Ramayanam |మా కాలేజీలోనే డిగ్రీ చదువుతున్న మాలను రవీందర్ అన్నయ్యవాళ్ల ఫ్రెండ్ ఇష్టపడ్డాడు. అందుకోసం ఆమెను పరిచయం చేసుకొమ్మని రవీందర్ అన్నయ్య నన్ను అడిగారు. నేను అవుననో, కాదనో చెప్పేలోగానే.. నా చేతిలో రెండు వందలు పెట్టారు. అప్పుడే వచ్చిన చిన్నాన్న వాళ్లు.. నాన్నే నాకు డబ్బులు పంపారని అనుకున్నారు.
క్కడ ఇంకొక సంగతి చెప్పాలి. నేను ఇంటర్ రెండో సంవత్సరంలోకి వచ్చేసరికి మా ఆర్థిక పరిస్థితి మాత్రమే కాదు, హైదరాబాదులోని చిన్నాయనల ఆర్థిక పరిస్థితులు కూడా దిగజారాయి. చిన్నాయనలిద్దరికీ ఉద్యోగాలు లేవు. పెద్ద చిన్నాయనకు అప్పటికే ఇద్దరు పిల్లలు. వాళ్ల స్కూలు ఫీజులు, ఇతర ఖర్చులకు డబ్బు ఎలా సమకూర్చేవారో తెలియదు. ఆ సంవత్సరమే చిన్న చిన్నమ్మతోబాటు పెద్ద చిన్నమ్మ కూడా మళ్లీ ప్రెగ్నెంట్‌గా ఉన్నారు.
మొత్తం ఉమ్మడి కుటుంబంలో ఏడుగురితోబాటు అదనంగా నేను ఒకదాన్ని. వాళ్లకు బమ్మెర నుండి బియ్యం లాంటివి వచ్చేవనుకుంటా. వాళ్లది పెద్ద ఇల్లు కనుక కాంపౌండ్‌ను అనుకుని ఉన్న మూడు నాలుగు పోర్షన్లు అద్దెకు ఇచ్చేవారు, ఆ డబ్బు వచ్చేది. మా అమ్మ ఆ ఇంటి ఆడబిడ్డ అని నన్ను బాగానే చూసేవారు. అమ్మ అప్పుడప్పుడూ ఏవైనా పంపించేది గానీ, మొదట్లోనే వాళ్లు వద్దన్నారని డబ్బు ఏమీ పంపేది కాదు.
అప్పుడప్పుడూ చిన్నాయనల్లో ఎవరో ఒకరు నా దగ్గర డబ్బు బదులు తీసుకుని వాళ్లకు రాగానే మళ్లీ ఇచ్చేవారు. నా దగ్గర మాత్రం డబ్బులు ఎక్కడుంటాయి? మా నాన్న నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు పుస్తకాలకో, పెన్నులకో, పేపర్లకో అవుతాయని ఇచ్చినవే. అయితే, నేను పెద్ద స్పెండింగ్ లేడీ ఆఫ్ ఇండియా. ‘నీ దగ్గర పైస ఒక్కరాత్రి కూడా నిద్ర చేయదు’ అని అమ్మ ఎప్పుడూ అంటుండేది. ఇప్పటికీ అంతే! నేను బ్యాంకర్ని అయినా కూడా నాకు పెద్దగా సేవింగ్స్ ఏమీ ఉండవు.
ఇంతకూ రవీందర్ అన్నయ్య డబ్బు ఇచ్చి వెళ్లిన మర్నాడే.. చిన్నాయనల్లో ఒకరికి డబ్బు అవసరం ఏర్పడి అడిగితే నా దగ్గరున్న ఆ రెండు వందలూ ఇచ్చేసాను. అది తిరిగి ఇవ్వడం ఆయనకు తొందరగా కుదరలేదు.
ఇక మాలను కలుసుకోవడం, ఆమెతో స్నేహం పెంచుకోవడం అనేది నా వల్ల కాలేదు. మాది ఒకే కాలేజీ అయినా, మా బిల్డింగ్ వేరు, తన బిల్డింగ్ వేరు. పైగా తొమ్మిది నుండి నాలుగు వరకు మాకు ప్రాక్టికల్స్, థియరీ క్లాసులు ఉండేవి. మధ్యలో లంచ్‌లో నేను ఇంటికొచ్చి తిని వెళ్లేదాన్ని. నాలుగవగానే అయిదు నిముషాల్లో ఇంటికి రాకపోతే నాయనమ్మ వాళ్లు కంగారు పడతారని భయం. పైగా నేను ఉన్నది బంధువుల ఇంట్లో. ఆ స్పృహతోనే ఎప్పుడూ ఉండేదాన్ని.
ఓసారి లెక్చరర్ రాకపోవడం వల్ల మాకేదో క్లాసు క్యాన్సిల్ అయింది. అప్పుడు మాలను కలుద్దామని బర్కత్పూరాలో ఉన్న సత్తెమ్మ నరసింహారావు కాలేజీ బిల్డింగ్‌కు వెళ్లాను. మాల వాళ్లకు క్లాసు ఉంది. అది అయ్యేదాకా ఆగి ఆమెను కలిసాను. “బాగున్నవా అక్కా!” అని అడిగాను. “బాగున్నాను! ఏంటీ ఇటొచ్చావ్?” అన్నది మాల. అప్పటికే ఆమె ఉచ్చారణ తెలంగాణా వదిలేసి ఆంధ్రాకు మారిపోయింది. ఆమె డ్రెస్సింగ్, మేనరిజం అన్నీ మారాయి. సెలవుల్లో మాతో ఆడిన మాల వేరు. చుట్టూ పరిసరాలు అలాంటివి.
నేను అబద్ధం చెప్పలేను. అలాగని నిజమూ చెప్పడానికి కుదరదు. ‘నీ కోసమే! నీతో పరిచయం పెంచుకోవడం కోసమే వచ్చాను’ అంటే ఏమైనా బాగుంటుందా? అసలు ఉన్న విషయం చెబితే ఆమె ఊరుకుంటుందా! ఎన్నో సందేహాలు.
“ఏం లేదక్కా! ఉత్తగనే ఒచ్చిన!” అన్నాను గొంతు తడారిపోతుంటే. మాల నావంక చిత్రంగా చూసి.. “సరే! నాకు క్లాసుంది” అని వెళ్లిపోయింది. నాక్కూడా క్లాసుకు టైం అవుతుంటే వచ్చేసాను. ఆ రోజే నాకు అర్థం అయింది, నేను ఆమెతో చనువో, స్నేహమో కొనసాగించే అవకాశమే లేదని. ముందు నాకంత చొరవ గానీ, మనుషుల్ని ఆకట్టుకునే లక్షణం గానీ, సరదాగా కబుర్లు చెప్పి కట్టిపడేసే చాణక్యం గానీ లేవని అర్థమైంది. ఆ తర్వాత రెండు మూడుసార్లు ఆమె కనిపించినప్పుడు నేను నవ్వితే తనూ నవ్వేది, ఒక్కోసారి అదీ లేదు. అంతే!
ఇక నా ముందున్న పెద్ద సమస్య అన్నయ్య వాళ్ల ఫ్రెండు తాలూకూ రెండొందలు వెనక్కి ఇవ్వడం. ఆ డబ్బు నా దగ్గర లేదు. చిన్నాయన ఇచ్చాక ఇవ్వాలి. తీరా ఆయన ఇచ్చేసరికి మా పరీక్షలైపోయి మా ఊరికొచ్చేసాను. పైగా అన్నయ్య కలిసినప్పుడే డబ్బు ఇవ్వాలి. నాకై నేను వెళ్లలేను. అమ్మకు అసలు విషయం చెప్పలేను.
ఇంతలోకే పెద్ద ఉపద్రవం వచ్చిపడింది. మా మేనత్త కూతురు డెలివరీ కోసం పుట్టింటికి వచ్చింది. ఆమెను చూసి రావడానికి వెళ్లిన అమ్మ తిరిగి వస్తూనే మొహమంతా జేవురించి నా మీద మండిపడుతూ.. “నీకింత బుద్ధి లేదేమే! మీ నాన పంపిన పైసలు గాక ఎవరెవరో కొత్తోళ్ల దగ్గర అప్పులు జేస్తవా? పైనుంచి గిన్ని రోజులైంది, నాకన్న చెప్పవా!? మిమ్ములనిద్దర్ని చదివిచ్చేటందుకు ఎంతమంది కాళ్లు పట్టుకున్న? ఎన్ని అవతారాలెత్తిన? ‘ఆడపిల్లలకు చదువులెందుకు?’ అని ఎంత మందితోటి మాటలు పడి చదివిచ్చిన? ఆమె అన్నన్ని మాటలంటుంటే నా తలకాయ కొట్టేసినట్టయింది.. ఎరికేనా?” అంటూ దులిపేసింది.
“ఏమైందమ్మా? నేను ఎవరి దగ్గర పైసలు తీసుకున్న?” అని నేను అడుగుతుండగానే.. నాన్న ఆ మాటలు విన్నట్టున్నాడు. “ఏంటిది? ఏమైంది?” అంటూ అక్కడికొచ్చాడు.
“ఏమో! ఇదట ఆ… రమ్మ భర్త స్నేహితుని దగ్గర రెండు వందలు బదలు తీసుకొని మళ్ల ఇయ్యలేదట. ఆమె ఇవాళ నాతోని.. ‘మనలో మనం అంటే ఏం గాదుగానీ, గట్ల పరాయోళ్ల పైసలు ఎగ్గొడితే ఏం మంచిగుంటది? ఆయిన మా ఆయనతోని చెబ్తుంటే ఇని నా ఇజ్జత్ పోయింది’ అని నన్ను దెప్పుతుంటే దీన్ని అడుగుతున్న!” అంటూ.. అమ్మ నామాటే వినిపించుకోకుండా నాన్నతో చెప్పింది. అంతే! నాన్నకు ఒళ్లెరుగని కోపం వచ్చింది. అంత కోపం నాన్నలో నేనెప్పుడూ చూడలేదు. పిచ్చి కోపంతో నన్ను ఎడాపెడా కొట్టాడు. ఇంకా చాలక అక్కడే మూలకున్న కర్ర తీసుకొని బాదాడు. నా ఒళ్లంతా ఎర్రగా వాతలు తేలాయి. వాటి బాధ కన్నా నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదన్న బాధ నాకెక్కువైంది. ఇక ఉండలేక “పొల్లను చావగొడ్తరా ఏంది?” అంటూ అమ్మ అడ్డుపడింది.
ఆ తర్వాత నేను అమ్మకు విషయమంతా చెప్పాను. “మరి మొదలే చెప్పొద్దా?” అంటూ అమ్మ ఎంతో బాధపడి, నా ఒళ్లంతా కొబ్బరినూనె రాసింది. ఏ రాత్రో నేను నిద్రలోకి జారుకుంటుండగా నాన్న నా పక్కన కూచుని.. ఒళ్లంతా నిమరడం గమనించి నా కళ్లల్లోంచి నీళ్లు వచ్చాయి. అయినా అలాగే కళ్లు మూసుకున్నాను.
ఆ మర్నాడే నాన్న మాకు పాలిచ్చే బర్రెను దూడతోసహా అమ్మేసి.. మా వదిన భర్తకు రెండు వందలు మనీయార్డర్ చేసి ఆ మాట ఆమెకు చెప్పేసా డు. దాంతో నా రాయబార భారం తొలగిపోయింది.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి