మన తిక్క శంకరయ్య ఒకపారి పొరుగూరికి వోయిండు. ఆడ ఆ ఊరి పటేలు ఇంట్ల లగ్గమైతంది. ఈడు కూడా సుట్టాలతోని తాగుకుంట, తినుకుంట మస్తు కుషీగున్నడు. అచ్చినోళ్లందరికీ ఒగలకొగలకు మాటలు గలిశినయి. అంతట్లకే మానోడు లేసి.. “నేను మనుసులల్ల దేవుణ్ని!” అంట గట్టిగ ఒర్రిండు. ఈనసొంటోడే ఆడ ఇంకోడు ఉన్నడు. “అయితే నీ ఇచ్చిత్రాలు సూయించు!” అంట అన్నడాడు. “నాకు మాయిమంత్రాలు తెలుసు!’ అంట మల్లన్నడు మనోడు. “అయితే చూపియ్యి!” అంట ఇంకోడన్నడు. “మీరందరు ఏమనుకుంటుండ్రో గూడ నేను జెప్పుత!” అంట అన్నడు మన తిక్క శంకరయ్య. “ఏ ఒర్రకు.. ముందుగాల మేమేం అనుకుంటున్నమో జెప్పు! లేకుంటే నీ ఈపు ఇమానం మోత మోగుద్ది!” అంట అందరు ఒక్కపారే గద్దరిచ్చిండ్రు. మనోడు తిరంగలేసి.. “నాకెరుకే.. నేను అవద్ధాలు జెబుతున్ననని మీరంత అనుకుంటుండ్రు గదా! సూడు.. నాకు మీ మనసుల్ల ఉన్నది తెలిశింది!” అనుకుంట ఆడికెళ్లి లేశివోయిండు.
…? పత్తిపాక మోహన్