682
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

