‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2026’లో తృతీయ బహుమతి రూ.10 వేలు పొందిన కథ.
అర్ధరాత్రి దాటింది. వెన్నెల పల్చగా కాస్తోంది. కీచురాళ్ల రోద, కప్పల బెకబెకలు వినిపిస్తున్నాయి. నెర్రలిచ్చిన పంటభూమిలో గొర్రెలమంద నిశ్చింతగా నిద్రపోతోంది. దొడ్డుతట్టల వెలుపల తాటికమ్మల మీద దుప్పటి పర్చుకుని, తలకింద వట్టిగడ్డి కుక్కిన గోనెసంచిని పెట్టుకుని యాభై ఐదేళ్ల అప్పలకొండ గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. పగలంతా మందతో ఉండే అతని కొడుకులు సత్తిరాజు, తాతారావును రాత్రుళ్లు ఇంటికి పంపి.. తనొక్కడే మందకు కాపలాగా ఉంటాడు.
నెత్తిమీద నల్లని ముసుగు కప్పుకొని నెమ్మదిగా అక్కడికొచ్చిన ఆగంతకుడు, అప్పలకొండ గాఢనిద్రలో ఉండటంచూసి ఊపిరి పీల్చుకున్నాడు. నెమ్మదిగా రాటకు కట్టిన దొడ్డుతట్టనిప్పి పక్కకు జరిపి, లోపలికి ప్రవేశించాడు. నిద్రపోతున్న సుమారు రెండొందల గొర్రెలను ఆబగా చూశాడు. గొర్రెపోతుకోసం కళ్లతో గాలిస్తుంటే దొడ్డుతట్ట పక్కనే పడుకున్న బలిసిన తెల్లబొచ్చు గొర్రెపోతు కనిపించింది. వెంటనే దాని ముట్టెను వెంటతెచ్చుకున్న తాడుతో కట్టేసి, కష్టంగా ఎత్తి భుజమ్మీద వేసుకున్నాడు. గాబరాగా అక్కడ్నుంచి బయలుదేరాడు.అతను నాలుగైదు అడుగులు వేశాడో లేదో.. రివ్వున దూసుకొచ్చింది, ముదురు గోధుమరంగు బొచ్చు, వంపులు తిరిగిన పొడవైన కొమ్ములూ కలిగిన గొర్రెపోతు. అది తన కొమ్ములతో బలంగా ఆ ఆగంతకుడిని గుద్దింది.
ఊహించని ఆ సంఘటనకు అతను..
“అమ్మా…” అంటూ బోర్లా పడ్డాడు. లేచి పారిపోవడానికి ప్రయత్నింస్తుండగా వెనక్కి అడుగులేస్తూ వెళ్లిన గొర్రెపోతు, మరింత వేగంగా దూసుకొచ్చి ఇంకా గట్టిగా గుద్దింది.
“సచ్చాన్ర దేవుడా…” అంటూ అతను నేలకు అతుక్కుపోయాడు.
ఆ అలికిడికి మందలోని గొర్రెలన్నీ లేచి.. ‘అంబే…’ అంటూ అరవడం మొదలెట్టాయి.
గాఢనిద్రలో ఉన్న అప్పలకొండ దిగ్గున లేచాడు. ఒక్క క్షణం ఏం జరిగిందో బోధపడలేదు. నక్కలేమన్నా వచ్చాయేమోనని.. ‘ఉయ్…’మని అరుస్తూ, చుట్టూ చూశాడు. అంతలో అతని దృష్టి దొడ్డుతట్ట లోపల మూల్గుతున్న మానవాకారం మీద, అతణ్ని కొమ్ములతో గుద్దుతున్న గొర్రెపోతు మీద పడింది. విషయం అర్థమయింది. పరుగునెళ్లి అతని మీదపడి, వీపుమీద రెండు పిడిగుద్దులు గుద్ది, అతని చేతులను వెనక్కి విరిచి, గొర్రె ముట్టెకు కట్టిన తాడిప్పి అతని చేతులు కట్టేశాడు. ముఖానికి చుట్టుకున్న ముసుగును లాగేశాడు. ఆ మసక వెన్నెలలో అతని మొహం చూసి విస్తుపోయాడు.
“ఓర్ని నువ్వట్రా నూకరాజు… నీకిదేం పోయికాలంరా?” అన్నాడు.
చేతులకు కట్టిన తాడును ఇప్పేశాడు. నూకరాజు, అప్పలకొండ నేస్తాలు. వారిద్దరూ ఇంతకు పూర్వం ఓ మందలో పనిచేసేవారు. నూకరాజు కూతురికి పెళ్లిచేసి బాగా చితికిపోయాడు.
“మాటాడవేటి? దొంగతనం సేయాల్సిన అవుసరమేటొచ్చింద్రా?” గద్దించాడు అప్పలకొండ. నూకరాజు గట్టిగా ఏడ్చేశాడు.
“ఏటి సెప్పమంతవురా? మీ అప్పకు వొంట్లో బాగోనేదు. ఏదో ఆపరేసను సేయాలి, ఇరవైయేలు కర్సవుతదన్నరు. ఎక్కడా అప్పు పుట్టనేదు. నిన్ను అడుగుదామన్నా ఇదివొరుకు దీసుకున్న అప్పే ఇవ్వనేక పోతున్నను. ఇకేం మొహమెట్టుకుని అడగాల?” అన్నాడు.
“అందుకని దొంగతనం సేత్తవా? ఇన్నేల్ల పరువు గంగలో కలిపేసుకుంతవా?” కోప్పడ్డాడు అప్పలకొండ.
“నువ్వు దొంగతనంగా అట్టుకుపోతున్న గొర్రెపోతు ఎవురిదో తెలిసా? పందల్నాయుడిది! దాన్నువు అట్టుకుపోయుంటే, ఆడు నా పేనం దీసేసును” అన్నాడు భయంగా.
“సెమించరా! అది పందల్నాయుడిదని తెల్దు. ఆడో రాచ్చిసుడు! నానట్టుకుపోయి అమ్మేసుకునుంతే నిజంగనే నీ పేనాలు దీసేసేవోడు” అన్నాడు నూకరాజు తలొంచుకుని.
“మా బీముడు నిన్నడ్డుకుని నన్ను రచ్చించింది” అంటూ.. ‘భీముడు’ అని ముద్దుగా పిల్చుకునే గొర్రెపోతును ప్రేమగా నిమిరాడు.
“ఒరే… మా అప్పకు బాగోనేదంతే సాయం సేయనా? కట్టంలో ఉన్నోడికి సాయం సేయకపోతే, మడిసిగా బతికేటి నాబం? నిన్ననే ఐదు గొర్రెల్ని అమ్మినాను. పొద్దున్న ఇంటికెల్లు. సత్తిరాజుకు పోన్జేసి సెప్తను. డబ్బిత్తడు. మా అప్పకు వొయిద్యం సేయించు. ఇక్కడ జెరిగింది నాను ఓరికీ సెప్పన్లే!” అన్నాడు.
అప్పలకొండ కాళ్లపై పడి ఏడ్చేశాడు నూకరాజు. అక్కడ్నుంచి బయలుదేరి చీకట్లో కలిసిపోయాడు.
సూర్యుడు అస్తమించాడు. రోజంతా కొన్ని మైళ్లు తిరిగి, మేతమేసి, శారదానదిలో నీళ్లుతాగి, తిరుగు ప్రయాణమయింది గొర్రెలమంద. అప్పలకొండ భుజమ్మీదున్న దోటును ఓ చెత్తో పట్టుకుని నడుస్తున్నాడు. అతని కొడుకులు సత్తిరాజు, తాతారావు మంద వెనుక నడుస్తున్నారు.
అప్పలకొండ హుషారుగా ఉన్నాడు. ఏదో కూనిరాగం తీస్తూ నడుస్తున్నాడు. ఒక్కప్పుడు బతుకుమీద బెంగ ఉండేది. అదిప్పుడు లేదు. అందుకు అతని భార్యా మాలక్ష్మి కారణం! అతను ఎదిగొచ్చిన కొడుకులను ఏదన్నా పనిలో పెట్టాలని చూస్తుంటే మాలక్ష్మి అడ్డుచెప్పింది.
‘నీలాగే ఆల్లు కూలిపని సేయడం నాకిస్టంనేదు. ఎంతకాలమని ఒకరికింద పని సేస్తం. ఇకనుంచి మన కాల్లమీద మనం బతుకుదం. సొంతంగా గొర్రెలను కొని మేపుదం’ అంది.
‘నీకేటి మతిగాని పోయిందేటే, గొర్రెలను కొనాలంతే మాట్లా? ఆటికి బోలెడు డొబ్బుండాలి. ఎక్కడ్నుంచి తెత్తం? ఎవడిత్తడు?’ అన్నాడు అప్పలకొండ.
మాలక్ష్మి పసుపుకొమ్ము మెళ్లో వేసుకుని పుస్తెలు, చెవిదిద్దులు తీసి భర్త చేతిలో పెట్టింది.
‘ఇయ్యి తులంన్నరకి ఎక్కువే ఉంతయి. అమ్మేసి, ఎన్ని గొర్లొత్తయో అన్ని గొర్లు కొనుక్కొని రా’ అంది. అప్పలకొండ మారుమాట్లాడలేదు. బంగారం అమ్మి, తాళ్లపాలెం సంతలో పది ఆడగొర్రెలు, ఒక విత్తనం గొర్రెపోతును కొన్నాడు. గొర్రెపోతుకు ‘భీముడు’ అని పేరు పెట్టుకున్నాడు. గొర్రెలే లోకంగా జీవించాడు. వాటి మేతకు లోటు రానిచ్చేవాడు కాదు. గొర్రెలకు వచ్చే చిటుకు వ్యాధి, గాలికుంటు వ్యాధి, నట్టల వ్యాధి వంటిరోగాలకు పశువైద్యుని సలహాతో టీకాలు, మందులు సకాలంలో వేస్తూ జాగ్రత్త పడేవాడు. దాంతో సంవత్సరం తిరిగే సరికి పది ఆడగొర్రెలు రెండింతలయ్యాయి. ఐదేళ్లలో అటూఇటూగా రెండొందలయ్యాయి. మంద పెరిగాక మాలక్ష్మికి పుస్తెలూ, చెవిదిద్దులూ చేయించాడు. పెంకుటింటిని డాబా ఇల్లుగా మార్చాడు. ఇద్దరు కొడుకులకు గత యేడాది పెళ్లిళ్లు చేశాడు. అప్పులుచేసే స్థాయినుంచి, అప్పులిచ్చే స్థాయికి చేరుకున్నాడు. దీనంతటికీ తన భీముడే కారణమని, అదేసిన విత్తనాల వల్లే తన మంద ఇంతలా పెరిగిందని రోజులో ఎన్నోసార్లు అనుకుంటాడు. అదంటే ప్రాణం పెడతాడు. దాన్ని ప్రేమగా చూసుకుంటాడు.
మంద పెట్టిన మడిలోకి గొర్రెలు చేరుకున్నాయి. సత్తిరాజు, తాతారావు మందను దొడ్డుతట్టల్లోకి పంపించారు. అంతలో ‘టప్…’ మన్న శబ్దం వినిపించడంతో విశ్రాంతిగా కొల్లమ్మీద కూర్చున్న అప్పలకొండ, మందలోకి పరుగు తీశాడు. భీముడు, పందల్నాయుడి మొక్కుబడి గొర్రెపోతు పోట్లాడుకుంటున్నాయి. ‘తిత్తయ్…’ అంటూ వాటిని చెరోవైపు తరిమేశాడు.
“ఓరయ్య… పందల్నాయుడి బుద్దులే దీనికీ వొచ్చేసినట్టున్నయి. మాటిమాటికి బీముడితో కయ్యానికి కాలుదువ్వుతుంది” అన్నాడు సత్తిరాజు గొర్రెపెయ్యకు పాలు తాగిస్తూ.
“అదే గదరా నా బయం. దీనికేటన్నా అయితే ఆ పందల్నాయుడు ఊరుకోడు. ఆడి మొక్కు మన సావుకొచ్చేటట్టుంది” అన్నాడు అప్పలకొండ.
పందల్నాయుడు ఆ ఊరి మోతుబరి రైతు! మాజీ సర్పంచ్! సర్పంచ్‌గా ఉన్నప్పుడు అహంకారంతో విర్రవీగేవాడు. తానో రాజుగానూ, ప్రజలను సేవకులుగానూ భావించేవాడు. దాంతో గత ఎన్నికల్లో అతణ్ని చిత్తుచిత్తుగా ఓడించారు. అప్పట్నుంచి ఊరివాళ్లపై శత్రుత్వం పెంచుకున్నాడు. తన విషయంలో ఎవరే చిన్న తప్పుచేసినా వారి పట్ల కఠినంగా ప్రవర్తిస్తుంటాడు. ఊర్లోవాళ్లకి అతనంటే హడల్! అతని జోలికి వెళ్లడానికి భయపడతారు.
పందల్నాయుడి పొలాన్ని ఆనుకుని సత్తెమ్మతల్లి గుడి ఉంది. ఆ అమ్మవారికి యేటేటా పండుగ చేసి, గొర్రెపోతును బలిస్తుంటాడు. అందుకు ముందుగానే గొర్రెపోతును కొనేస్తాడు. అలా తొమ్మిదినెలల క్రితం అప్పలకొండ దగ్గర ఆరునెలల వయసున్న గొర్రెపోతును కొని, దాన్ని సత్తెమ్మతల్లికి మొక్కుకున్నాడు.
‘వొచ్చే పండగ వొరుకూ దీన్ని నీ మందలోనే ఉంచి బాగ మేపు. మందలో ఎదిగిన గొర్రుపోతు మాంసం మా రుసిగ ఉంటది. నీ కట్టం ఉంచుకోన్లే’ అన్నాడు. మేపనంటే తనపై కక్షపెట్టుకుంటాడని సరేనన్నాడు అప్పలకొండ.
ఉదయం ఎనిమిదింటికే ఎండ చురచురలాడుతోంది. గొర్రెలమంద మడిలో నిల్చుని నెమరువేస్తున్నాయి. అప్పలకొండ భీముడికి ఉలవలు తినిపించి గంజి తాగిస్తున్నాడు.
“ఒరే బీముడు… నువ్వు నా పేనానివిరా! నా ఇంటి సిరివి! నువ్వేసిన ఇత్తనాల వొల్లే కూలోడిగున్న నాను ఇంత పెద్దమందకు యజిమాని నయినాను. నా పేనం ఉండగ నీకేనోటూ రానీను” అన్నాడు దాన్ని లాలనగా దువ్వుతూ..
అప్పుడే అక్కడికొచ్చిన పందల్నాయుడు..
“నీ ఇత్తనం పోతును బాగానే మేపుతున్నవు. నా పోతును ఇగర బెట్టేతున్నవు. దీనికేగాని నా గొర్రెకు ఎట్టావేట్రా గెంజి? అవున్లే.. గొర్రె బలిత్తే గొల్లకే నాబం. నా గొర్రె బలిత్తే నీకేటి నాబం?” వెటకారంగా అన్నాడు. భయంగా పందల్నాయుడ్ని చూశాడు అప్పలకొండ.
“అలా అనీకండి బాబు. దానికీ ఎడుతున్నను. తమరి పోతు.. అదిగో ఆడగొర్రెలతో సరసాలాడుతోంది. ఎట్టకపోతే అదలాగ ఎదుగుతాదా బాబు?” చెయ్యి చూపిస్తూ అన్నాడు.
తెల్లని రంగులో నిగనిగలాడుతున్న తన గొర్రెపోతును చూసి మీసం మెలేస్తూ..
“వొచ్చే ఆదోరం పండగ సేత్తన్నను. ముందురోజు నా మడిసులొత్తరు. ఆల్లకి దాన్నిచ్చి అంపు. అది సరేగనీ, సత్తెమ్మతల్లి గుడి పక్కనున్న నా మడిలో మందెట్టమని ఎపుడనగ సెప్పినాను? నా మాటంటే నెక్కనేదేట్రా?” కోపంగా అన్నాడు పందల్నాయుడు.
“అలాగేం నేదు బాబు. ఎల్లుండితో ఈ మడి అయిపోద్ది. తర్వాత తమరి మడిలోనే ఎడతను”
“సరే… మాట తప్పితే నానేటో సూపిత్తను. నా గొర్రుపోతు జేగర్తరోయ్!” అంటూ వచ్చినంత వేగంగానే వెళ్లిపోయాడు పందల్నాయుడు.
అప్పలకొండ ఊపిరి పీల్చుకున్నాడు. అతనికి పందల్నాయుడంటే భయం! తోడేళ్లకు దూరంగా గొర్రెలుండాల, బలిసినోడికి దూరంగా బలహీనుండాల! అనుకునే మనస్తత్వం అతనిది.
సత్తిరాజు, తాతారావు.. తాటికమ్మ చీరి, అందులో చద్దన్నం వేసుకుని తండ్రితో కలిసి తింటున్నారు. అప్పుడడిగాడు సత్తిరాజు..
“ఒరే అయ్య! రేతిరేల ఒంటిగా మందతో ఉంటానికి బయపడవుగానీ, ఆ పందల్నాయుడ్ని సూత్తే అట్టా బయపడి పోతవేటి?” అని.
“అదో పెద్దకతరా… సేన్నాల్ల కితం నాను దేవుడయ్య మందలో పని సేత్తున్నప్పుడు ఒక తూరి ఆ పందల్నాయుడు మడిలోకి మందెల్లిపోయి, ఆడి పెసరసేనును కూసింత తిన్నయి. అంతే అగ్గిమీద గుగ్గిలమై పోనడు. తొప్పైపోయింది తొప్పు కడతామన్నా ఊరుకోనేదు. మమ్మల్ని సెట్టుక్కట్టేసి కర్రలతో బాదేసినడు. ఓ నాలుగు గొర్రుపోతులను తొప్పుకింద జమేసుకున్నడు. ఆయాల్నుంచి దయాదర్మంనేని ఆడంటే బయం. ఆడికి దూరంగుందామన్న.. తుమ్మబంకనాగ వదల్డంనేదు” చెప్పాడు అప్పలకొండ.
అది వినగానే సత్తిరాజు, తాతారావు కూడా భయపడ్డారు.
ఆ మరునాడే సత్తెమ్మతల్లి పండుగ. అమ్మవారి గుడిముందు పందల్నాయుడి పనివాళ్లు పందిరేస్తున్నారు. ఆ గుడి పక్కనున్న మడిలోనే మందపెట్టాడు అప్పలకొండ. ఆ రోజు మొక్కుబడి గొర్రెపోతును, పందల్నాయుడి మనుషులొచ్చి తీసుకుపోతారు. దాంతో నెత్తిమీదున్న పెద్దభారం దిగిపోతుందన్న ఆలోచన, అప్పలకొండలో హుషారు పుట్టిస్తోంది.
అంతలో ‘టప్’ మన్న శబ్దం వినిపించింది.
చిరపరిచితమైన ఆ శబ్దం వినగానే, రాగమాపి కంగారుగా చూశాడు. భీముడూ, మొక్కుబడి గొర్రెపోతూ కొమ్ములతో ఒకదాన్నొకటి గుద్దుకుంటున్నాయి. అప్పలకొండ గాబరాగా చేతిలోని గొర్రెకొదంను కిందన పెట్టి ‘తిత్తయ్…’ అంటూ పరుగుపెట్టాడు. అప్పటికే అవి వెనక్కెళ్లి, చాలా వేగంగా దూసుకొచ్చి మళ్లా బలంగా గుద్దుకున్నాయి. ఆ మరుక్షణమే మొక్కుబడి గొర్రెపోతు, మెడ విరిగి కుప్పకూలిపోయింది. అది చూసి గుండాగినంత పనైంది అప్పలకొండకి. గాబరాగా పడిపోయిన గొర్రెపోతును లేవదీశాడు. మెడ వాల్చేసింది. చచ్చిపోయిందని అర్థమవ్వగానే అతనికి ఒళ్లంతా చెమటలు పట్టేశాయి.
“ఎంత పన్జేసినవురా బీముడు. సత్తెమ్మతల్లికి మొక్కుకున్న గొర్రుపోతును సంపేసినవు. ఈ ఇసయం ఆ తోడేలుకు తెలిత్తే ఇంకెటన్న ఉందా? నీ పేనాలు, నా పేనాలు తోడేత్తడు” అంటూ భీముణ్ని పట్టుకుని ఏడ్చేశాడు.
ఏం చేయాలో అర్థంగాక, కొడుకులను కేకేశాడు. వారు కంగారుగా వచ్చారు. చచ్చిపడున్న గొర్రెపోతును చూడగానే, రాబోయే ప్రళయాన్ని తల్చుకుని భయంతో బిగుసుకుపోయారు.
కాసేపటికి ఈ వార్త పందల్నాయుడికి తెలిసింది. అంతే.. నాగుపాములా బుసకొట్టాడు. ఇద్దరు మనుషులను వెంటేసుకుని వచ్చాడు. చచ్చిపడి ఉన్న తన గొర్రెపోతును చూసి పళ్లు పటపటా నూరాడు. వెంట వచ్చినవారు.. పండుగ ముందురోజు చావడం అపశకునం అన్నారు. ఏదో అరిష్టం జరగబోతోందన్నారు. వారి మాటలు పందల్నాయుడికి ఒక్కింత భయాన్ని, మరింత కోపాన్ని తెచ్చాయి. కళ్లెర్రజేసి అప్పలకొండను ఎగిరి కాలితో తన్నాడు. అతను కింద పడబోతుంటే సత్తిరాజు పట్టుకుని..
“ఏటండి మీ దవుర్జన్యం? తొప్పునేకుండ మా అయ్యను తన్నడమేటి?” అన్నాడు ధైర్యం కూడగట్టుకుని.
“ఏట్రా కుర్రకుంక.. నోరులేత్తుంది. మీ అబ్బాకొడుకులు కలిసి నా గొర్రుపోతును సంపేత్తే నాను సూత్తు ఊరుకోవాల” అంటూ సత్తిరాజును దవడమీద చాచి కొట్టాడు.
పందల్నాయుడి కాళ్లమీద అప్పలకొండ పడి..
“అయ్యా… ఆడ్ని కొట్టకండి. మా బీముడు, తమరి గొర్రుపోతు పోట్లాడుకున్నయి. ఆ పోట్లాటలో మెడగుండు ఇరిగి సచ్చిపోనది” అన్నాడు వణికిపోతూ.
“అంటే! ఎప్పటిదో పగెట్టుకుని నీ బీముడితో నా గొర్రుపోతు మెడగుండు ఇరిసేసినవన్నమాట. పండగ ముందురోజు గొర్రెపోతు సచ్చిపోతే, ఊరంతా ఏటనుకుంటదిరా? నానేదో సత్తెమ్మతల్లికి అపసారం సేసానని, అందుకే ఇలా జెరిగిందని సెవులు కొరుక్కోదు. బలేగ జెరిగిందని సంకలు గుద్దుకోదు… నా కొడక, ఊర్లో నా పరువు తీత్తవా?” అంటూ అప్పలకొండ జుట్టు పట్టుకున్నాడు.
అది చూసిన భీముడు వెనక్కెళ్లి, ముందుకు దూసుకొచ్చి పందల్నాయుడ్ని కొమ్ములతో గుద్దబోతుంటే తాతారావు దాన్ని ఆపాడు.
“సూసినావురా నీ టైనింగు. నీ పోతు, నా పోతును సంపీడమే గాకుండా నన్నే పొడిసీ బోయింది. దీన్ని నాను బతకనీను. రేపు దీన్ని సత్తెమ్మతల్లికి బలిచ్చేస్తను” అన్నాడు కోపంగా.
భీముడి నడుం పట్టుకుని ఎత్తి గుడివైపు తిరిగి..
“అమ్మా… సత్తెమ్మతల్లి. నానేదన్న అపసారం సేస్తే నా తప్పుకాయి. ఇదిగో ఈ గొర్రెను నీకు బలిత్తను. నీ పండగను ఏ ఆటంకం నేకుండ జెరిపించుకుని, మమ్మల్ని సల్లగ సూడు” అని మొక్కున్నాడు పందల్నాయుడు. అతనలా మొక్కడం చూసి అప్పలకొండకు గుండాగినంత పనైంది. పందల్నాయుడి కాళ్లను చుట్టేసి..
“బాబుగోరు… తప్పైపోనది సెమించండి. అది మా ఇంటి దైవం! అది నేకుండ నాను బతకనేను. కావొలిస్తే ఎంతైన తొప్పేయండి. కడతాను. మీకు పున్నెముంటది, నా బీముడ్ని ఒగ్గీయండి” అంటూ ఏడ్చేశాడు.
“నాను మొక్కీసుకున్నను. నువ్వు సచ్చిగింజుకున్నా దీన్ని అమ్మోరికి బలిచ్చే తీరుతాను” అంటూ భీముడి మెడలో తాడు కట్టి బలవంతంగా ఈడ్చుకుపోయాడు. అప్పలకొండ ఏడ్చి మొత్తుకున్నా, సత్తిరాజు, తాతారావు బతిమాలుకున్నా ప్రయోజనం లేకపోయింది.
పందల్నాయుడి ఇంటి దగ్గరనుంచి గుడివైపు ఊరేగింపు సాగుతోంది. డప్పులు, డోలు మోత మారుమ్రోగుతోంది. పందల్నాయుడి భార్య అమ్మవారి ఘటం మోస్తోంది. ఆమె పక్కన జోడు కోళ్ల కావిడిని భుజమ్మీద మోస్తూ పందల్నాయుడు నడుస్తున్నాడు. బారికాడు ఓ చేతిలో కత్తి, మరో చేత్తో భీముడి మెడక్కట్టిన తాడును పట్టుకుని దాన్ని లాగుతూ కదులుతున్నాడు. ఇద్దరు ముగ్గురు స్త్రీలు జుట్టు విరబోసుకుని వేపకొమ్మలు పట్టుకుని ఊగిపోతున్నారు. భీముడి కాళ్లకు, ముఖానికి పసుపు పూసి, నుదుటి మీద పెద్ద బొట్టుపెట్టి, మెడలో వేపాకులు, పూలు వేలాడదీశారు. అది బేలగా, భారంగా అడుగులేస్తోంది. కాసేపటికి ఊరేగింపు సత్తెమ్మతల్లి గుడిని చేరింది. అమ్మవారి విగ్రహం ముందు ఘటం దించి, పూజ చేసి, ఉపారం పెట్టారు. పందల్నాయుడు భీముడికి గుగ్గులం పొగవేసి, దాని ముందర కాళ్లు పైకెత్తి పట్టుకొని అమ్మవారికి మొక్కుకున్నాడు. బారికాణ్ని పిల్చి..
“ఒక్క ఏటుతో తల, మొండం ఏరైపోవాల. నేకపోతే నానూరుకోన్రోయ్” అంటూ హెచ్చరించాడు. బారికాడు భయపడ్డాడు. ఎందుకొచ్చిన గొడవని బండరాయి మీద కత్తిని నూరే పనిలో పడ్డాడు. పందల్నాయుడి అనుచరులు బాణసంచా కాలుస్తూ హడావుడి చేస్తున్నారు.
అక్కడికి కూసింత దూరంలో దొడ్డుతట్టల బయట, గొర్రెలమంద నిల్చుని నిల్చుని కాళ్లుపీకి పడుకున్నాయి. అప్పటికి పదిన్నరైనా.. మందను మేతకు తీస్కెళ్లలేదు. గొర్రెల పక్కన దిగాలుగా కూర్చున్నారు తండ్రీకొడుకులు. వారు భీముడులేని మందను ఊహించుకోలేక పోతున్నారు. పందల్నాయుడ్ని ఎదించాలని ఉన్నా.. అతనితో పెట్టుకుంటే ఏమవుతుందోనన్న భయం వారిని బలహీనుల్ని చేస్తోంది. అప్పలకొండ భీముడ్ని రక్షించడం కోసం గత రాత్రి చాలా ప్రయత్నాలు చేశాడు. ఊరి పెద్ద మనుషులచేత పందల్నాయుడికి చెప్పించినా ప్రయోజనం లేకపోయింది.
అప్పలకొండ కళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. అతని మనసులో ఆలోచనలు సుళ్లు తిరుగుతున్నాయి.
‘ఒక జీవిని బలిత్తానని మొక్కుకునే అక్కు మడిసికుందా? నిజంగా ఆ బలిని అమ్మోరు కోరుకుంతదా? తను సుస్టించిన జీవులును తనకే బలివ్వమని కోరుకోడమేటి? ఏ అమ్మోరూ అట్టాగ కోరుకోదు.
మడిసే తన బూతం
దీర్చుకోడనికి ఇట్టాంటి మొక్కు ఎట్టుంటడు’ అనుకున్నాడు.
‘నా బీముడు అట్టాంటి మొక్కుకు బలైపోతున్నడు. దాన్ని రచ్చించుకోనేని సేతకానోడ్ని అయిపోన్ను. దాని సావును నాను సూల్లేను. దానికంటే ముందుగ నానే సస్తను’ అనుకుంటూ మట్టిబెడ్డల కింద దాచిన పురుగులమందు సీసాను తీశాడు.
డప్పుల మోత ఆగింది. బారికాడు నూరడం ఆపి, కత్తిపదును చూసుకుంటున్నాడు. జరుగుతున్న తంతు బోధపడిందేమో.. భీముడు మెడతిప్పి దూరాన కనిపిస్తున్న అప్పలకొండను, మందను దీనంగా చూసింది. ‘అంబే…’ అంటూ రెండుమూడుసార్లు గట్టిగా అరిచింది. ఆ అరుపులో ఏ అర్థముందోగానీ, మందలో ఓ గొర్రె ‘అంబే…’ అంటూ అరుస్తూ పరుగుతీసింది. మిగిలిన గొర్రెలు కూడా అరుస్తూ దాన్ని అనుసరించాయి. గొర్రెలమంద ఒక్కసారిగా భీముణ్ని చుట్టుముట్టేసింది. ‘అంబే…’ అనే గొర్రెల అరుపులతో ఆ ప్రాంతం మారుమ్రోగిపోతోంది.
పందల్నాయుడు కంగారు పడిపోయాడు. మందను పక్కకు తోలమని అప్పలకొండను కేకేశాడు. గొర్రెలన్నీ భీముడి చుట్టూ రక్షణగా నిల్చోవడం చూసి ఆశ్చర్యపోయాడు అప్పలకొండ. మందలో ఓ గొర్రెకు కష్టంవస్తే మిగతా గొర్రెల ఐక్యత చూశాక.. అతనిలోని భయం ఎగిరిపోయి తెగింపొచ్చింది. చేతిలోని పురుగులమందు సీసాను నేలకేసి కొట్టాడు. కోపంగా దోటు అందుకుని, దాని చివర్న కట్టి ఉన్న గొల్లకత్తి జారు చూసుకున్నాడు. పరుగులాంటి నడకతో వెళ్లి, భీముడి పక్కన నిల్చున్నాడు.
“తొత్తుకొడక… ఏట్రా అట్టా నిల్చున్నవు? మందను బేగ పక్కకు తోలు. నేకపోతే మందనంతట్ని సత్తెమ్మతల్లికి బలిచ్చేత్తను” అన్నాడు పందల్నాయుడు ఉగ్రంగా.
“తమరు మందను బలిచ్చేత్తే.. నాను తమరిని బలిచ్చేత్తను. సెల్లుకు సెల్లయిపోతది” అంటూ అప్పలకొండ దోటు చివర్న ఉన్న కత్తిని చూపిస్తూ..
“గొర్రెలకు ఇస్టమైన రాగి, గండ్ర, సీమసింత రొడ్డలనే కాదు, ఈ కత్తి మెడలను గూడ తెగ్గొత్తది” ఆవేశంగా అని, తనకు కాస్త దూరంలో ఉన్న పందల్నాయుడి మెడమీద పెట్టబోయాడు.
అప్పలకొండ భార్య మాలక్ష్మి పరుగు పరుగునొచ్చింది. భర్త చేతిలోని దోటును లాక్కుంది.
“ఏంటయ్య నీ ఆవేసం? మనం మడుసులం. రాచ్చసులం కాదు, ఒకనొకరు సంపుకోడానికి!” అంటూ భర్తపై కస్సుమంది. పందల్నాయుడివైపు తిరిగి..
“నా పెనిమిటికి బీముడంతే సచ్చేంత పేమ బాబు! తమరు బీముడ్ని బలిచ్చిడానికి దీసుకుపోగనే, దానిమీద బెంగెట్టుకుని సచ్చిపోడానికి పురుగులుమందు కొన్నడంట. కొట్టులో పనిసేసే కుర్రోడు సెప్పగానే నాను పరుగునొచ్చినను. బాబుగోరు.. మా బీముడ్ని ఇడిసియండి. అది నేకపోతే నా పెనిమిటి బతకనేడు. మీ మొక్కుకోసం నా పుస్తెలు తెంపీకండి” అంటూ దీనంగా వేడుకుంది.
పందల్నాయుడు వెటకారంగా నవ్వాడు.
“ఎలక ఎంతేడిసినా పిల్లి తన పట్టు వొదులుతాదేటి? నీ మొగుడు ఉంతే ఏటి? సత్తే ఏటి? బీముడ్ని బలిచ్చేసి నా మొక్కు దీర్సుకుంతను! మరియాదగ మందను పక్కకు తోలండి” అన్నాడు కర్కశంగా.
“సూసినవా మాలచ్చిమి, బలిసినోడి మదం! ఈగ పుండును కోరితే, నక్క పీనుగును కోరతాదంట. ఈడి బుద్దిగూడ అట్టాంటిదే. ఇట్టాంటోడు బతగ్గూడదు” అంటూ భార్యచేతిలోని దోటును లాక్కున్నాడు అప్పలకొండ.
అంతలో గుడిముందు పోలీస్ జీప్ ఆగింది. దానిలోంచి ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లు, నూకరాజు దిగారు. నూకరాజు అప్పలకొండ దగ్గరకెళ్లి..
“ఆవేసపడకరా… నీలాటి మంచోడికంతా మంచే జెరుగుతుంది. రేత్రి నీ బాద సూడనేకపోన్ను. అందుకే పోలిసులను దీసుకొచ్చినను. ఇక నీ బీముడికేం గాదులే” అన్నాడు భరోసాగా.
పందల్నాయుడు ఇన్స్పెక్టర్ను చూడగానే గతుక్కుమన్నాడు. ఎదురెళ్లి..
“ఏంటి సారు… ఇలాగొచ్చేసరు?” అని అడిగాడు.
“మీరిక్కడ జంతుబలి ఇస్తున్నారని కంప్లయింట్ వస్తే రావల్సొచ్చింది. గుడి ప్రాంగణంలోనూ, బహిరంగ ప్రదేశాలలోనూ జంతుబలి ఇవ్వడం చట్టరీత్యా నేరం! ఇందుకు వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసి, జైల్లో పెట్టొచ్చు. ఈ సంగతి మీకు తెలీదా?” అడిగాడు ఇన్స్పెక్టర్.
పందల్నాయుడు భయపడ్డాడు. జైలుకెళ్తే ఊర్లో వాళ్లముందు చులకనైపోతానని కంగారుపడ్డాడు. నీళ్లు నములుతూ..
“తెలుస్ను సారు. అయినా ఇక్కడ జెంతుబలి జెరగడం నేదే!” అంటూ తన అనుచరులకు సైగ చేశాడు. ఆ మరుక్షణం, వాళ్లు చాటుగా భీముడి మెడలోని వేపాకులు, పూలు తీసేసి తాడు ఇప్పేశారు. పసుపు దులిపేసి, నొసటికున్న బొట్టు చెరిపేశారు. బారికాడు కత్తి దాచేశాడు.
“ఒరే అప్పలకొండ… నువ్వు సాచ్చికం సెప్పరా! ఇక్కడ జెంతుబలి జెరుగుతుందా?” అంటూ లేదని చెప్పమని చాటుగా దండం పెట్టాడు పందల్నాయుడు. అప్పలకొండ అయోమయంగా చూస్తూ తల అడ్డంగా ఊపాడు.
“ఈపక్క మడి నాదే సారు. అందులో ఈడు మందెట్టాడు. ఇప్పుడు మందను మేతకు దీస్కెల్తున్నడు” అని ఆగి..
“అంతే గదరా… బేగ బీముడ్ని, మందను తోల్రా. నేకపోతే సారు తొప్పుగ అరదం సేసుకుంతరు” అన్నాడు.
భీముడికి ప్రాణగండం తప్పినందుకు అప్పలకొండ మురిసిపోతూ, మందను అక్కడనుంచి తోలాడు. పందల్నాయుడు ఊపిరి పీల్చుకుని..
“ఈ నూకరాజు తాగిన మైకంలో పిర్యాదు సేసినట్టున్నడు సారు. ఈసారికి ఆడ్ని సెమించీయండి” అన్నాడు.
ఇన్స్పెక్టర్ జీపెక్కి, పందల్నాయుడ్ని దగ్గరికి పిల్చాడు.
“మాజీ సర్పంచ్‌గా మీపై నాకున్న గౌరవాన్ని నిలుపుకొండి. అమ్మవారికి గొర్రెను బలిస్తానని మొక్కుకోవడం కాదు, సాటిమనిషిని మనిషిగా చూస్తానని మొక్కుకొండి. అందరికీ ప్రేమను పంచుతానని మొక్కుకొండి. ఆ మొక్కు తీర్చడానికి రోజూ ప్రయత్నించండి. దాని రిజల్ట్ వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో మీకే తెలుస్తుంది” అన్నాడు.
జీప్ ఓ పక్క, గొర్రెలమంద మరోపక్క గోర్జిలో దుమ్మురేపుకొంటూ ముందుకు సాగిపోతున్నాయి. పందల్నాయుడు మొహం వేలాడేసుకుని, ఆలోచించడం మొదలుపెట్టాడు.
అప్పలకొండ తన ముందు నడుస్తున్న భీముడివైపు ఆప్యాయంగా చూస్తూ..
‘సత్తెమ్మతల్లి నా గోడు ఇన్నాది. ఆ తల్లికి పప్పన్నంతో ఉపారం ఎడతను’ అని మొక్కుకున్నాడు.
గుళ్లో, సత్తెమ్మతల్లి ముఖంలో ప్రశాంతత, సంతృప్తి దర్శనమిస్తోంది.
బొడ్డేడ బలరామస్వామి
బొడ్డేడ బలరామస్వామి
89197 07141