మహిళా సాధికారత వంటిల్లు దాటి ఫుడ్ బిజినెస్ దగ్గర ఆగిపోయింది. కుట్లు, అల్లికల నుంచి దుస్తుల వ్యాపారంలో నిలదొక్కుకుంది. అంతకంటే ముందుకు నడిచి టెక్నాలజీ, ఇన్నోవేటివ్ రంగాల్లో నిలదొక్కుకోలేకపోతున్నది. ఎనర్జీ రంగంలో సోలార్ విప్లవాన్ని అందిపుచ్చుకునేందుకు ఉద్యోగాన్ని వదిలి వ్యాపారంలోకి అడుగుపెట్టింది రాధికా చౌదరి. పెద్ద నోట్ల రద్దు, కొవిడ్ సంక్షోభాలను ఎదుర్కొని దేశంలోనే రెండో అతిపెద్ద రూఫ్ టాప్ సోలార్ కంపెనీగా ఫ్రెయర్ ఎనర్జీని నిలబెట్టిందామె. స్పోర్ట్స్‌లో పతకాలు, చదువుల్లో ఫెలోషిప్‌లు, వ్యాపారంలో అవార్డులెన్నో గెలుచుకున్న రాధికా చౌదరి జిందగీ పాఠకులతో పంచుకున్న ఎమర్జింగ్ టెక్నాలజీ ఎనర్జిటిక్ ముచ్చట్లు..
చిన్నప్పుడు ఆటలు బాగా ఆడేదాన్ని. స్కూల్ గేమ్స్‌లో టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్‌లో అప్పటి ఆంధ్రప్రదేశ్ జట్టుకి ఎంపికయ్యాను. కాలేజ్ డేస్‌లో జూనియర్ నేషనల్స్, సీనియర్ నేషనల్స్ ఆడాను. ముఫఖమ్ ఝా ఇంజినీరింగ్ కాలేజ్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివాను. ఇంజినీరింగ్ చదివే రోజుల్లో పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం చేయాలని ఉండేది. న్యూక్లియర్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చదివేందుకు అమెరికా వెళ్లాను. తర్వాత అక్కడే జర్మన్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ)లో ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత స్వీడన్ కంపెనీ ఎస్కేఎఫ్, అమెరికన్ కంపెనీ సన్ ఎడిసన్లలో ఉద్యోగం చేశాను.
ఇంటర్మీడియెట్ చదివేటప్పుడు ఫ్రెంచ్ క్లాస్‌లకు వెళ్లేదాన్ని. అక్కడ పావన్ పరిచయమయ్యాడు. తను ఐఐటీ బాంబేలో గ్రాడ్యుయేట్. ఆ పరిచయం ప్రేమగా ఎదిగింది. ఆ తర్వాత పెళ్లితో ఇద్దరం ఒక్కటయ్యాం. అమెరికాలో ఇద్దరి కెరీర్ బాగుంది. వాళ్ల అమ్మానాన్నతో ఉండాలని తన కోరిక. ఇండియా రావాలనుకున్నాం. అదృష్టవశాత్తూ నాకు ఇండియాలో జాబ్ వచ్చింది. అది కూడా హైదరాబాద్‌లోని ల్యాంకో కంపెనీలో. తన చదువుకి ఎక్కడైనా జాబ్ వస్తుందని ఆయన ఉద్యోగం మానేశారు. పద్దెనిమిదేండ్ల క్రితం ఇండియా వచ్చాం. ఎల్ అండ్ టీ కంపెనీలో జాబ్‌లో చేరాను. ఆ కంపెనీ మేనేజ్మెంట్లో పెద్ద పొజిషన్లో పని చేశాను. కొన్నాళ్లకు మహింద్ర కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చింది.

అదే సమయంలో సౌరబ్ మర్దా పరిచయమయ్యాడు. మేమిద్దరం పుట్టి పెరిగింది హైదరాబాద్. తను అమెరికాలో చదువుకొని వచ్చాడు. నేనూ అమెరికాలో చదువుకుని వచ్చాను. తనకు సోలార్ ఫీల్డ్‌లో బిజినెస్ చేయాలనే ఆలోచన ఉందట. కలిసినప్పుడు ఆ బిజినెస్ ఆలోచన చెప్పాడు. ఆ రంగంలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి కలిసి కంపెనీ ప్రారంభిద్దాం అన్నాడు. ఉద్యోగం తేలిక, సురక్షితం. కానీ, వ్యాపారంలో ఒత్తిళ్లు ఉంటాయి. నష్టాలు పలకరిస్తాయి. మహింద్ర కంపెనీ నుంచి వచ్చిన ఆఫర్ లెటర్ చేతిలో ఉంది. పెద్ద పొజిషన్. అది వదులుకోవడం కష్టమనిపించింది. మా ఆయన ‘ఆంత్రప్రెన్యూర్‌షిప్ బెస్ట్ ఫర్ యూ. కార్పొరేట్ ఉద్యోగంలో నువ్వు ఎక్కడుండాలో, ఎటు వెళ్లాలో, ఎప్పుడు వెళ్లాలో బాస్‌లు నిర్ణయిస్తారు. బిజినెస్‌లో ఎక్కడికి పోవాలో నువ్వే నిర్ణయించుకుంటావు. ఎప్పుడు పోవాలో కూడా నీదే నిర్ణయం. సమయం, నిర్ణయం నీ చేతిలో ఉంటాయి’ అని ప్రోత్సహించాడు. కావాలనుకుంటే జాబ్ ఎప్పుడైనా ఉంటుంది. వ్యాపార అవకాశాలు అన్ని సమయాల్లో దొరకవు. కాబట్టి బిజినెస్ చేయాలనే నిర్ణయించుకున్నాను.
సోలార్ బూమింగ్ వస్తుందనే ముందు చూపుతో ఈ బిజినెస్‌లోకి వచ్చాను. ఆ రోజుల్లో ప్రభుత్వ పాలసీ ఇంత స్ట్రాంగ్‌గా లేదు. కోటి రూపాయల పెట్టుబడితో ఫ్రెయర్ ఎనర్జీ కంపెనీ స్థాపించాం. ఉద్యోగం చేసే రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీల కోసం పనిచేసిన నేను గవర్నమెంట్ ఆఫీస్‌ల చుట్టూ తిరగడం, ఫ్రెయర్ కంపెనీ గురించి చెప్పుకోవడం కొంచెం కష్టంగా ఉండేది. వర్క్ ఎక్స్పీరియన్స్, ఫైనాన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటేనే ప్రభుత్వ టెండర్లకు అర్హత ఉండేది. కాబట్టి మొదట్లో సబ్ కాంట్రాక్టర్లుగా పనిచేశాం. మా రెవెన్యూ పెరిగింది. ఎక్స్పీరియన్స్ వచ్చింది. బ్యాంక్ లోన్ తెచ్చుకున్నాం. పెద్ద ప్రాజెక్టులు, ప్రభుత్వ టెండర్లు దక్కించుకున్నాం. హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, సిమెంట్ ఫ్యాక్టరీలు ఇతర పెద్ద పరిశ్రమల్లో సోలార్ ఎనర్జీ ఇన్స్టాలేషన్ చేశాం. కంపెనీ లాభాల బాట పట్టాక పాన్ ఇండియాలో చాలా టెండర్లు దక్కించుకున్నాం. ఆ తర్వాత విలేజ్ సోలార్ పవర్ ఎలక్ట్రిఫికేషన్ టెండర్లు తెచ్చుకున్నాం.

ఫ్రెయర్ కంపెనీ స్టార్ట్ చేసిన వారానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక పట్టణాల్లో మా ఆఫీసులున్నాయి. రెండేళ్లకు డీమానిటైజేషన్ జరిగింది. ఆ దెబ్బ నుంచి కోలుకున్నాక కొవిడ్ వచ్చింది. నాకు ఒక కస్టమర్ లేరు. ఒక ప్రాజెక్ట్ లేదు. నన్ను నమ్మి ఉద్యోగంలో చేరినవాళ్లే నాతో ఉన్నారు. బిజినెస్ జీరో లెవెల్‌కు పడిపోయింది. ఈ స్థితిలో ఉద్యోగులకు ఉపాధి కల్పన, కంపెనీని నిలబెట్టడం నా ముందున్న సవాళ్లు. మారిన పరిస్థితులకు అనుగుణంగా కొవిడ్‌లో బిజినెస్ మాడల్ మార్చాం. రిటైల్ సెక్టార్‌లోకి మారిపోయాం. డొమెస్టిక్ సోలార్ ఇన్స్టాలేషన్ మొదలుపెట్టాం. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేశాం. వాళ్ల రిఫరెన్స్ తీసుకుని కొత్త కస్టమర్లను సంపాదించుకుంటూ పోయాం.
కొవిడ్ తర్వాత మా కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు పెద్ద ఎనర్జీ కంపెనీలు ముందుకు వచ్చాయి. జీరో నుంచి మళ్లీ పుంజుకున్నాం. గతేడాది మా కంపెనీ టర్నోవర్ 178 కోట్ల రూపాయలు. ఈ ఏడాది సుమారు 400 కోట్ల రూపాయల ఆదాయం రావొచ్చు. ఇప్పుడు మా కంపెనీ రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ నెంబర్ వన్ సంస్థగా ఎదిగింది. ముప్పై వేల డొమెస్టిక్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లతో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాం. పన్నెండు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాం.
ఇక అవార్డులకు లెక్కేలేదు. భారత ప్రభుత్వం, గూగుల్ ‘ఉమెన్ ఆంత్రప్రెన్యూర్ క్వెస్ట్’కి ఎంపిక చేసిన పదిమందిలో నేనున్నాను. ఫెమినా అవార్డ్ వచ్చింది. చివినింగ్ ఫెలోషిప్తో ఆక్స్‌ఫర్డ్‌లో చదివాను. ఈ ప్రయాణం ఇంతే ఉత్సాహభరితంగా, విజయవతంగా కొనసాగుతుందని నమ్ముతున్నా!

పిల్లల్ని చూసుకుంటూ వ్యాపారం చేయడం తల్లులకు చాలా కష్టం. మొదట్లో మా అబ్బాయిని చూసుకోవడం, బిజినెస్ నడపడానికి సమయాన్ని కేటాయించడంలో కష్టాలు పడుతూ వచ్చాను. మా ఆయన డాటా ఎనలిటిక్స్ బిజినెస్‌లో బిజీగా ఉన్నారు. పాప పుట్టిన తర్వాత ఇంకా కష్టమైంది. ఇద్దరినీ స్కూల్‌కి పంపడం, ఎవరికేది కావాలో అది ఇవ్వడానికి చాలా సమయం కేటాయించాల్సి వచ్చేది. పిల్లల్ని టెన్నిస్ ప్రాక్టీస్‌కి తీసుకుపోయి అక్కడ కూర్చుని ల్యాప్‌టాప్‌లో పని చేసుకుంటూ ఉంటాను. ఇంటినీ, ఆఫీస్‌ని మేనేజ్ చేయడంలో కష్టం ఉన్నా.. అందులో ఉండే ఆనందమే వేరు.