‘60 ఏండ్ల వయసులో టెన్త్ పాస్’, ‘70వ ఏట డిగ్రీ ఉత్తీర్ణురాలైన బామ్మ’ తరహా శీర్షికలతో తరచూ వార్తల్లోకి వస్తున్న వయోధికులు.. నేటి తరానికి తామేమాత్రమూ తీసిపోమని నిరూపిస్తున్నారు. సావిత్రి నాయర్ కూడా అంతే. రెండో ఆలోచన లేకుండా.. ట్రెండ్ సెట్ చేశారు. ఆరు పదుల వయసులో ‘సావీస్ స్టోర్’ పేరుతో ఓ ఫుట్‌వేర్ స్టార్టప్‌కు ప్రాణం పోశారు. ఆ ముచ్చట్లన్నీ ఆమె మాటల్లోనే..
‘ప్రపంచ దేశాలను కొవిడ్ భయపెడుతున్న వేళ.. విమాన ప్రయాణికులంటేనే జనం గజగజా వణికిపోతున్న పరిస్థితుల్లో నేను జీఎంఆర్ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అప్పటికే నా వయసు 59కి చేరువైంది. మావారు ఎంబీఎస్ నాయర్. పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. నేను భారతీయ విద్యాభవన్ నుంచి.. ‘ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్’లో పీజీ చేశాను. మాకు ఓ అబ్బాయి. హోటల్ బిజినెస్‌లో ఉన్నాడు. చేతినిండా పని లేకపోతే నాకు నిద్ర పట్టదు. మొదట్నుంచీ ఏదైనా వ్యాపారం చేయాలనే కోరిక. కానీ ఉద్యోగం కారణంగా కుదరలేదు. కరోనా కాలం నాకు కలిసొచ్చింది. లాక్డౌన్ సడలింపుల తర్వాత మా బంధువుల ఫంక్షన్‌కు వెళ్తుంటే.. ‘నీ డ్రెస్‌కు చెప్పులు మ్యాచ్ కాలేదు’ అన్నారు మా వారు. ఆయన మాటలు ఆలోచింపజేశాయి.
‘డ్రెస్‌కు తగినట్లుగా చెప్పులు, ఇయర్రింగ్స్, బ్రాస్లెట్స్ కూడా ఉంటే బాగుంటుంది కదా! ఈ కాలం పిల్లలు ఈ ట్రెండ్‌ను బాగా ఇష్టపడతారు కూడా. ఇదే నా వ్యాపారం ఎందుకు కాకూడదు?’ అనిపించింది. వెంటనే అధ్యయనం ప్రారంభించాను. రాజస్థాన్‌లోని ఓ సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ వాళ్లు ఫుట్‌వేర్ బాటమ్‌ను తక్కువ ధరకే కుట్టిస్తారని తెలిసింది. అక్కడికి వెళ్లాను. పని నచ్చడంతో భారీగా ఆర్డర్ చేశాను.
ఇంట్లోనే ప్రయోగాలు
నేను దాచుకున్న డబ్బుతో కొంత మెషినరీ కొన్నాను. ఫుట్‌వేర్ బాటమ్పై అనేక ప్రయోగాలు చేశాను. అప్పటికే నాకు అరవై ఏండ్లు వచ్చేశాయి. అయినా చేస్తున్న పనిలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ.. అప్పర్ వర్క్‌కు అవసరమైన యాక్సెసరీస్, స్టోన్స్, త్రెడ్స్, జిప్స్, రింగులు, జువెలరీ, క్లాత్ వంటివి కొనుగోలు చేశాను. సొంతంగా డిజైన్లు రూపొందించి పాదరక్షలు తయారు చేశాను. చూసినవాళ్లంతా మెచ్చుకున్నారు. వెంటనే కొనేశారు. వెంటనే ప్రీమియం లెదర్ క్వాలిటీ చెప్పులపై దృష్టిపెట్టాను. కస్టమర్ల కోరిక మేరకు జువెలరీ, ఎంబ్రాయిడరీ వంటివి జోడిస్తాను. హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్, ఫ్లవర్స్, బ్రాస్లెట్, మ్యాచింగ్ వర్క్స్ మా ప్రత్యేకత.
వన్ ఉమెన్ ఆర్మీలా..
నా వ్యాపారానికి కావాల్సిన ముడిసరుకులు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకొని, నేనే స్వయంగా వెళ్లేదాన్ని. తెలిసిన వారి ద్వారా వీహబ్‌ను సంప్రదించాను. ట్రైనింగ్ ఇచ్చి, మెంటర్‌ను కేటాయించి.. ఈ-కామర్స్, ఫండింగ్, మార్కెటింగ్ తదితర సదుపాయాలు కల్పించారు. ఆ ప్రోత్సాహంతో మరిన్ని డిజైన్లు సిద్ధం చేశాను. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ట్, అమెజాన్ లాంటి వెబ్‌సైట్స్‌లో విక్రయాల విషయంలో వీహబ్ సంప్రదింపులు జరుపుతున్నది. నాకు ఇంక్యుబేషన్ సర్టిఫికెట్ ఇచ్చి.. రుణానికి అవసరమైన ఫార్మాలిటీస్ చూసుకుంటున్నది. ఆ మొత్తంతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఉంది. వ్యాపారం పెరిగేకొద్దీ మహిళలకు ఉపాధి అవకాశాలూ పెంచాలన్నది నా ఆలోచన. థ్యాంక్ యూ వీహబ్.
ట్రెండ్‌కు తగినట్టు
మొదట్లో పోచంపల్లి, కలంకారి వంటి ఫ్యాబ్రిక్‌తో కొత్త డిజైన్లు చేసేదాన్ని. ఇప్పుడు పెండ్లిళ్లు, ఫంక్షన్లు, పార్టీలకు నప్పేలా చెప్పులపై కొత్త నగిషీలు అద్దుతున్నాను. కస్టమర్ అభిరుచికి తగ్గట్టు చెవి దిద్దుల నుంచి బ్యాంగిల్స్, మొబైల్ పౌచ్, చెప్పులు.. అన్నీ మ్యాచింగ్ కలర్లో ఉండేలా డిజైన్ చేస్తున్నా. మదర్ అండ్ డాటర్ మ్యాచింగ్ ఫుట్‌వేర్ కూడా తయారు చేస్తున్నాను. ఇటీవల ఎంబ్రాయిడరీ కలెక్షన్లు తీసుకొచ్చాను. యువకులైతే.. తొలి బిజినెస్ ఫెయిలైతే, ప్లాన్ బీకి వెళ్లొచ్చు. నాకు అంత శక్తి లేదు. వయసూ లేదు. కాబట్టే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నా.
– సావిత్రి నాయర్, ‘సావీస్ స్టోర్’ సీయీవో