చిన్న వయసులోనే పెండ్లి. పెద్ద చదువు ఆలోచనకు బ్రేక్ పడింది. ఇల్లు, భర్త, పిల్లలే లోకంగా బతికింది. ఆరేండ్ల తర్వాత ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చింది. తిరిగి చదువు కొనసాగించింది. ప్రైవేటు టీచర్‌గా పిల్లలకు పాఠాలు బోధించింది. ట్యూటర్‌గానూ పనిచేసింది. అయినా, ఎదుగూ బొదుగూ లేని జీవితం. ఆదాయం విషయంలోనూ అంతులేని అసంతృప్తి. వ్యాపారం చేద్దామన్నది ఒకప్పటి కల. కానీ ఆర్థిక పరిస్థితులు అడ్డొచ్చాయి. అన్ని తలుపులూ మూసుకుపోయి, అన్ని ఆశలూ ఆవిరైపోయి.. తన ఉనికే ప్రశ్నార్థకమైందని బాధపడుతున్న సమయంలో ‘దళిత బంధు’ కాంతిరేఖలా కనిపించింది. ‘వీ హబ్’ ఆమెను పారిశ్రామిక వేత్తగా నిలబెట్టింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్కు చెందిన నీరేటి మౌనిక విజయ ప్రస్థానమిది.
కొన్ని జీవితాల్లో సినిమాలను తలపించే మలుపులు ఉంటాయి. స్ఫూర్తి కథనాలను గుర్తుకుతెచ్చే విజయాలూఉంటాయి. తనకంటూ ఓ రోజు వస్తుందనీ, దర్జాగా వ్యాపారం చేసుకుంటాననీ నీరేటి మౌనిక కలలో కూడా ఊహించి ఉండదు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని సింగాపూర్ తన స్వగ్రామం. చిన్నతనంలోనే పెండ్లయింది. అప్పటికి తను ఇంటర్ చదువుతున్నది. ఆ తర్వాత, డిగ్రీ చేయాలనీ, వీలైతే ఎంబీయే పట్టా అందుకోవాలనీ ఆమె స్వప్నం. కానీ, వివాహంతో ఆమె కలల రెక్కలు తాత్కాలికంగా తెగిపోయాయి. కొంతకాలానికి పరిస్థితులు సర్దుకున్నాయి. చిన్నప్పటి నుంచీ చదువుపై ఉన్న ఆసక్తితో తిరిగి చదువు కొనసాగించింది. డిగ్రీ పూర్తి చేసింది. భర్త చిరుద్యోగి. ఇద్దరు పిల్లలు. కుటుంబానికి ఆసరాగా కొంతకాలం ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేసింది. ప్రతినిత్యం గంటల తరబడి నిలుచునే పాఠాలు చెప్పడం వల్ల వెన్నునొప్పి, సయాటికా వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో టీచర్ ఉద్యోగాన్ని వదిలేసింది. ఇంట్లోనే ట్యూషన్స్ చెప్పింది. ఈ ఆదాయమూ అంతంత మాత్రమే. మనసులో ఏదో వెలితి. సొంతంగా ఏదైనా వ్యాపారం చేద్దామంటే పెట్టుబడి పెట్టే స్తోమత లేదు. ఈ పరిస్థితుల్లో ‘దళిత బంధు’ పథకం మౌనికకు బాసటగా నిలిచింది.
ఎంతోమంది గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దిన ‘వీ హబ్’ వేదిక.. దళితబంధు లబ్ధిదారులకూ మార్గనిర్దేశం చేసింది. దళితబంధుకు ఎంపికైనవారిలో ఔత్సాహిక మహిళలను గుర్తించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేసింది. ఇదే క్రమంలో మౌనికకూ ‘వీ హబ్’ తోడ్పాటు అందించింది. ఏ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలనే విషయంలో మౌనిక తర్జనభర్జన పడింది. కిడ్స్‌వేర్ దుకాణం నడపాలని తొలుత భావించింది. ఆమె భర్తకు డ్రైవింగ్ తెలుసు. దీంతో ట్యాక్సీ కొనాలనే ఆలోచనా వచ్చింది. ఆ సమయంలోనే వీ హబ్ ఓరియంటేషన్ సెషన్‌కు హాజరైంది. అక్కడే తనకంటూ ఓ స్పష్టత వచ్చింది. వ్యాపారం ద్వారా కుటుంబ ఆదాయం పెరిగి తన కాళ్లమీద తాను నిలబడగలనని భావించింది. వ్యాపారం బాగా నడిస్తే.. ఎప్పుడైనా ట్యాక్సీ కొనుగోలు చేయవచ్చని భర్తకు నచ్చ జెప్పింది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, స్టేషనరీ షాప్ పెట్టుకోవాలని సంకల్పించింది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో శిక్షణ కూడా తీసుకుంది. యూనిట్ రిజిస్ట్రేషన్, లైసెన్స్, యంత్రాల కొనుగోలు, కొటేషన్ల ధ్రువీకరణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆమోదం, మార్కెటింగ్ తదితర అంశాల్లో ‘వీ హబ్’ ఆమెకు అండగా నిలబడింది. ప్రతిదశలోనూ నడిపించింది.
మౌనిక వ్యాపార స్వప్నాన్ని ‘దళితబంధు’ నెరవేర్చింది. ఆమె జీవితంలో కొత్త వెలుగులు తెచ్చింది. ఉపాధి కోసం మౌనిక కుటుంబం ఘట్కేసర్ ప్రాంతానికి వలస వచ్చి ఉంటున్నది. దీంతో ఈ ప్రాంతంలోనే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, స్టేషనరీ షాప్‌ను ఏర్పాటుచేసుకుని ఆత్మగౌరవంతో బతుకుతున్నది. ట్యూటర్‌గా ఉన్నరోజుల్లో కనాకష్టంగా నెలకు నాలుగువేలు సంపాదించిన చేతులతోనే.. వ్యాపారాన్ని ప్రారంభించిన నాటి నుంచే నెలకు రూ.10వేలకు పైగా ఆర్జిస్తున్నది. బతకడానికి గతంలో ఎన్నో కష్టాలు పడ్డామని, జీవితం ఇంత బాగుంటుందని కలలో కూడా అనుకోలేదని మౌనిక సంబురంగా చెబుతున్నది. ఇద్దరు అమ్మాయిలను బాగా చదివిస్తానని వివరించింది. త్వరలోనే వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటానని వెల్లడించింది. అవును, ఒక విజయంతోనో, ఒక మలుపు దగ్గరో ఆగిపోవడం ఆంత్రప్రెన్యూర్స్ లక్షణం కాదు. మున్ముందుకు సాగుతూనే ఉండాలి.. మౌనికా పరుగెత్తాలిక!
…? గంజి ప్రదీప్ కుమార్
– గడసంతల శ్రీనివాస్