‘జబర్దస్త్’ పవిత్ర.. జీ తెలుగు ‘సూపర్ క్వీన్స్ 2’ పవిత్రగా పేరు తెచ్చుకుంటున్నది. సీరియళ్లు, సినిమాలతో పాటు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారానూ ప్రేక్షకులకు దగ్గర అవుతున్నది. తన జీవితంలోని ఒడుదొడుకుల్ని ఇలా పంచుకున్నది పవిత్ర..
నటన అంటే చాలా మందికి అందమే కొలమానం. ఆ ఆలోచనతోనే నన్ను ఆడిషన్స్ దశలోనే తిప్పి పంపేవారు. కానీ నా ఆత్మ విశ్వాసం వేరు. నా నటన మీద నాకున్న నమ్మకం వేరు. ఆ బలంతోనే.. మంచి అవకాశాల్ని వెతుక్కుంటూ.. ఊరు వదిలి వచ్చాను. నెల్లూరు జిల్లా అనంత సాగరం మండలంలోని సోమశిల మా సొంతూరు. నాన్న లారీ డ్రైవర్. తాగుబోతు. మమ్మల్ని ఎప్పుడూ బాగా చూసుకోలేదు. దీంతో మా కడుపు నింపేందుకు అమ్మ కూలీ పనులకు, పాచి పనులకు వెళ్లేది. అమ్మకు ఒంట్లో బాగోలేకపోతే నేను వెళ్లి అంట్లు తోమేదాన్ని. అలా కష్టపడి టెన్త్, ఇంటర్ చదువుకున్నా. ఇక, అమ్మ మీద ఆధారపడకూడదని.. ‘నటులు కావలెను’ ప్రకటన చూసి హైదరాబాద్ వచ్చాను. అవకాశం కోసం కొంత డబ్బు కట్టాను. కానీ అది మోసమని తేలిపోయింది. అయినా ఆశ వదులుకోకుండా ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని. మొహం మీదే నా రంగు, ఎత్తు గురించి మాట్లాడేవారు. సినిమా అవకాశాలు అడిగితే వంకర చూపులు చూసినవాళ్లూ ఉన్నారు. దీంతో అప్పటికి సినిమాల సంగతి పక్కన పెట్టి, సత్య మాస్టర్ డాన్స్క్లాస్లో చేరాను. తర్వాత మాకున్న చిన్న స్థలం అమ్మి ఒక సెలూన్ ప్రారంభించాను.
సెలూన్ నడుపుతూనే షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాను. అదే సమయంలో ఒక పెళ్లిలో జబర్దస్త్ టీంను కలిశాను. అక్కడ నన్ను చూసిన అదుర్స్ ఆనంద్ తొలిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత రాకింగ్ రాకేశ్, సుడిగాలి సుధీర్, చలాకీ చంటి, రాకెట్ రాఘవ.. ఇలా అందరి టీమ్‌లలో చేసి మంచి పేరు తెచ్చుకున్నా. శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా నన్ను జనానికి దగ్గర చేసింది. జీ తెలుగు సూపర్ క్వీన్స్‌లో ఎంతోమంది మంచి నటులతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. సీరియల్స్‌లోనూ నటించాను.
ఇన్స్పెక్టర్ కిరణ్ సీరియల్లో ప్రధాన పాత్రధారి రోహిణి అక్క సొంత ఇంట్లో మనిషిలా అయిపోయారు. జనానికి మరింత దగ్గరవ్వాలన్న ఉద్దేశంతో పాగల్ పవిత్ర పేరిట యూ ట్యూబ్ ఛానెల్ పెట్టా. లక్ష మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. ప్రస్తుతం రెండు సినిమాల్లో చేస్తున్నా. మంచి పాత్రల్లో నటించి పేరు సంపాదించాలని, అమ్మను ఇంకా బాగా చూసుకోవాలనీ నా ఆశ!