‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.2 వేల బహుమతి పొందిన కథ.
మిట్ట మధ్యాహ్నం.. ఎండ తీక్షణంగా ఉంది. నేల తడిసి నెలలు గడిచిన ఆనవాళ్లు.. ఆ మట్టి రోడ్డులో జీవం లేదు. ఆ జీవంలేని రోడ్డుపై జీపు భారంగా కదులుతున్నది. ఒత్తిడి భరించలేని నేలతల్లి బెంబేలెత్తుతున్నట్టు ధూళి ఎగసిపడుతున్నది. ఎగుడు దిగుడుల కారణంగా జీపు అటూ ఇటూ ఊగుతున్నది. ప్రధాన రహదారిని వదిలి పాము మెలికల్లాంటి ఆ మట్టి రోడ్డుపైకి జీపు వచ్చి చాలా సేపయ్యింది. జీపులో కూర్చున్న రామయ్యకు అయోమయంగా ఉంది. ఆ రైతు కళ్లు పరిసరాలను నిశితంగా గమనిస్తున్నాయి. కనుచూపు మేరలో పంట పొలం లేదు. జనావాసాల జాడ కనిపించడం లేదు.
‘అసలు ఎవరితను? ఆత్మహత్య చేసుకోబోతున్న నన్నెందుకు రక్షించాడు? నా మానాన నన్ను వదిలేయక ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? అసలు ఇప్పుడు నేనెక్కడ ఉన్నాను? ఇదేదో కొత్త ప్రాంతంలా ఉందే!? అసలు ఇతని ఉద్దేశం ఏమిటి?’.. ఆశ్చర్యం, భయం, ఆందోళన చుట్టుముడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయత.
కాసేపటికి జీపు ఓ ఊరికి దగ్గరయ్యింది..
‘పర్వాలేదు, జనారణ్యంలోనే ఉన్నాను. ఇతగాడిది ఈ ఊరేనేమో!’ మనసులోనే అనుకున్నాడు.
ఏకాగ్రతతో జీపు నడుపుతున్న అతని వైపు చూశాడు. అతనిలో ఏ భావమూ లేదు. రామయ్యకు ఆసుపత్రిలో జరిగింది ఒక్కసారిగా కళ్లముందు మెదిలింది.
ఆసుపత్రి బెడ్‌పై.. పక్షం రోజుల తర్వాత కళ్లు తెరిచాడు రామయ్య.
“నన్నెందుకు రక్షించారు? నన్ను చనిపోనివ్వండి. నిత్యం ఓడిపోతూ బతకడం నావల్ల కాదు. నేను చావాలి.. నేను చావాలి”.. అరుస్తున్న అతనివైపు డ్యూటీ నర్సు అయోమయంగా చూసింది. తనకు తెలిసింది చెప్పి సముదాయిస్తున్నది.
“అలాగే! చనిపో.. నీ ప్రాణం నీ ఇష్టం! కానీ, చనిపోయే ముందు ఒక్కసారి నీవాళ్ల గురించి ఆలోచించావా?” అప్పుడే ఆ గదిలోకి అడుగుపెట్టిన అతను ప్రశ్నించాడు. తానెప్పుడూ చూడని వ్యక్తి, అలా సొంత మనిషిలా ప్రశ్నించేసరికి రామయ్య ఆశ్చర్యంగా అతనివైపు చూశాడు.
“అవన్నీ నీకెందుకు? నా గురించి నీకేం తెలుసు? నా చావు నన్ను చావనివ్వకుండా రక్షించడానికి నువ్వెవరు?”.. ఆ మాటల్లో ఆవేదన ధ్వనిస్తున్నది.
“తన చావుకు తానే ముహూర్తం పెట్టుకున్నవాడు పిరికివాడు. గెలుపు ఓటములు పట్టించుకోకుండా పోరాడినవాడు యోధుడు!” బాణంలా దూసుకువచ్చాయి అతని నోటి నుంచి మాటలు.
“ఈ మాటలకేం! అన్నీ ఉన్నవాడు ఎన్నయినా చెబుతాడు. వినీ వినీ విసిగిపోయాను. నిత్యం బతుకు పోరాటం చేసే ఓపిక నాకు లేదు. నన్ను వదిలేయ్!”.
“కష్టాలేవో నీ ఒక్కణ్నే చుట్టుముట్టినట్టు మాట్లాడుతున్నావే!”.. అతను వ్యంగ్యంగా అన్నాడు.
“నా వేదన నీకు నవ్వుతెప్పిస్తున్నదా? చెమటను ఇంధనంగా మార్చి.. ఆరుగాలం బతుకు బండి నడిపే మట్టిమనిషిని నేను. నేలతల్లి కరుణించకుంటే బాధపడేవాణ్ని కాదు. ప్రకృతి ముఖం చాటేస్తే.. ఇది మామూలేనని సరిపెట్టుకునేవాణ్ని. మనిషే మనిషిని మోసం చేస్తున్నాడు. స్వార్థంతో అన్నదాత గొంతు కోస్తున్నాడు. ఇలాంటివారి మధ్య బతకలేను!”.
“ఏం నువ్వు మనిషివి కాదా!? నువ్వు ఈ జనారణ్యంలో బతకడం లేదా!?”.. కోపంగా అన్నాడతను.
“బతకలేకే కదా చావాలనుకున్నాను. నా సాగు భూమిని లాక్కున్నారు. ఏమంటే అభివృద్ధి అన్నారు. ఫ్యాక్టరీ కడతామంటున్నారు. ఆ ముసుగులో చేస్తున్న వ్యాపారం. పెద్దోళ్ల భూములు వదిలేసి నాలాంటి పేదోళ్ల భూములపై పడ్డారు. ఒప్పుకొంటే సరి.. నాలా మొండికేసిన వారిని దారీతెన్నూ లేకుండా చేశారు. ఊరి పెద్దల్నే కాదు.. అడ్డొచ్చే వారందరినీ కొనేశారు. చట్టాన్ని చుట్టంగా మార్చుకున్నారు. కళ్లముందే న్యాయాన్ని సమాధి చేశారు. ఇస్తామన్నది కూడా సరిగా ఇవ్వలేదు. నాకు, నా కుటుంబానికి ఇంత అన్నంపెట్టే భూమి లేకుండా చేస్తే నేనెలా బతకాలి? ఎవరికోసం బతకాలి?”.
“అన్నిటికీ చావే శరణ్యమా!?” ఓదార్పుగా అన్నాడు.
“కాకపోవచ్చు.. స్వార్థపరులైన మనుషుల మధ్య న్యాయం జరగనప్పుడు మనశ్శాంతికి అదే సరైన దారి”.
“నువ్వు చనిపోతే నీ భార్యాబిడ్డల గతేం కాను”.
“నేనుండి మాత్రం వారికి ఒరిగింది ఏమిటి? పట్టెడన్నం పెట్టలేని అసమర్థుడిని నేను”.
“అంటే.. నిన్నే నమ్ముకున్న నీ వాళ్లను వదిలేసి నీ మానాన నువ్వు చనిపోతాననడం స్వార్థం కాదా?”.
రామయ్య ఆలోచనలో పడ్డాడు. సమాధానం కోసం తడబడ్డాడు. అతనికి భార్యా, పిల్లలు గుర్తుకు వచ్చారు. అర్ధాకలి జీవితం జ్ఞాపకం వచ్చింది. కళ్లు చెమ్మగిల్లాయి. చిరిగిన చీరలో తన గౌరవాన్ని కాపాడుకునేందుకు తంటాలు పడుతున్న భార్య, అవసరం చెప్పాల్సి ఉన్నా తండ్రిముందు నోరు తెరవొచ్చో, తెరవకూడదో తెలియని అయోమయంతో చూస్తున్న పిల్లల ముఖాలు గుర్తుకు
వచ్చాయి.
“నాది స్వార్థమే! కానీ ఏం చేయమంటావు? మరో దారేదీ కనిపించలేదు”.
“మార్గమేగా.. నీకు కావాల్సింది. నాతో వస్తావా? నీకు నచ్చిన మార్గం చూపిస్తాను. అదీ నీకు నచ్చకపోతే ఇక నీ ఇష్టం”.. అతను సూటిగా చూస్తూ చెప్పాడు.
“దిగు రామయ్యా.. ఊరొచ్చింది!”.. జీపు నడుపుతున్న వ్యక్తి పిలుపుతో ఆసుపత్రి ఆలోచనల్లోంచి బయటికి వచ్చాడు రామయ్య.
ఎదురుగా పెంకుటిల్లు. దూరం నుంచి కనిపించిన ఊరు అదే అనుకున్నాడు. గట్టిగా వందిళ్లు కూడా లేవు. అవి కూడా విసిరేసినట్టు అక్కడక్కడా ఉన్నాయి. కనుచూపు మేరలో ఖాళీ భూములు. సమీపంలో మరో ఊరు జాడ లేదు. ఇంట్లోకి అడుగుపెట్టిన రామయ్యకు అదో డబ్బున్న వాళ్ల ఇళ్లు అనిపించక పోయినా.. పేదరికం ఛాయలు మాత్రం కనిపించ లేదు. ఇద్దరు ఆడవాళ్లతో సహా నలుగురైదుగురు మనుషులున్నారు.
“రామయ్యా! ఆ మర్చిపోయాను.. నీ పేరు రామయ్యే కదా!?” అడిగాడు అతను ఆశ్చర్యంగా.
“పూర్తి పేరు రామచంద్రయ్య బాబూ! అంతా ‘రామయ్యా!’ అని పిలుస్తుంటారు”.
“నా పేరు కృష్ణమోహన్. ఇది కొండవీడు. నా సొంతూరు. మీ ఊరికి చాలా దూరం. కంగారుపడకు. వద్దనుకుంటే నీ ఇంటికి నిన్ను చేర్చే బాధ్యత నాది”.
“చావు కోరుకునేవాణ్ని బాబూ! నాకు ఇల్లయినా, శ్మశానమైనా ఒకటే!”.
ఆ మాటలకు అతను నవ్వేశాడు.
“సరేలే.. భోజనం అయ్యాక విశ్రాంతి తీసుకో. సాయంత్రం అన్ని విషయాలూ మాట్లాడుకుందాం. నీకు అవసరమైన పంచె, తువ్వాలు తెచ్చాను. వంటిపై ఉన్నవి ఉతికేందుకు పడేసి, స్నానం చేసి అవి కట్టుకో” చెప్పి వెళ్లిపోయాడు అతను.
భోజనం అయ్యాక పడుకున్న రామయ్యకు ప్రయాణ బడలిక వల్ల బాగా నిద్రపట్టేసింది. కళ్లు తెరిచేసరికి ఎదురుగా కుర్చీలో కృష్ణమోహన్. తననే చూసి నవ్వుతుండటంతో ఉలిక్కిపడి లేచాడు.
“ఏం రామయ్యా! బాగా నిద్రపట్టిందా?” అభిమానంగా అడిగాడతను.
“పీడకలలు వెంటాడుతున్నాయి బాబూ! అవి నా జీవితాన్ని వదిలిపోవేమో!?” ఆవేదనగా అన్నాడు.
“అవి పీడకలలు కావు రామయ్యా! నీలోని భయం. ఆ భయం పోవాలంటే నీపై నీకు నమ్మకం పెరగాలి. ఇందుకు చిన్న పిట్టకథ చెబుతాను.. వింటావా?”.
‘చెప్పు బాబూ!’ అన్నట్టు చూశాడు.
“అతనో సైనికుడు. సరిహద్దులోని కీలక ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నాడు. తోటి సైనికులతో కలిసి డేగ కళ్లతో కాపలా కాస్తున్నాడు. ఊహించని విధంగా శత్రువులు దాడి మొదలుపెట్టారు. వారి సంఖ్యా బలం ఎక్కువ. అయినా భయపడ లేదు. ధైర్యంగా పోరాడారు. శత్రువుకు చావు దెబ్బ తగిలింది. కానీ, తోటి సైనికులంతా చనిపోయారు. అతనొక్కడే మిగిలాడు. శత్రువులు సమీపిస్తున్నారు. చావు చెంతనే ఉంది. అయినా ఏదో తెలియని ఆశ. గెలవగలనన్న నమ్మకం. చివరి ప్రయత్నంగా శత్రు సైనికుల మధ్యకు ఓ గ్రెనేడ్ విసిరాడు. అదే సమయంలో అటు నుంచి ఓ గ్రెనేడ్ వచ్చి అతని సమీపంలో పడింది. అతను తప్పించుకునే లోగానే ఇరువైపులా భారీ పేలుళ్లు. శత్రు సైనికులంతా చనిపోయారు. అతను మాత్రం ప్రాణాలతో మిగిలాడు. కళ్లు తెరిచి చూసేసరికి సైనిక ఆసుపత్రి బెడ్‌పై ఉన్నాడు. మోకాళ్ల వరకూ తొలగించిన కాళ్లు దర్శనమిచ్చాయి. ఈ కథ విన్నాక నీకు ఏమనిపిస్తున్నది. అతను గెలిచాడా? ఓడిపోయాడా?”.
“వ్యక్తిగతంగా ఓడిపోవచ్చు.. కానీ, దేశాన్ని గెలిపించాడు”.
“శభాష్ రామయ్యా! హృదయం ఉప్పొంగే సమాధానం చెప్పావు”.
“ఇంతకీ ఎవరు బాబూ ఆ సైనికుడు?”.
“నేనే!.. అవును రామయ్యా! ఆ ఓడి గెలిచిన సైనికుణ్ని నేనే! ఇప్పటివరకు నువ్వు గమనించలేదేమో.. నేను నడుస్తున్నది నా కాళ్లపై కాదు. కృత్రిమ పాదాలపై”.. అంటూ పంచె కాస్తంత పైకెత్తాడు.
ఒక్కక్షణం రామయ్య దిగ్భ్రమకు లోనయ్యాడు. కాసేపు నిరుత్తరుడయ్యాడు. ఆశ్చర్యంగా అతనివైపు చూశాడు. అతని ధైర్యం, ఆత్మవిశ్వాసం చూసి ఆశ్చర్యపోయాడు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆవేదనగా మళ్లీ ఓసారి అతని వైపు చూశాడు.
“యోధుడు ఎప్పుడూ ఓడిపోడు రామయ్యా! ఓటమి అంచుకు చేరినప్పుడే విజయానికి దగ్గరైనట్టు. విజయమో, వీర స్వర్గమో. గెలిస్తే చరిత్రలో నిలిచిపోతాం. ఓడిపోతే ఊహించిందే జరుగుతుంది. అటువంటి సందర్భంలో కావాల్సింది మనోధైర్యం”.
నాలుగు పదుల వయసు కూడా లేని అతని మాటలు వింటూ రామయ్య విస్తుపోతున్నాడు.
“చూడు రామయ్యా! నువ్వు కర్షకుడిగా గెలిచావు. నేను సైనికుడిగా గెలిచాను. అనుకోని పరిస్థితుల్లో ఇద్దరం వ్యక్తిగతంగా ఓడిపోయాం. జీవితంలో కాదు.
అంతేనంటావా? కాదా?”.
“నిజమే బాబూ!”.
“చీకటి ఎంత భయంకరమైనదైనా చిరుదీపం దాన్ని పారదోలగలదు. జీవితం కూడా అంతే! కష్టనష్టాలు ఎలాంటివైనా ఆత్మవిశ్వాసం అనే చిరుదీపం మనలో వెలుగుతున్నంత కాలం.. ఓడిపోయే అవకాశం లేదు. ఇది నా నమ్మకం”.
రామయ్యకు ఏం చెప్పాలో తోచలేదు. మౌనంగా అతనివైపు చూస్తున్నాడు.
“రామయ్యా! రైతు అసామాన్యుడు. అతనో శాస్త్రవేత్త.. ఓ డాక్టర్.. ఓ శ్రామికుడు.. మరెందరో సమ్మిళితం. రైతే దేశానికి వెన్నెముక. నీలాంటి రైతులు దేశానికి మార్గదర్శకులు కావాలి. నా సైనికుడి భాషలో చెబుతాను విను.. ఆత్మస్థయిర్యం దెబ్బతింటే చేతిలో ఏకే-47 ఉన్నా శత్రువును ఓడించలేం. ధైర్యంతో ముందడుగు వేయగలిగితే ఖాళీ చేతుల్తోనూ మట్టి కరిపించగలం. ఇది నేను అనుభవంతో చెబుతున్న మాట. దేశ రక్షణకు సైనికుడు.. జనం రక్షణకు కర్షకుడు అవసరం”.
“అవును బాబూ. అన్నదాత లేకుంటే కడుపు నిండదు. సైనికుడే లేకపోతే కంటిపై కునుకుండదు”.
“మరి అంతటి విలువ, గొప్పతనం నీలో దాచుకుని బేలగా చనిపోతానంటావేం. అందుకే నిన్ను రక్షించాను” నవ్వుతూ అన్నాడు కృష్ణమోహన్.
ఆ సాయంత్రం రామయ్యను కృష్టమోహన్ ఊరికి దూరంగా ఉన్న కొండవాలు ప్రాంతానికి తీసుకెళ్లాడు. చిన్నచిన్న కమతాలుగా ఉన్న భూమిని చూపించాడు.
“సరిహద్దు పోరులో కాళ్లు పోగొట్టుకుని నిస్సహాయకుడిగా మారినందుకు ప్రభుత్వం నాకిచ్చిన ఐదెకరాల భూమి ఇది రామయ్యా! గడిచిన ఐదేళ్లుగా వృథాగా పడిఉంది. పండించాలన్న ఆశ ఉన్నా.. నాకు వ్యవసాయం చేయడం రాదు”.
రామయ్య అతనివైపు ఆశ్చర్యంగా చూశాడు.
“ప్రస్తుతం నా జీవితానికి తోడు నా భార్య, ఇద్దరు పిల్లలు, ఈ కృత్రిమ పాదాలు, వాలు కుర్చీ, ఈ విశాలమైన పెంకుటిల్లు మాత్రమే. ప్రభుత్వం పింఛన్ ఇస్తున్నది. ఓడి గెలిచిన సైనికుడిగా ప్రభుత్వం ఇచ్చిన నగదు సాయం బ్యాంకు డిపాజిట్ రూపంలో ఉంది. ఉద్యోగం చేస్తూ కూడబెట్టిన మొత్తంతో పట్నంలో సమకూర్చుకున్న స్థిరాస్తిపై ఆదాయం వస్తున్నది. నా భార్య, బిడ్డల్ని పోషించుకునేందుకు ఇవి చాలు. కానీ, ఓ స్వార్థం నన్ను నడిపిస్తున్నది. ఆ స్వార్థమే నిన్ను రక్షించేలా చేసింది”.
“ఏమిటి బాబూ.. ఆ స్వార్థం?”.
“ఊరికి ఉపకారం చేయాలన్న స్వార్థం. బీడు వారిన ఈ నేలతల్లిని పంటభూమిగా మార్చాలన్న స్వార్థం. ఇది బీడుభూమి కాదు.. పంట పండే బంగారు లక్ష్మి అని నిరూపించాలన్న స్వార్థం. కాలం కత్తివేటుకు ఇక్కడి రైతులు బలైపోయినా ప్రత్యామ్నాయం లభిస్తే ఈ నేలతల్లి సిరులు కురిపిస్తుందని నిరూపించాలన్న స్వార్థం”.
హృదయాన్ని మెలిపెడుతున్న ఆవేదన వల్ల కావచ్చు. అతను కాసేపు ఆగి మొదలుపెట్టాడు.
“కనుచూపు మేరలో కనిపించే ఈ భూములన్నీ మా ఊరు, చుట్టుపక్కల మరో రెండూళ్ల రైతులవే రామయ్యా! అంతా సన్న, చిన్నకారు రైతులే. భూగర్భ జలాలు లేకున్నా, వానకాలంలో నీటి తడితోనే ఖరీఫ్, తర్వాత అపరాలు పండించే వారు. భుక్తికి లోటు లేకుండా ఉండేది. కాలంతోపాటు వచ్చిన మార్పులు ఈ భూములకు శాపంగా మారాయి. పర్యావరణ మార్పులతో వర్షాలు అదునుతప్పాయి. వరుసగా రెండు సీజన్లలో పంటలు పోయాయి. ఆ తర్వాత ఓ ఏడాది పంట పండినా.. తర్వాత మరో మూడేళ్లు అవే కష్టాలు. రైతులకు ప్రత్యామ్నాయం లేదు. రానురాను అర్ధాకలి బతుకులతో జనంలో విసుగు, కోపం మొదలయ్యాయి. భూమిని నమ్ముకుంటే పస్తులేనన్న నిర్ధారణకు వచ్చేశారు. ప్రత్యామ్నాయం వెతుక్కుంటూ చాలామంది పట్నానికి వెళ్లిపోయారు. ఊరు శ్మశానంలా మారింది. ఉన్నవారు వ్యక్తిగత కారణాలతో నెట్టుకొస్తున్న వారే తప్ప.. బతుకుపై ఆశతో కాదు”.
రామయ్య మనసులోని చాలా సందేహాలకు అప్పుడప్పుడే సమాధానాలు దొరుకుతున్నాయి. అతను కృష్ణ
మోహన్ చెబుతున్నది మరింత శ్రద్ధగా వింటున్నాడు.
“ఇవి ఎందుకూ కొరగాని భూములు కావు రామయ్యా! పరిస్థితుల కారణంగా అలా మారాయి. కష్టపడితే సాగుయోగ్యం చేయొచ్చన్నది నా నమ్మకం. చేసి చూపించాలన్నది నా తపన. ఇందుకు నా ఐదెకరాలు నాంది కావాలి. అందుకే నీ సాయం కోరుతున్నాను. ఎంత ఖర్చయినా భరిస్తాను. ఒక్క ఖరీఫ్ సీజన్లో అయినా నా ఐదెకరాలు పచ్చని పంటతో కళకళలాడాలి. అది మరికొందరిలో స్ఫూర్తి నింపాలి. ఈ భూముల్లో బంగారం పండాలి. అదే నా ఆశయం!”.
“బాబూ! వ్యవసాయం అంటే విసుగొచ్చింది. భూమిని నమ్ముకోవడం అంత చెడ్డపని మరొకటి లేదనుకున్నా. కానీ, నీ ఆకాంక్ష విన్నాక నాలో ఏదో తెలియని శక్తి ఆవహిస్తున్నది. నా అనుభవాన్నంతా రంగరించి నీ భూమిని పచ్చని పైరుతో కళకళలాడిస్తాను”.. ఆత్మవిశ్వాసంతో చెప్పాడు రామయ్య.
కృష్ణమోహన్ ముఖంలో.. ‘నువ్వు చెయ్యగలవు రామయ్యా!’ అన్న సంతృప్తి కనిపించింది.
ఆకాశం మేఘావృతమై ఉంది. కొండవాలులోని బండరాయిపై కూర్చున్నాడు రామయ్య. అతని ముఖం దైన్యంతో నిండి ఉంది. అప్పుడే రెండు ఖరీఫ్ సీజన్లు వెళ్లిపోయాయి. వానల్లేక పంట దక్కలేదు.
“నన్ను, నా కుటుంబాన్ని అప్పనంగా పెంచుతున్నాడు ఆ పిచ్చి మారాజు. నేనేదో సాధిస్తానని అడిగినవన్నీ సమకూరుస్తున్నాడు. నా భార్యా బిడ్డలు బతికేందుకు డబ్బు పంపిస్తున్నాడు. ఆ అవిటివాణ్ని నేను మోసం చేస్తున్నాను.. నేను మోసం చేస్తున్నాను! అతనికి నా ముఖం ఎలా చూపించగలను?” రామయ్య మనసు విలవిల్లాడిపోతున్నది.
నిరాశగా ఆకాశం వైపు చూశాడు. కారు మబ్బులు ఢీకొన్న ఆనవాలుగా మెరుపు మెరిసింది. కాసేపటికి ఉరుము ఉరిమింది. విరుచుకుపడే ప్రళయానికి ముందు వినిపించని (నిశ్శబ్ద) గీతంలా.. అప్పటివరకూ ఉన్న ప్రశాంతతను చీలుస్తూ ఆకాశంలో అలజడి. ఉత్కంఠతో చూస్తున్న రామయ్య నుదుటిపై ఓ చినుకుపడి చెదిరిపోయింది. కాసేపటికి వర్షం జోరందుకుంది.
“లాభం ఏమిటి? ఖైదీని ఉరితీసిన తర్వాత నిజం తెలిసినట్టు.. పంట ఎండిపోయాక కురిసిన ఈ వర్షంతో ఏం ప్రయోజనం? పది రోజుల ముందు ఇదే వర్షం కురిస్తే ఎంతబాగుండు!” తిట్టుకున్నాడు రామయ్య.
జోరువానలో గంటపాటు తడిసి ముద్దయ్యాడు. అయినా అక్కడినుంచి కదల్లేదు. ఆవేదనతో ఆలోచిస్తూ కూర్చున్న రామయ్య చెవికి.. నీటి గలగలల శబ్దం సోకింది. ఏదో తెలియని ఆశ.. చీకటిలో చిరుదీపంలా మనసును పెనవేసుకున్న కుతూహలం. అతనికి తెలియకుండా అడుగులు అటువైపు పడ్డాయి. శబ్దం వస్తున్న కొండపైకి వందడుగులు ఎక్కాక.. వర్షం నీరు కిందికి జారుతుండటం గమనించాడు. గుబురు పొదలు, రాళ్లు, ఎర్రమట్టి నిండిన ఎత్తుపల్లాల కొండవాలుల్లో వర్షం కురిసిన చాలారోజుల వరకూ నీటి చెమ్మ ఉంటుందని అతనికి తెలుసు. పొదలు, చెట్లు, రాతి నీడల కారణంగా ఆ నీరు అంతవేగంగా ఆవిరి కాదని అనుభవంలో తెలుసుకున్నాడు. కొండ కోనల్లోనే నదీ ముఖద్వారాలు ఉండేందుకు కారణం కూడా ఇదేనని.. ఎవరో చెప్పగా విన్నాడు.
ఈ విషయం గుర్తుకురాగానే రామయ్యకు కొండంత శక్తి వచ్చినట్టయింది.
‘ఈ కొండపై నీటి ఊటలకు ఈ మట్టిలోని ప్రత్యేకత కారణం కావచ్చు. ఈ నీటిని ఒడిసిపడితే నా శ్రమ ఫలిస్తుంది. కృష్ణమోహన్ ఆశయం నెరవేరుతుంది’.. ఈ ఆలోచన రాగానే రామయ్య ముఖం విప్పారింది. లక్ష్యం సాధ్యమే అన్న ధైర్యం వచ్చింది. అప్పుడే అతని మనసులో ఓ ప్రణాళిక రూపుదిద్దుకుంది.
ఆరు నెలలపాటు నిద్రాహారాలు పట్టించుకోకుండా రామయ్య పడ్డ కష్టం కృష్ణమోహన్ కళ్లముందు మెదిలింది. గడ్డిపోచతో కొండను కదిలించాలన్న అతని తాపత్రయం చూసి అందరూ హేళన చేస్తున్నా.. మౌనంగా తన పని తాను చేసుకుపోయిన రామయ్య పట్టుదల చూస్తే యుద్ధ క్షేత్రంలోని సైనికుడు గుర్తుకు వచ్చాడు.
కొండవీడు గ్రామంలో సరికొత్త అధ్యాయం. ఇప్పుడందరి నోటా వినిపిస్తున్న మాట రామయ్య, కృష్ణమోహన్దే. ఎడారి లాంటి భూముల్లో పచ్చ‘ధనం’ పరవళ్లు తొక్కించిన ఘనత వారిది. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్న ఆర్యోక్తిని అక్షర సత్యమని నిరూపించిన నేలతల్లి ముద్దుబిడ్డ రామయ్య. ఆత్మహత్యే శరణ్యమనుకున్న రైతును రక్షించి అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఘనత కృష్ణమోహన్ది. ఈ శ్రమ ఫలితమే ఇద్దరినీ ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా నిలబెట్టింది. బంజరు భూముల్లో పంట పండించేందుకు తాపత్రయ పడుతున్న ఇద్దరినీ కొన్ని నెలల క్రితం చూసిన వాళ్లు పిచ్చోళ్లనుకున్నారు. అలా అనుకున్న వారే ఇప్పుడు పశ్చాత్తాపంతో తలదించుకుని వెళ్తున్నారు.
“వర్షం కురిశాక కొండపై రాళ్లకింద నిల్వ ఉన్న నీటి ఊటల్ని ఒడిసి పట్టగలిగితే.. పంట దక్కించుకోవడం పెద్ద కష్టంకాదు”.. అంటూ ఏడాది క్రితం రామయ్య చెప్పిన మాట విన్న కృష్ణమోహన్..
‘అది సాధ్యమేనా!?’ అనుకున్నాడు.
రామయ్య పట్టుదల చూసి.. ‘సరే!’ అన్నాడు. అతను కోరిన సాధన సామగ్రి సమకూర్చాడు. దాదాపు ఆరు నెలలపాటు నిద్రాహారాలు పట్టించుకోకుండా రామయ్య పడ్డ కష్టం కృష్ణమోహన్ కళ్లముందు మెదిలింది. గడ్డిపోచతో కొండను కదిలించాలన్న అతని తాపత్రయం చూసి అందరూ హేళన చేస్తున్నా.. మౌనంగా తన పని తాను చేసుకుపోయిన రామయ్య పట్టుదల చూస్తే యుద్ధ క్షేత్రంలోని సైనికుడు గుర్తుకు వచ్చాడు.
కృష్ణమోహన్ ఐదెకరాల భూమిని ఒకే కమతంగా మార్చాడు రామయ్య. పక్కనే ఉన్న బంజరు భూమిలో చిన్న చెరువు లాంటిది తవ్వాడు. పొలానికి సమీపంలో కొండ పైనుంచి కిందివరకు పలుచోట్ల చెక్ డ్యాంలు నిర్మించాడు. వర్షం కురిసినప్పుడు జాలువారే నీటిని ఒడిసిపట్టి.. కొండ దిగువన తవ్విన చెరువులోకి చేరేలా సన్నటి కాలువలు నిర్మించాడు. వర్షాకాలంలో కొండవాలు నుంచి జాలువారే ప్రతి నీటి బొట్టునూ చెరువులోకి మళ్లేలా చేశాడు.
తొలకరి ప్రారంభం నుంచే ఖరీఫ్ కోసం పొలాన్ని సన్నద్ధం చేశాడు. వర్షాలతోపాటు సాగు కొనసాగిస్తూ నీటి తడికోసం ఎదురు చూడాల్సిన సందర్భంలో చెరువు నీటిని పొలంలోకి మళ్లించాడు. అతని కృషి వృథా పోలేదు. కృష్ణమోహన్ ఐదెకరాల పొలం వరిపంటతో కళకళలాడింది. మరో రెండు నెలల్లోనే పంట చేతికొచ్చింది. ఊరి వాళ్లకు అదో అద్భుతం. వారిలో ఏదో తెలియని కొత్త ఉత్సాహం.
“శభాష్ రామయ్యా! రైతు అసామాన్యుడని నిరూపించావు. నా ఆకాంక్ష నెరవేర్చావు. ఊరి రైతుల జీవనమార్గానికి ఊపిరి పోశావు. ఎడారిలాంటి భూమిని పచ్చని లోగిలిగా మార్చావు. నా నమ్మకం వృథా పోలేదు”.. తన ఐదెకరాల పంటపొలం వద్ద నిల్చుని ఉబ్బితబ్బిబ్బయి పోతున్న కృష్ణమోహన్.. రామయ్యపై అభినందనల వర్షం కురిపిస్తున్నాడు. భవిష్యత్తులో ఆ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేందుకు తాను నాంది పలికినందుకు గర్వంగా అనుభూతి చెందుతున్నాడు.
‘రామయ్య అడుగు వేశాడు! మిగిలినవారు ఆ అడుగులో అడుగు కలపకుండా ఉంటారా?’ అనుకున్నాడు.
రామయ్య, కృష్ణమోహన్ కృషి, బీడు భూమిని సాగు యోగ్యం చేసిన వారి పట్టుదల, శ్రమ కథలు కథలుగా మీడియా ప్రచురించింది.
‘కొండవీడు గ్రామ రైతుల్లో నవోదయం’ అని ఓ పత్రిక కీర్తిస్తే.. ‘జై జవాన్.. జై కిసాన్’ అంటూ శీర్షిక పెట్టి మరో పత్రిక స్ఫూర్తి నింపింది.
బి. వి. రమణమూర్తి
బత్తుల వెంకట రమణమూర్తి స్వస్థలం విశాఖ నగరం మధురవాడ. సీనియర్ డెస్క్ జర్నలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎంఏ బీఈడీ చేసిన ఈయన, అనుకోని పరిస్థితుల్లో పాత్రికేయ రంగంలోకి వచ్చారు. 2016 నుంచి కథలు రాస్తున్నారు. తొలి కథ గోమాలచ్చిమి, నవ్య వారపత్రికలో 2018లో ప్రచురితమైంది. ఇప్పటివరకు నలభైకి పైగా కథలు రాశారు. 18 కథలు వివిధ పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాయి. నమస్తే తెలంగాణ-ముల్కనూరు గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘కథ-2020’ పోటీల్లో ఈయన కథ ‘ఆకుపచ్చ తివాచీ’.. పదివేల రూపాయల బహుమతిని గెల్చుకుంది. 2021 పోటీల్లో ‘మట్టి పరిమళం’ కథ సాధారణ ప్రచురణకు ఎంపికైంది. సామాజిక ప్రయోజనంతోపాటు పాఠకులను ఆలోచింపజేసే కథలు, హాస్య, వ్యంగ్య కథలు రాయడాన్ని రమణమూర్తి ఇష్టపడతారు. తన ఒక్క కథ అయినా.. కారా మాస్టారు, రావిశాస్త్రి, గురజాడలా సాహితీలోకం ప్రశంసలు పొందాలన్నది ఆకాంక్ష అని చెబుతున్నారు.
బి. వి. రమణమూర్తి
98489 87239