ఆరో తరగతిలోనే అనుకున్నా!
కలెక్టర్ అవ్వాలన్న కోరిక ఇప్పుడూ అప్పుడూ కలిగింది కాదు... నా ఆరోతరగతిలోనే అనుకున్నది. బాల్యం మనిషి మీద ఎంత బలమైన ముద్ర వేస్తుందో మనకు తెలిసిందే. నా విషయంలోనూ అదే జరిగింది.
సివిల్స్… జీవితంలో ఒకసారి సాధిస్తే గొప్ప. అదీ తొలిసారి సాధిస్తే ఇంకా గొప్ప. ఈ రెండు గొప్పలే కాదు, ఏడాది వ్యవధిలో రెండుసార్లు సివిల్స్ ర్యాంకు కొట్టిందామె. ఐపీఎస్, ఐఏఎస్… వరుస ఏడాదుల్లో సాధించిన ఘనత ఆమెది. చదువుల నెలవు హైదరాబాద్ ఐఐఐటీ నుంచి పట్టా పుచ్చుకున్నది. ఊరించే విదేశీ కొలువుల్ని కాదనుకుని సమాజసేవకు నడుం కట్టింది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న గరిమా అగర్వాల్… తన విజయ రహస్యాన్ని జిందగీతో పంచుకున్నారిలా…
కలెక్టర్ అవ్వాలన్న కోరిక ఇప్పుడూ అప్పుడూ కలిగింది కాదు… నా ఆరోతరగతిలోనే అనుకున్నది. బాల్యం మనిషి మీద ఎంత బలమైన ముద్ర వేస్తుందో మనకు తెలిసిందే. నా విషయంలోనూ అదే జరిగింది. నేను పుట్టి పెరిగింది మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ పట్టణంలో. అక్కడే హిందీ మీడియంలో పదో తరగతి దాకా చదువుకున్నా. చిన్నప్పటి నుంచి ఆటపాటల్లో చురుగ్గా ఉండేదాన్ని. కవితలు రాయడం, ఉపన్యాస పోటీల్లో పాల్గొనడంలాంటివీ చేసేదాన్ని. నేను ఆరో తరగతిలో ఉండగా అల్కా ఉపాధ్యాయ కలెక్టర్ హోదాలో మా పాఠశాలకు ముఖ్య అతిథిగా వచ్చారు. అప్పుడందరూ ఆమెను ఎంతో గొప్పగా చూశారు. ఆ పదవి గురించి, దాని ద్వారా సమాజానికి చేయగలిగిన సేవ గురించీ తెలుసుకున్నాను. ఎందుకు ఆమెను అందరూ అంతగా గౌరవించారో అర్థమైంది. నేను కూడా తనలాగే మన దేశానికి సేవ చేయాలని అప్పుడే అనుకున్నాను.
సాధారణ కుటుంబం…
ఇంజినీరింగ్ కోసం మంచి కాలేజీలో చదవాలని బాగా ప్రిపేర్ అయ్యాను. ఐఐఐటీ హైదరాబాద్‌లో సీటు వచ్చింది. వచ్చి చేరాక ఇక్కడి వాతావరణం నాకు బాగా నచ్చింది. మంచి స్కోర్‌తో బీటెక్ పూర్తిచేశా. నా స్నేహితులకు క్యాంపస్ ప్లేస్మెంట్లలో మంచిమంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు వచ్చాయి. కొందరు విదేశాలకూ వెళ్లారు. నేను మాత్రం నా ఇంటర్న్‌షిప్ పూర్తి కాగానే సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టాను. ఒక గదిలో కూర్చుని గంటలు గంటలు చదువుతూ ఉండేదాన్ని. ఒక పక్క ‘పెండ్లి వయసు వచ్చింది… ఇంకెప్పుడు చేస్తారు…’ అంటూ అమ్మానాన్నలను బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఆరా తీస్తుండే వాళ్లు. మరోపక్క నాతోపాటు చదువుకున్న వాళ్లు విదేశాల్లో ఉద్యోగాల్లో స్థిరపడి మంచి మంచి ఫొటోలు పెడుతూ ఉండేవాళ్లు.
ఈ రెండూ మనసును కాస్త మళ్లించేవే! కానీ, నేను వీటిని దాటి నా లక్ష్యం మీద దృష్టి పెట్టానంటే అందుకు అమ్మానాన్నల ప్రోత్సాహమే కారణం. నేను ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటుంటే అమ్మ నాకు తోడుగా వచ్చి ఉంది. చిన్నప్పటి నుంచీ వాళ్లకు మా మీద అపారమైన నమ్మకం. నిజానికి మాది మధ్యతరగతి మార్వాడీ కుటుంబం. నాన్న వ్యాపారం చేసేవారు. అక్క, అన్నయ్య తరువాత నేను. చిన్ననాటి నుంచీ మా అమ్మానాన్నలు మాకు బాగా వెన్నుదన్నుగా నిలిచేవారు. దీంతో ఏ పనిలో అయినా మేం మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్లేవాళ్లం. నాకన్నా ముందు అక్కయ్య సివిల్స్ కొట్టింది. ఇండియన్ పోస్టల్ సర్వీస్‌కి ఎంపికైంది.
తెలంగాణ ఇష్టం
అక్క సివిల్ సర్వీసెస్‌కు ఎంపికవడంతో నాకు అటువైపు వెళ్లేందుకు సరైన మార్గం దొరికింది. నేను ఏం చదివినా నాకున్న సమయం, పూర్తి చేయాల్సిన అంశాలు బేరీజు వేసుకుంటాను. పకడ్బందీగా టైం టేబుల్ పెట్టుకుంటాను. దాని ప్రకారం పూర్తిచేస్తాను. ఆ కారణంగానే తొలిసారి సివిల్స్ రాయగానే మంచి ర్యాంకు వచ్చింది. ఐపీఎస్‌కు ఎంపికయ్యా. అక్కడ శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. తెల్లవారుజామున నాలుగున్నర నుంచి సాయంత్రం ఆరున్నర దాకా ట్రైనింగ్ ఉంటుంది. గుర్రం నడిపే శిక్షణా ఉంటుంది.
ఒక రోజు కిందపడ్డా. ఎముక విరిగింది. అయినా మళ్లీ వెళ్లాల్సి వచ్చింది. దీంతో మళ్లీ గాయాలయ్యాయి. అయినా సరే, ఆ శిక్షణ తీసుకుంటూనే సివిల్స్ ప్రిపేర్ అయ్యి పరీక్ష రాశా. ఐఏఎస్… వచ్చింది. పోస్టింగ్ కోసం మమ్మల్ని ఐచ్ఛికాలు ఎంచుకోమని చెబుతారు. మా సొంత రాష్ట్రం తర్వాత నేను తెలంగాణ పెట్టుకున్నా. ఈ నేలతో నాకు అంతటి అనుబంధం ఏర్పడింది. ఆ ఇష్టంతోనే తెలుగు కూడా నేర్చుకున్నా. ఇక్కడి ప్రజలతో వాళ్ల భాషలోనే మాట్లాడి సమస్యలు తెలుసుకుంటా. యాదాద్రి భువనగిరి, కరీంనగర్ జిల్లాల్లో పనిచేశా. ప్రస్తుతం సిద్దిపేట అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్నా. మా వారు పల్లవ్ తిన్నా సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇంటినీ, పనినీ సమతూకంలో ఉంచేందుకు నాకు ఎంతగానో సాయపడతారు.
ప్రతి మహిళకూ అవసరం
నేను అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో ఉన్నా కాబట్టి విజయం సాధించినట్టు అనుకోవడం లేదు. ప్రతి రోజూ పరీక్ష రాస్తున్నట్టే భావిస్తా. నా వృత్తిని ప్రజలకు మేలుచేసే విధంగా పూర్తిస్థాయిలో నిర్వర్తించగలిగితే అదే విజయం. ఇలాంటి స్థానాన్ని ప్రతి ఆడపిల్లా అందుకోవచ్చు. తమ కాళ్ల మీద తాము నిలబడాలన్న తపన ప్రతి అమ్మాయికీ ఉండాలి. వాళ్లు సొంతంగా బతకగలిగేందుకు దన్నును తల్లిదండ్రులు అందించాలి. అప్పుడు ప్రతి మహిళా మహారాణే!
– లక్ష్మీహరిత ఇంద్రగంటి
– బింగి శ్రీనివాస్
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

