అయిదు సినిమాలకు నిర్మాత.. టెలీ సీరియళ్ల దర్శకుడు.. అయిదు వేళ్లు నోట్లోకి పోవాలంటే డబ్బు ఉంటే సరిపోదని, పంచభూతాల సహకారంతో నవ ధాన్యాలు పండించాలనే సత్యం తెలుసుకున్న మార్గదర్శకుడు. హరిత విప్లవంలో పెరిగిన దిగుబడి లెక్కలు కాదు.. అప్పుల్లో దిగబడి, వడ్డీల చిక్కుల్లో పడి, తిప్పలెన్నో పడుతున్న రైతుల కష్టం తెలిసినవాడు. ఆ దయనీయ జీవితాన్ని డైలీ సీరియల్‌గా తీసి నంది అవార్డు గెలిచాడు. కన్నీటి కథలతో గెలిచిన నంది కంటే గో ఆధారిత సేద్యంతో కష్టాలు తీర్చే మేలైన బాట చూపించాడు.
రైతు బిడ్డ రైతు కాని రోజుల్లో సినిమాలు, వ్యాపారాలు చేస్తూ.. చివరికి కర్షకుడిగా అవతారమెత్తాడు. మరెందరో రైతులకు ఖర్చులేని వ్యవసాయం నేర్పాడు. తన పొలాన్నే ప్రయోగశాలగా మార్చి వ్యవసాయ శాస్త్రవేత్తలకు పాఠాలు చెప్పాడు. తన ఫలసాయంతో అనాథల ఆకలి తీరుస్తూ… సాహస యాత్రలాంటి సాగుబాటని సంతోషాల జాతర చేశాడు. ప్రకృతి వ్యవసాయంలో అనుభవాల పచ్చని జ్ఞాపకాలు ఇలా పంచుకున్నాడు!
కడుపు చేత పట్టుకుని వచ్చిన వాళ్లకు కాదనకుండా ఆశ్రయమిచ్చి, అన్నం పెట్టే మరో తల్లి హైదరాబాద్! యాభై ఏండ్లకు పూర్వం 20 లక్షల మందితో ఉన్న ఈ నగరం జనాభా కోటి దాటిందంటే కారణం ఇది అన్నం పెట్టే ఊరు కావడమే. అందుకే ఎక్కడెక్కడి నుంచో ఎందరో ఇక్కడికి వచ్చారు. అలా నేనూ వచ్చాను. మాది కర్ణాటకలోని గంగావతి అనే ఊరు. ఒక పత్రికలో జర్నలిస్ట్‌గా పని చేసేందుకు 46 ఏండ్ల కిందట హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. కూర్చున్న చోటే పని చేయడం ఇష్టంలేక మూడో నెలలోనే మానేశాను. ఇక్కడే చిన్న చిన్న వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకుంటూ ఉన్నాను. నాలుగేండ్లకు కొంత భూమి కొనాలనే ఆలోచన వచ్చింది.
గచ్చిబౌలిలో మూడు ఎకరాల వ్యవసాయ భూమి కొన్నాను. దానికి తోడు మరికొంత భూమిని కౌలుకు తీసుకున్నాను. వరి, కూరగాయలు పండించాను. ఐటీ కంపెనీల రాక, నగర విస్తరణతో గచ్చిబౌలి కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయింది. వ్యవసాయం చేసే అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కౌలు చేస్తున్న భూమి యజమాని దానిని ప్లాట్స్‌గా మార్చి అమ్ముకున్నాడు. ఆ ప్రాంతం వ్యవసాయానికి అనుకూలంగా లేక మూడెకరాల్లో రెండెకరాలు అమ్మాను. వచ్చిన డబ్బుతో రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలంలోని అమీర్‌పేట్ గ్రామం దగ్గర పది ఎకరాల భూమి కొన్నాను.

పదెకరాల విస్తీర్ణంలోని అటల్ బిహారీ వాజ్‌పేయి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్లో పండని పండు లేదు! మూడు వందలకు పైగా రకాల పండ్లను ఇందులో పండిస్తున్నారు. ఫుడ్ ఫారెస్ట్‌లో రెండున్నర వేల పండ్ల చెట్లున్నాయి. అరవై రకాల అటవీ చెట్లున్నాయి. వీటి సంఖ్య ఏడు వేలు. వీటితోపాటు కూరగాయలు, ఔషధ మొక్కలూ పెంచుతున్నారు. ఫుడ్ ఫారెస్ట్‌లో మొత్తం పన్నెండు వేల వృక్షాలు పెరుగుతున్నాయి!
హైదరాబాద్‌లో వ్యవసాయం, వ్యాపారాలు చేస్తున్న కాలంలో సినిమా రంగంలోనూ అడుగుపెట్టాను. మా బావమరిది దర్శకత్వంలో అయిదు సినిమాలు నిర్మించాను. రెండిళ్ల పూజారి, జై భజరంగభళి, ఆల్ రౌండర్, కిష్కింధకాండ నా సినిమాలే. నా దర్శకత్వంలోనే రెండు సీరియళ్లు, ఆరు టెలీఫిల్మ్‌లు తీశాను. వాటికి కథ, స్క్రీన్‌ప్లే కూడా నేనే. ఏడు నంది అవార్డులు గెలిచాను. దూరదర్శన్‌లో మొదటి తెలుగు డైలీ సీరియల్ ‘జీవన తీరాలు’ నా దర్శకత్వంలోనే వచ్చింది. ఈ టెలీ సీరియల్ రైతు కేంద్రంగా చిత్రీకరించాను. పల్లె జీవితంలో రైతుల కష్టాలు, అప్పులు, ఆత్మహత్యలు, పట్నం వలస చూపించాను. పల్లెలకు పోయి చిత్రీకరించాను.
జీవన తీరాలు రెండు నంది అవార్డులు గెలుచుకుంది. ఈ సీరియల్ తీస్తున్నప్పుడు వ్యవసాయ సంక్షోభాన్ని అర్థం చేసుకున్నాను. దీనికి పరిష్కారం గురించి ఆ తర్వాత ఆలోచించాను. రసాయనాల వాడకంతో వ్యవసాయంలో పెట్టుబడి పెరిగింది. విత్తనం కొనాలి. ట్రాక్టర్‌కి డీజిల్ కొనాలి. ఎరువులు, పురుగు మందులు కొనాలి. అన్నీ కొన్న రైతుకు మిగిలేది అప్పులు తప్ప వేరేదేమీ లేదు. కాబట్టి ఖర్చు లేని వ్యవసాయం వైపు రైతుని మళ్లించాలనుకున్నాను.
మాది వ్యవసాయ కుటుంబం. మా చిన్నప్పుడు తోట ఉండేది. మా తాత, నాన్న సాగు చేసిన విధానం చూస్తూ పెరిగాను. పశువులు, కోళ్లు పెంచుకుంటూ పెంటతో ఎరువులు చేసుకున్నారు వాళ్లు. ఆనాడు ఇన్ని తెగుళ్లు లేవు. హరిత విప్లవం పేరుతో వ్యవసాయాన్ని 50 ఏండ్లలో పతనం దిశగా నడిపించారు. ఈ రసాయన ఎరువులు, పురుగు మందులతో చేసేది ఖర్చుదారీ వ్యవసాయం. రసాయన వ్యవసాయం చేస్తే రైతుకు మిగిలేది సున్నా. ఎందుకంటే దీనికి తెగుళ్లు అధికం.
భూమి నిస్సారమవుతుంది. విషపూరితమైన ఫలసాయం ఇస్తుంది. ఇలాంటి ఆహారం తినబట్టే సమాజంలో ప్రతి మనిషీ ఏదో ఒక రోగం మోసుకుంటూ తిరుగుతున్నాడు. ఈ రోగాలు పోవాలంటే మనం పూర్వికుల్లా తినాలి. అది జరగాలంటే ప్రకృతి సేద్యం వైపు మళ్లాలి. హరిత విప్లవానికి ముందు మన దేశ రైతులు ప్రకృతి వ్యవసాయాన్నే ఆచరించారు. నేనూ అదే అనుసరించాలనుకున్నాను. కొన్న భూమిని సేంద్రియ సేద్యానికి ప్రయోగశాలగా మార్చాలని నిశ్చయించుకున్నాను. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని సేంద్రియ సాగుకు ప్రయోగశాలగా తీర్చిదిద్దాను.

ఇది నల్ల రేగడి నేల. రసాయన ఎరువులతో సాగు చేయడం వల్ల సారం కోల్పోయింది. అందులో పెరిగిన సర్కార్ తుమ్మలను కొట్టించాను. వేర్లను పెకిలించాను. ప్లాస్టిక్ చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. రసాయన ఎరువులు చల్లకుండా నేలను కాపాడుకోవాలనుకున్నాను. నేలను సారవంతం చేసేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు తీసుకున్నాను. వాళ్లు చెప్పినట్టే చెరువులోని ఒండ్రు మట్టి తరలించాను. పశువుల పేడ కొన్నాను. పొలంలో వాటిని కలియ దున్నించాను. బోరు బావి తవ్వించి, డ్రిప్ ఇరిగేషన్ పెట్టించాను. ఫిల్మ్‌నగర్‌లో నివాసముంటూ ప్రతి రోజూ వ్యవసాయ క్షేత్రానికి వచ్చే వాడిని. ఆ రోజుల్లో ఇక్కడ తినడానికి ఏమీ దొరికేది కాదు. పగలు అన్నం లేకుండా పని చేశాను. తక్కువ నీటితో ఎక్కువ భూమిని సాగు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను.

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో నేను తన కార్యాలయంలో సహాయకుడిగా పని చేశాను. ఆ మహానుభావుడి జ్ఞాపకంగా దాదాపు పుష్కరం కిందట ఈ వ్యవసాయ క్షేత్రానికి ‘అటల్ బిహారీ వాజ్‌పేయి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్’ అనే పేరు పెట్టుకున్నాను. ఒకే పంటను (మోనోక్రాప్) సాగు చేయకూడదనుకున్నాను. అలా చేయడం తప్పు. ఈ మాటన్నందుకు అందరూ నన్ను పిచ్చోడన్నారు. నన్ను చూసి నవ్వనోడు లేడు. అయినా నేను తగ్గలేదు. మొదట ఆరు, ఏడు రకాల పంటలు ఎంచుకున్నాను. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలసాయం పొందాలన్న లక్ష్యంతో పనిలోకి దిగాను.
కూరగాయలతోపాటు మామిడి, బొప్పాయి, జామ, నిమ్మ, దానిమ్మ, సపోట, పనస, అరటి వంటి స్థానిక పండ్ల మొక్కలు నాటాను. అవి బాగా పెరిగాయి. వాటి నుంచి రాలిన ఆకుల్ని పేడలో కలిపి కంపోస్ట్ (సేంద్రియ ఎరువు) తయారు చేశాను. పేడ కోసం ఇక్కడే షెడ్ నిర్మించాను. అందులో ఆవులు, గిత్తలు, దూడలు, బర్రెలు పెంచాను. వ్యవసాయ విశ్వవిద్యాలయం నాకు ఒక ఒంగోలు గిత్త, ఒక పుంగనూరు గిత్తను అందించింది. వాటి పేడను ఎరువుకి, గోమూత్రాన్ని జీవామృతం తయారీకి ఉపయోగించుకున్నాను.

రసాయన పదార్థాలను సాగుకు వాడకూడదు అన్నది నా సిద్ధాంతం. కాబట్టి మార్కెట్లోని పురుగు మందుల జోలికి మొదటి నుంచి పోలేదు. సారవంతమైన భూమిలో పండే పంటకు తెగుళ్లు రావు. సారం లేని భూమిలో రసాయన ఎరువులు వాడతారు. కాబట్టే తెగుళ్లు వస్తున్నాయి. కొత్త తెగుళ్లు పుట్టుకొస్తున్నాయి. మొదట్లో సారం తక్కువగా ఉన్నప్పుడు తెగుళ్లు వచ్చేవి. ఈ తెగుళ్లను తట్టుకునేందుకు వేప, ఆముదం, కానుగ ఆకులు, కాయలు చూర్ణం చేసి చీడల నివారణ కోసం పిచికారీ చేశాను.
జీవామృతంతో తెగుళ్లను ఎదుర్కొన్నాను. కీటకాల నుంచి పంటను కాపాడుకునేందుకు కోళ్లు పెంచాను. ఇవి చెద పురుగులు కనిపిస్తే తినేవి. కోళ్లే మా పెస్ట్ కంట్రోలర్స్! ఖజానా బాతులు పెంచుతున్నాను. ఇవి జెల్ల పురుగులు, మండ్ర గబ్బలను బాగా తింటాయి. కోళ్లు, బాతుల పెంట నేలను మరింత సారవంతం చేసింది. రసాయన ఎరువులు వాడటం బంద్ పెట్టే సరికి నేలలో వానపాములూ పెరిగాయి. మొదట్లో గొర్రెలు కూడా పెంచాను. అవి పెరిగిన చెట్ల కొమ్మలపై కాళ్లేసి మేస్తున్నాయి. అందువల్ల వాటిని వదిలించుకున్నాను.

ఓసారి డ్రాగన్ ఫ్రూట్ కేజీ అయిదు వందలకు కొన్నాను. అప్పుడు నా పొలంలో ఇది ఎందుకు పెంచకూడదనే ఆలోచన వచ్చింది. మూడు వందల రూపాయలకు ఒక మొక్క కొని తెచ్చి దానిని పెంచాను. కొమ్మలను అంటు కట్టి పెంపు చేశాను. ఇప్పుడు ఓ అయిదు వందల డ్రాగన్ ఫ్రూట్ చెట్లున్నాయి. ఇలానే వంద అవకాడో మొక్కలు కొని కొత్త మొక్కలు తయారు చేసుకున్నాను. తెలంగాణలో డ్రాగన్ ఫ్రూట్, అవకాడోను మొదటగా పండించింది నేనే. ఇలా దేశవాళీ పండ్లతో పాటు విదేశీ పండ్ల మొక్కలు చెర్రీస్, బ్లాక్ బెర్రీ, స్టార్ ఫ్రూట్స్, మౌత్ ప్రెష్నర్, వాటర్ ఆపిల్, కాఫీ, వెనిల్లా (ఐస్‌క్రీమ్ ఫ్లేవర్), మలేషియన్ ఆపిల్ లాంటి కొత్త రకాలు కూడా సాగు చేశాను. వీటితోపాటే సుగంధ ద్రవ్యాలైన కరోండా (వాక్కాయ), కంచెగామాన్ నాటాను. ఔషధ మొక్కలైన జాజికాయ, ఇంగువ, ఆలివ్, రుద్రాక్ష మరెన్నో చెట్లు పెంచుతున్నాను.

మూడేండ్లకు మా వ్యవసాయ క్షేత్రం సహజమైన అడవికి తీసిపోనట్లుగా మారిపోయింది. ఏటేటా మొక్కలు పెరుగుతూ ఉన్నాయి. కొత్త మొక్కలు కూడా చేరుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పక్షులు వాలుతున్నాయి. వాటి రెట్ట వల్ల కొత్త మొక్కలు పుట్టుకొస్తున్నాయి. వాటిని తొలగించకుండా, చక్కగా పెంచుతాం. మంచి కాపు కాయలంటే, అధిక లాభం రావాలంటే పండ్ల చెట్ల మధ్య అటవీ చెట్లు కూడా నాటాలి. ఈ మాట చెబితే చాలా మంది పట్టించుకోలేదు. నేనూ వాళ్లను పట్టించుకోలేదు.
పండ్ల చెట్ల మధ్య ఎర్ర చందనం, శ్రీగంధం, మహాగని, నల్లమద్ది, తెల్లమద్ది, అకిసియా, మ్యాన్జియం, బీజా, సాల్, ఎగిస, సెల్వర్ హుక్, యూకలిప్టస్ లాంటి 50 రకాల అటవీ మొక్కలు నాటాను. వాటిని పెంచి వ్యవసాయ క్షేత్రాన్ని ఫుడ్ ఫారెస్ట్‌గా మార్చాను. ఈ ఫుడ్ ఫారెస్ట్‌లో వెదురు వనం కూడా పెంచుతున్నాను. అసోం నుంచి టుల్డా బాంబూ మొక్కలు తెప్పించాను. టుల్డా వెదురు కాండం తాటి చెట్టంత లావు పెరుగుతుంది! ఈ ఆహ్లాదకరమైన పరిసరాల్లోకి నెమళ్లు అడుగుపెట్టాయి. ఆనందంగా నాట్యమాడాయి. కుందేళ్లు చెంగు చెంగున వచ్చి చేరాయి.

ఏ పంట కోసమైనా మొదటే విత్తనాలు, మొక్కలు కొంటాను. ఆ తర్వాత పంటకు విత్తనాలు తయారు చేసుకుంటాను. అంటుకట్టి కొత్త మొక్కలు తయారు చేస్తాను. విత్తనం, ఎరువులు కొనకుండా విజయవంతంగా సాగు చేస్తున్నాను. మొక్కలు పెంపు చేసుకుంటూ ఉద్యానవనం సాంద్రత పెంచుకుంటూ, నేలను సారవంతం చేసుకుంటూ పోయాను. మూడు, నాలుగేండ్లలో నా వ్యవసాయ క్షేత్రం రకరకాల పండ్ల మొక్కలతో నిండిపోయింది. తక్కువ భూమి ఎక్కువ ఫలసాయం ఇచ్చింది!
భూమి సారవంతమవుతున్నా కొద్దీ తెగుళ్ల బెడద తగ్గిపోయింది. మూడేండ్ల క్రితం కాఫీ మొక్కలు తెచ్చి నాటాను. ఎత్తైన కొండ ప్రాంతాలపై చల్లని వాతావరణంలో పెరిగే కాఫీ తోట ఇక్కడ పెరుగుతుందా? అని చాలామందికి సందేహం వచ్చింది. నలభై డిగ్రీల సగటు ఉష్ణోగ్రత ఉండే ప్రాంతంలో కాఫీ తోట పెంపకం కష్టమన్నారు. సారవంతమైన నేల కాఫీ మొక్కలకు ఆ వేడి నుంచి తట్టుకునే శక్తినిచ్చింది. నేలను సారవంతం చేస్తే ఏ పంటైనా పండుతుందని నేల నిజం చెబుతున్నది. మనిషే దీనిని అంగీకరించడానికి సిద్ధంగా లేడు.
‘అడవి పూలు’ అనే ఒక టెలీ సీరియల్ తీశాను. ఆలనాపాలనా చూసేవాళ్లు లేని పిల్లలు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ వస్తారు. ఇక్కడ రోడ్ల పక్కన, ఖాళీ జాగాల్లో పడుకుంటూ ఒకరికొకరు పరిచయమవుతారు. తిండి కోసం తిప్పలు పడుతూ తిరుగుతుంటారు. ఇలాంటి పిల్లలు ఆకలికి బలికాకుండా, అసాంఘిక శక్తులకు చిక్కకుండా కాపాడుకోవాలని ఆ సీరియల్లో సందేశమిచ్చాను. ఆ సీరియల్‌కి బంగారు నంది అవార్డు వచ్చింది. అప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్త ఐవీ సుబ్బారావు సిటీలోని ఒక అనాథాశ్రమం గురించి చెప్పారు. క్రైస్తవ మిషనరీ నడిపే ఆ అనాథాశ్రమం ఏ దిక్కూ లేని పిల్లల్ని ప్రయోజకుల్ని చేయడం నా మనసుని కదిలించింది. అప్పుడే నా సాగు భూమిలో పండిన ప్రతి పండు, గింజను అనాథాశ్రమాలకే ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.
ఫుడ్ ఫారెస్ట్‌లో పండే కూరగాయలు, పండ్లు ఆరోగ్యకరమైనవి. వీటిలో అధిక పోషకాలుంటాయి. సాగుకి రసాయనాలు వాడలేదు కాబట్టి.. ఇవి తింటే ఏ జబ్బులూ రావు. ఇంత చక్కగా సాగు చేసి ఖరీదు పెట్టి అమ్మితే ధనవంతులు కొంటారు? బోలెడు డబ్బు వస్తుంది. ఆ వచ్చిన డబ్బుని దానధర్మాలకే వినియోగిస్తాను. అదేదో ఆ ఫలాలనే దానం చేస్తే అనాథల ఆకలి తీర్చినట్టూ ఉంటుంది. వాళ్లకు జబ్బులు రాకుండా మేలు చేసినట్టు అవుతుందనుకున్నాను. అప్పటి నుంచి ఒక్క పండు కూడా మార్కెట్లో అమ్మట్లేదు. హైదరాబాద్‌లోని ఎనిమిది అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు ఫుడ్ ఫారెస్ట్‌లో పండే ఫలాలను చేరవేస్తున్నాను. నాకు కుదరనప్పుడు ‘పండ్లున్నాయి.. తీసుకపోండి’ అంటే వాళ్లే వచ్చి పట్టుకుపోతున్నారు. నేనూ సంతోషంగా ఉన్నాను. నా ప్రకృతి వ్యవసాయం వల్ల పశుపక్ష్యాదులు, అనాథలు సంతోషంగా ఉన్నారు.

నేలలో సూక్ష్మ జీవులు అసంఖ్యాకంగా ఉంటాయి. యూరియా, డీఏపీ ఎరువులు, కలుపు మందు, పురుగు మందులు నేలలోని సూక్ష్మ జీవుల (మైక్రోబియం)ను చంపేస్తాయి. బ్యాక్టీరియా, ఫంగస్, ఆల్గే, ఇతర సూక్ష్మ జీవులు లేనప్పుడు నేల నిర్జీవంగా మారుతుంది. క్రమంగా నిస్సారమవుతుంది. ఈ రసాయన ఎరువులు, కలుపు మందు, పురుగు మందులు వాడకపోవడం వల్ల హరిబాబు వ్యవసాయ క్షేత్రంలో మైక్రోబియం ఏటేటా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడీ వ్యవసాయ క్షేత్రంలో సేకరించిన మట్టి నమూనాల్లోని ఒక గ్రాము మట్టిలో 300 కోట్ల మైక్రోబ్స్ ఉన్నట్టు ఎన్ఐపీహెచ్ఎం పరిశోధకులు ధ్రువీకరించారు.
నేలలో మూడు శాతం సేంద్రియ కర్బనం ఉంటే పంటకు తెగుళ్లు రావు. ఇలాంటి నేల మొక్కల ఎదుగుదలకు అత్యంత శ్రేష్టమైనది. నా భూమిలో 2.98 శాతం సేంద్రియ కర్బనం ఉందని వ్యవసాయ విశ్వవిద్యాలయం తేల్చింది. పదమూడేండ్లు కష్టపడితే ఇది సాధ్యమైంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా సాగు భూమిని ఇంత సారవంతంగా మార్చలేకపోయింది. నా భూమిలోని సేంద్రియ కర్బనం పాళ్లు చూసి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. తెలంగాణలో అత్యంత సారవంతమైన సాగు భూమి నాదే అని ఘంటాపథంగా చెప్పగలను!
ఈ వనమే ఓ ప్రయోగశాల
వ్యవసాయ క్షేత్రాన్ని ప్రయోగశాలగా మలచుకున్నారు రైతు హరిబాబు. సాగు పద్ధతుల్లో ఎన్నో ప్రయోగాలు చేశారు. అధిక పంట తీశారు. ఖర్చులేకుండా పంటలు పండించే కొత్తబాటలో నడిచారు. స్థానిక రైతులు మొదట్లో ఆ దారిని నిర్లక్ష్యం చేశారు. తక్కువ నేలలో ఎక్కువ ఫలసాయం చూసి వాళ్ల ఆలోచన మార్చుకున్నారు. ఖర్చు లేని వ్యవసాయం కాబట్టి ఎక్కడెక్కడి వాళ్లనో హరిబాబు వ్యవసాయ క్షేత్రం ఆకట్టుకుంది. చుట్టుపక్కల రైతులే కాదు వ్యవసాయ విద్యార్థులు, వ్యవసాయ పరిశోధకులూ తన వనంలో అడుగుపెట్టారు. ఆయన చెప్పే వ్యవసాయ పాఠాలు విన్నారు. వాటిని శాస్త్రీయంగా విశ్లేషించుకునేందుకు అధ్యయనాలు చేశారు.
దేశంలో 732 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉంటే వాటిలో 640 కేంద్రాల నుంచి ప్రధాన శాస్త్రవేత్తలు వచ్చి ఇక్కడ సాగుతున్న పొలం పనులను పరిశీలించారు. 100 దేశాల ప్రతినిధులు ఈ ఫుడ్ ఫారెస్ట్‌ని అధ్యయనం చేసేందుకు సందర్శించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ జాతీయ స్థాయిలో హరిబాబుకు ఉత్తమ రైతు అవార్డ్ ప్రదానం చేసింది. సస్టెయినబుల్ అగ్రికల్చర్ అంతర్జాతీయ సదస్సు (రాంచీ)లో బెస్ట్ ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డ్ అందుకున్నారు. సస్టెయినబుల్ అగ్రికల్చర్ వరల్డ్ కాన్ఫరెన్స్ (కోల్‌కతా)లో బెస్ట్ అవార్డ్ అందుకున్నారు. హరిబాబు కృషిని గుర్తించి నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఉత్తమ రైతు అవార్డుని ప్రదానం చేసింది.
– సుఖవాసి హరిబాబు
– నాగవర్ధన్ రాయల, తమ్మడి మాసయ్య