ట్రాన్స్ఫర్ షెడ్యూల్ రాగానే, ఆన్లైన్లో ‘యూపీఎస్ కొండాపూర్’ మొదటి ఆప్షన్ పెట్టుకుంటే.. తెలిసిన వాళ్లందరూ వద్దన్నారు. కారణాలు అడిగితే ఒక్కో మిత్రుడు ఒక్కో సమస్య గురించి చెప్పాడు. అందరి సారాంశం ఏమిటంటే, ఆ పాఠశాల గంగెద్దుల కాలనీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసింది. గంగెద్దుల వాళ్ల పిల్లలు తప్ప వేరే పిల్లలు ఉండరు. వాళ్లంతా చాలా వెనుకబడి ఉంటారు. తల్లిదండ్రులకు చదువు పట్ల ఏమాత్రం ఆసక్తి, అవగాహన ఉండదు. విద్యార్థులకు క్రమశిక్షణ బొత్తిగా తెలియదు. విపరీతమైన అల్లరి. తల్లిదండ్రులు సంవత్సరంలో సగం రోజులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం వల్ల, పిల్లలూ బడికి సరిగా రారు. బడి బడిలాగా ఉండదు. బంజరుదొడ్డిలాగా ఉంటుంది.ఇలా అందరూ ప్రతికూలమైన విషయాలే చెప్పారు.
కానీ, నా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంలో అననుకూలంగా ఉన్న పరిస్థితులను ఎదుర్కోవడం నాకు కొత్తేం కాదు. ప్రజలతో సంబంధాలు పెంచుకొని, విద్యార్థుల సంఖ్యను పెంచడంతోపాటు విద్యా నైపుణ్యాల పెంపుదలలో గుణాత్మకమైన మార్పులు తేగలిగాను. గ్రామీణ ప్రాంతాలలో పేరుకుపోయిన మూఢ విశ్వాసాలలో కొన్నిటిని మార్చగలిగాను. నా సేవలకు గుర్తింపుగా రాష్ట్ర, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులనూ తీసుకున్నాను. ఊహించినట్లుగానే కొండాపూర్‌కు బదిలీ అయి ఉత్తర్వులు తీసుకొని పాఠశాలలో జాయిన్ కావడానికి వెళ్లాను. నన్ను చూడగానే పిల్లలు..“కొత్త సారచ్చిండు” అంటూ కేకలు వేస్తూ, ఒక బెంచీ మీదినుంచి మరొక బెంచీ పైకి దుంకసాగారు.పిల్లలు ఇంత అదుపుతప్పి ఉండటం చూసిన మొదటి అనుభవమే నన్ను బెంబేలెత్తించింది.
“చదువు కంటే ముందు వీళ్లలో క్రమశిక్షణ నేర్పాలి” అని స్టాఫ్ మీటింగులో అంటే..“వీళ్ల జీవితాల్లోనే క్రమశిక్షణ లేదు సర్! వీళ్లు అంతే.. వీళ్ల తల్లిదండ్రులూ అంతే! ముందుముందు మీకే తెలుస్తుంది” అంది నా తరువాత సీనియరైన రమ్య మేడం.“లేదమ్మా! ప్రయత్నం చేద్దాం. దేనినైనా పాజిటివ్‌గా ఆలోచిస్తే పరిష్కారం దొరక్కపోదు”..నా మాటలకు ముసిముసి నవ్వులు నవ్విన ఆ టీచర్ మనోగతం నాకర్థం కాలేదు.
ముందుగా విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచాలన్న సంకల్పంతో బడివేళల తరువాత టీచర్లతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రైవేట్‌కు వెళ్లే పిల్లల్ని మా స్కూలులో చేర్పించమని అడిగితే.. అందరిదీ ఒకటే మాట.“గంగెద్దుల వాళ్ల పిల్లలతో కలిసి చదువుకుంటే ఆ జంగ్లీ లెక్కలు మా పిల్లలకు కూడా అలవాటవుతాయి. మేం అసలే పంపం”.నాకు ఆశ్చర్యం వేసింది. ఇది కూడా సమాజం వాళ్లపట్ల చూపిస్తున్న ఒక వివక్షనే. పాఠశాల అంటే ఏ ఆధిపత్యాలు, అంతరాలకు చోటులేని ఒక విజ్ఞాన, వికాస కేంద్రంగా ఉండాలి. ఈ పరిస్థితిలో మార్పు తేవాలంటే వారి సాంస్కృతిక మూలాలను అధ్యయనం చేయాలని నిశ్చయించుకున్నాను.
పాఠశాలకు సరిగా రాని విద్యార్థులను కలవడానికి వాళ్ల కాలనీలోకి వెళ్తే, వాళ్ల జీవన విధానాన్ని అంచనా వేయొచ్చని అనుకున్నాను. అక్కడికెళ్లి చూస్తే.. ఇండ్లన్నీ ఇందిరమ్మ పథకం కింద కట్టించినవి. దాదాపు శిథిలావస్థలో ఉన్నాయి. ఏ ఇంట్లోనూ తల్లిదండ్రులు లేరు. ప్రతి ఇంట్లోనూ ముసలివాళ్లు, పెండ్లికాని ఆడపిల్లలు, రెండు మూడేళ్ల వయసు పిల్లలు మాత్రమే ఉన్నారు.ఆడపిల్లలకు సాధారణంగా పన్నెండేళ్లు ఆపై వయసులోపే పెళ్లిళ్లు చేస్తారు. గంగెద్దులాడిస్తూ, బిచ్చమెత్తుకుంటూ కొందరు జీవిస్తే ఇంకొందరు వ్యవసాయంతోపాటు చిన్నచిన్న వ్యాపారాలు చేస్తారు.
పిల్లలు రోజూ బడికి పోతున్నారా? చదువుతున్నారా లేదా? వాళ్లకు కావలసిన పుస్తకాలు, నోట్‌బుక్కులు ఉన్నాయా? ఇలాంటి విషయాలేవీ వాళ్లకు పట్టవు. తోబుట్టువులను చూసుకోవడానికి ఎక్కువమంది పిల్లలు ఇంటి వద్దే ఉంటారు. పదేండ్ల వయసున్న మగపిల్లలు చదువు మధ్యలోనే మానేసి, కంట్రోల్ బియ్యం కొనడం – అమ్మడం, వేటకు వెళ్లడం వంటి పనులు చేస్తూ డ్రాపవుట్స్‌గా మిగిలిపోతారు. వాళ్ల కాలనీకి ఎప్పుడు వెళ్లినా, పేరెంట్స్ ఎవరూ ఉండరు.
ఇంట్లో ఉన్న ముసలివాళ్లను కదిలిస్తే..“ఏం జెయ్యమంటరు సారూ! ఆల్లు బేరానికి పోతేనే ఇల్లు గడుస్తది. ఇగ సదువంటే ఆల్లకు అచ్చే కాడికస్తది తియ్యుండ్రి” అంటారు.“జీవన పోరాటంలో అనివార్యంగా వాళ్లు ఇల్లు విడిచి వెళుతున్నారు. వాళ్ల ఆర్థిక వెనుకబాటుతనమే వాళ్ల అజ్ఞానానికి కారణం” అని రమ్య మేడంతో అనగానే..“వాళ్లేమీ ఆర్థికంగా పూర్తిగా లేమిని అనుభవిస్తున్న వాళ్లుకాదు సార్. ఎవరి ఇండ్లలో ఏ శుభకార్యమైనా, చావులాంటి అశుభకార్యమైనా వాళ్ల ఇండ్ల ముందు గుంపుగా వాలి వేలకువేలు వసూలు చేస్తారు. ఒక్కొక్కరికీ రెండు నుంచి పది ఎకరాల భూములన్న వాళ్లూ ఉన్నారు. లక్షల రూపాయలు వడ్డీకి తిప్పుతారు”. ఈసారి ఖంగుతినడం నా వంతయ్యింది. పరస్పర విరుద్ధ అంశాలు నా అనుభవంలోకి వచ్చేసరికి, ఏది నిజమో తెలుసుకోలేని సందిగ్ధావస్థలో పడిపోయాను.
మధ్యాహ్నం పిల్లలు భోజనం చేస్తున్న సమయంలో రెండో తరగతి చదువుతున్న వంశీ తల్లి ఏడుస్తూ, అరుస్తూ రువ్వడిగా వచ్చింది. తింటున్న వాణ్ని తింటున్నట్టే లేపి చెయ్యి పట్టుకొని గుంజుకు పోసాగింది.“ఏమైందమ్మా.. అన్నమైనా తినకుండా వాణ్ని అట్లా గుంజుకుపోతున్నావు” అని అడగ్గానే..“బతుకే బాయిల వడ్డట్లయ్యింది. బువ్వ నెవడడిగిండు సార్” అంటూ పోతనే ఉంది.నాకేమీ అర్థం కాకుండా అలాగే ఉండిపోయాను.మధ్యాహ్న భోజనం వండే వెంకటమ్మ..“పెండ్లం మొగని పంచాతి సారు. ఇది ఉండంగనే ఇంకోదాన్ని తెచ్చుకున్నడు. ఇది తిరగవడితే రాత్రి బాగా తాగచ్చి ఇయ్యరమయ్యర కొట్టిండు. ‘ఎవనితో జెప్పుకొంటవో చెప్పుకో.. పో!’ అని బరితెగించితే, అది పోలీస్ స్టేషనుకు పోతంది” అన్నది.“ఈ అమ్మాయి నా స్టూడెంట్ సార్. ఏడవ తరగతి పూర్తికాగానే చదువు మానిపించి పెండ్లి చేశారు. ఇక్కడి ఆడ పిల్లలందరి పరిస్థితి కొంచెం అటుఇటుగా ఇంతే ఉంటుంది” అంది రమ్య మేడం.
“బాల్య వివాహాలు నిరోధించడానికి పోలీస్, రెవెన్యూ యంత్రాంగముంది కదా! వీటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలేవీ జరగడం లేదా? మేడం” అంటే.. “ప్రభుత్వ యంత్రాంగం వీళ్ల కోసం అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటుచేస్తే, అంతా తిరగబడి రాళ్లతో కొట్టి ఉరికించిన చరిత్ర వీళ్లది. వీళ్లను ఎవరూ మార్చలేరు సార్. అన్నీ మూర్ఖమైన ఆలోచనలే. చేసుకున్న దానిమీద మోజు తీరిపోతే, కుల పంచాయితీ పెట్టి లక్షలకు లక్షలు పోసి విడాకులిచ్చి వేరేవాళ్లను చేసుకుంటారు. పోలీసులు, కోర్టులు వాళ్లకు లెక్కలేదు సార్”.
బాల్య వివాహాలు ఆగాలంటే వాళ్లకు చదువు అందాలి. ముఖ్యంగా ఆడపిల్లలకు. ఎలాగైనా ఈ అనాచారాన్ని ఆపేందుకు ఏమైనా చెయ్యాలి అనుకున్నాను. మాది ప్రాథమికోన్నత పాఠశాల. అంతా పదమూడేళ్లలోపు పిల్లలే. కొందరు పెద్ద పిల్లలు నా మాటల్ని శ్రద్ధగా వింటారు. వాళ్లవంటూ సొంత ఆలోచనలు రూపుదాల్చని పసి వయసులో వాళ్ల అమ్మానాన్నల మాటలు వాళ్లమీద ఒక ముద్రను వేస్తున్నాయని నాకర్థమైంది. వాళ్లకు కొత్త ఆలోచనలను, కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకున్నాను. తినడానికి తిండిలేని నిరుపేదలు, అంగవైకల్యంతో బాధపడే అసహాయులు, చదువు అనే దీపపు వెలుగులో ఎన్ని విజయాలు సాధించారో నా ట్యాబ్‌లోని వీడియోలను చూపించి, సాధారణ భాషలో వారి మనసుకు హత్తుకొనే విధంగా వారిని మోటివేట్ చేయడం మొదలుపెట్టాను.
ఒకరోజు కాలనీలో మీటింగ్ పెట్టి తల్లిదండ్రులతో మాట్లాడాలనుకున్నాను. అయితే, రమ్య మేడం గతంలో జరిగిన విషయాల గురించి చెప్పింది గుర్తొచ్చింది. అందుకే బాల్యవివాహాల గురించి అని చెబితే ఎవరూ రారని, మహిళల ఉపాధి కోసం మార్గాల గురించి అని మాత్రమే చెప్పాను. అధికారులు, పేరు మోసిన రచయిత్రులు, కౌన్సిలర్స్‌ను తీసుకువచ్చాను. ముందుగా మహిళలకు గల ఉపాధి అవకాశాల గురించి మాట్లాడించి మెల్లగా ఆడపిల్లల చదువు ప్రాధాన్యత గురించి, బాల్య వివాహాల వల్ల సంభవించే శారీరక సమస్యలతోపాటు, బాల్యవివాహాల వల్ల సామాజిక వివక్షకు, వెనుకబాటుకు ఎలా గురవుతారన్న విషయాన్ని చెప్పగానే మీటింగులో కలకలం మొదలైంది.
సాయంత్రం ఏర్పాటుచేసిన మీటింగ్ కావడం వల్ల పనులు ముగించుకొని, బాగా తాగి వచ్చిన వాళ్లు ఆవేశంగా మాట్లాడటం మొదలుపెట్టారు.“ఏంది సారూ! మా ఆడోల్లకింత పైసలు దొరికే పనుల గురించి చెప్పుతనని, గీ లేనిపోని రామాయణం మొదలు పెట్టిచ్చినవ్. నీకేమైనా మతుందా. మా ఆడివిల్లగాండ్లను ఎంతదాంక సదివియ్యన్నో.. ఎప్పుడు లగ్గం జెయ్యన్నో మా కెరుకనే. నువ్వేంది జెప్పేది. టీవీలల్ల, సినిమాలల్ల సూత్త లేరా.. పేమా దోమా అని ఎన్ని కతలు వడుతున్నరో! కులంగానోడు, తలంగానోడు ఎవనెంటనో పడిపోతే నువ్వేమన్నా కావలుంటవా!? నాలుగొద్దులు సదువు జెప్పుకొని పోయెటోనివి.. గంతల్నే ఉండు. మా పోరగాండ్లయి, మాయి దమాఖ్లు ఖరాబు జేత్తనని జూత్తే మంచిగుండది. ఏదో బడి సారువని ఇడ్సివెడ్తున్నం. మీటింగ్ లేదు.. గీటింగ్ లేదు ఛల్ దొబ్బేయిండ్రి!” అంటూ ఒక్కసారిగా పరిస్థితిని భయానకంగా మార్చేశారు.
ఊహించిందే కావడంతో మేము కూడా వెంటనే మీటింగ్ ఆపేశాం. అయినా నేను నా ప్రయత్నాన్ని విరమించుకోదల్చుకోలేదు. వందల సంవత్సరాలకు ముందే ఆ మహాతల్లి సావిత్రిబాయి ఫూలే మహిళలకు చదువు అందివ్వడానికి ఛాందస సమాజాన్ని ఎదిరించి ఎన్ని కష్టాలకో ఓర్చి ముందడుగేయకుంటే.. మహిళలకు చదువు దక్కేదా!? ఇప్పటి ఈ వెలుగులన్నీ ఆ తల్లి తన రక్తాన్ని చమురుగా చేసి వెలిగించిన దీపాలే కదా!నాకున్నదల్లా. ఇక పిల్లల మెదళ్లలో అభ్యుదయాంకురాల్ని మొలిపించడమే. వాళ్ల పూర్వికులు విద్యకు దూరంగా ఉండటం వల్లనే ఈ తరం పసిమొగ్గలు పూసీ పూయకుండానే రాలిపోతున్నారు. బ్రహ్మలిపి ఏమోగానీ తల్లిదండ్రులే వారి నుదుటన అజ్ఞానలిపిని రాస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే తరాలు కూడా ఇదే చీకటిలో మగ్గిపోతాయి. వీళ్లలో కాంతిని పంచగలిగే ఒక్క జ్యోతినైనా నేను వెలిగించగలనా? నేను వేసుకున్న ప్రశ్నకు సమాధానంగా నాకు వసంత కనిపించింది. తెలివైనది. నా మాటలపట్ల ఆకర్షణ, విశ్వాసం మెండుగా ఉన్న అమ్మాయి. ఈ ఒక్కదాన్ని మార్చగలిగినా.. ఒక దీపం మరికొన్ని దీపాల్ని వెలిగించినట్లు, వాళ్ల సామాజికవర్గంలో మార్పునకు దోహదపడే రోల్ మోడల్‌గా నిలిచిపోతుందని స్థిరపరుచుకున్నాను.అప్పటినుంచి వసంత నా కలల ప్రతినిధిగా మారిపోయింది. ఆమెకు ముందే చెప్పాను. సాయంత్రాలు ఫోన్‌చేస్తే అమ్మా నాన్నలకు డౌట్స్ క్లారిఫికేషన్ కోసమేనని చెప్పాలని. జీవితంలో అనేక అవాంతరాలను దాటుకొని, గొప్పగొప్ప విజయాలు సాధించిన వారి గురించి స్ఫూర్తిదాయకంగా వివరిస్తూ ఆమెకు ఒక జీవిత లక్ష్యాన్ని నిర్దేశించసాగాను.
ఉపాధ్యాయ వృత్తిలో నేను సాధించిన విజయాలు, పురస్కారాలన్నీ ఒక ఎత్తయితే, ఈ ఒక్క విజయాన్ని పొందితే నా అంతిమ విజయంగా ఆనంద పడతాను. గతంలో కూడా జోగినిగా మారిన విద్యార్థిని ఒకామెను తిరిగి వివాహం చేసుకొనేలా ప్రోత్సహించి విజయం సాధించాను. మధ్యలోనే చదువు మానేసిన వారిని ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేయించగలిగాను. కొందరు ఉద్యోగాలు కూడా సాధించారు.చదువుతోపాటు, విద్యార్థుల వ్యక్తిగత జీవితాలనూ అధ్యయనం చేయడం నాకు గురుపరంపరగా అబ్బిందే. పదవ తరగతి వరకు సాంఘిక శాస్త్రం బోధించిన హన్మాండ్లు సార్ నాకు మార్గదర్శి. సమాజంలో నెలకొన్న కులమత భేదాలు, ఆర్థిక అంతరాలు, లింగ వివక్ష, అనేక రూపాల్లో కొనసాగే హింసను కళ్లకు కట్టినట్లు వివరించి, వాటి ప్రభావాలు విద్యార్థుల చదువుపై, ఎదుగుదలపై ఎలాంటి ప్రభావాల్ని చూపుతాయో చెప్పేవాడు. వాటిని అధిగమించాలంటే, చదువు ఒక్కటే ఆయుధమని బోధపరిచారు.
విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చింది. విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తుంటే, వారం నుంచి వసంత బడికి రాకపోవడం గమనించి పిల్లలను అడిగాను. “ఆమెకు పెళ్లి సెటిల్ అయ్యింది సార్” అని పిల్లలు అనగానే.. నా పక్కనే ఏదో బాంబ్ పేలినట్లు అదిరిపోయాను. షాక్‌కు గురయ్యాను. నా చెవులను నేనే నమ్మలేకపోయాను. నా తల బద్దలవుతున్న భావన.“మేడం” అంటూ గట్టిగా అరవగానే రమ్య మేడం పరుగున వచ్చారు. నాకు తెలియకుండానే, నా కళ్లలోంచి కారిపోతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ..“ఇలా జరిగిందేంటి మేడం? వసంతకు పెళ్లి అంటున్నారు. ఎంత ఘోరం ఇది. ఏది జరుగకూడదని భయపడ్డానో, అదే జరుగుతున్నది. ఎలాగైనా ఈ పెళ్లిని జరుగనివ్వను. అధికారులకు కంప్లయింట్ చేస్తాను”.
“సర్! మీరు అనవసరంగా ఆందోళన పడుతున్నారు. మీరేదో చేయాలన్న మితిమీరిన ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉండటం వల్ల అతిగా డిస్టర్బ్ అవుతున్నారు. నిజానికి ఇవన్నీ ఇక్కడ వెరీ కామన్. అనవసరంగా ఇందులో తలదూర్చకండి. గతంలో పోలీసులు, అధికారులు ప్రయత్నించినా ఈ తతంగం ఆగలేదు. ఒక ఉపాధ్యాయుడిగా మీరేం చేయలేరు. అది మీకు కూడా మంచిది కాదు. వాళ్లు అందరి లాంటివాళ్లు కాదు. నా మాట విని ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి”. ఇక ఆమెతో వాదించలేదు. వసంతకు ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఆ రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు. తెల్లవార్లూ వసంత గురించే ఆలోచించసాగాను. పద్నాలుగేండ్ల పసికూన. ఇంత చిన్నవయసులో చదువుకు దూరమై జీవితమంతా ఆ చక్రబంధంలో చిక్కి చితికిపోవాల్సిందే. వీళ్లలో ఇలా ఎంతమంది బలి అవుతున్నారో. పెళ్లిరోజు నాడు ఉండబట్టలేక ఒక్కసారి వెళ్లి వస్తానంటే.. రమ్య మేడం తీవ్రంగా అభ్యంతర పెట్టారు. వాళ్లు నిర్దయగా ఉంటారని చెప్పి నన్ను నిరోధించారు. నెల రోజులు నేను మనిషిని కాలేకపోయాను. బడిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఆ పసి ముఖమే కళ్లలో కదలాడింది. ఎంత ఆశపడ్డాను. ఎన్ని ఆశలు కల్పించాను ఆమెకు. ఎంత మథనపడిందో.. ఎంత పెనుగులాడిందో. తరతరాలుగా పేరుకుపోయిన మూఢాచారాల ముందు, పెళ్లిలో పోచమ్మకు బలిచ్చే మేకపిల్లలాంటిదే.. వాళ్ల కులంలోని ఆడపిల్ల పరిస్థితి అనుకున్నాను.కోర్టుకేసుతో నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియ తిరిగి చేపట్టడం వల్ల గెజిటెడ్ హెడ్మాస్టర్ ప్రమోషన్‌తో నేను వేరే ఊరికి వెళ్లిపోయాను. ఆ ఊరిని విడిచి వెళ్తుంటే.. నా సొంత కూతురిని పులిబోనులోకి తోసి వెళ్తున్న బాధ ఏదో నన్ను మెలిపెట్ట సాగింది. నా అశక్తత నన్ను వెక్కిరించసాగింది.
కాలం గిర్రున తిరిగిపోయింది. నేను పదవీ విరమణ పొందాను. విశ్రాంత జీవితం గడుపుతున్న సందర్భంలో క్రమక్రమంగా వసంతను మర్చిపోయినా, జ్ఞాపకం వచ్చిన ప్రతీసారీ.. నా మనసు సునామీతో అల్లాడిన సాగరమవుతుంది. చదివే కథల్లో, చూసే సీరియళ్లలో ఎక్కడ వసంత, వసంతం పదాలు కనిపించినా, వినిపించినా.. తెలియకుండానే నా కళ్లు తడితడిగా మారేవి. గుండె బరువెక్కేది.నేను రిటైర్ అయిన చాలా సంవత్సరాలకు ఒకనాడు ఉదయం ఓ వాహనం నా ఇంటి ముందు ఆగింది. అటెండర్లాంటి వ్యక్తి ముందు దిగి కారు డోర్ తెరవగానే.. అందులోంచి ఒక యువతి దర్పంగా దిగి నా వద్దకు రాసాగింది. నేను అయోమయంలో ఆమెను చూడసాగాను. వచ్చీ రాగానే, నన్ను, నా భార్యను కూర్చోబెట్టి పట్టు శాలువాలు కప్పి, కొత్త బట్టల కవర్లు మా చేతుల్లో పెట్టి స్వీట్లు, పండ్లు ఇచ్చి.. మా ఇరువురి కాళ్లకు దండం పెట్టింది. ఆమె ఎవరో ఎంతమాత్రం పోల్చుకోలేకపోతున్నా.
“సార్! నేను వసంతను. కొండాపూర్‌లో మీవద్ద ఏడో తరగతి వరకు చదువుకున్నాను. గుర్తుకొచ్చానా!?”‘వసంత’ పేరు వినగానే నా ఒళ్లంతా ఒక్కసారిగా కంపించింది. సజల నేత్రాలతో ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని..“అమ్మా.. వసంతా! నువ్వా బేటా.. నా వసంత వా! నాకోసం వచ్చావా! ఎలా ఉన్నావు తల్లీ.. ఏం చేస్తున్నావు!?”.. వివశుడనై అడుగుతుండగానే,“మీ వసంత ఇప్పుడు మీ జిల్లా డిప్యూటీ కలెక్టర్. మీరు వెలిగించిన దీపం. కాలం వీచిన కల్లోల గాలులకు ఆరిపోయినా.. మీ ఆశీస్సుల చమురుతో, మీరందించిన జ్ఞాన కాంతితో తనకు తాను వెలిగించుకొని ఇప్పుడు మీ ఆశీర్వాదం కోసం మీ ముందు నిలబడింది. మీరు కోరుకున్నట్లుగా మా సమూహంలోనే కాదు, సమాజంలోని ఏ ఆడపిల్లా బాల్య వివాహపు బాకుకు బలి కాకుండా రక్షణగా నేను నిలుస్తాను. అప్పుడు ఒక సాధారణ ఉపాధ్యాయులుగా మీకు అసాధ్యమైంది. ఇప్పుడు అధికారిగా, మీ ఆశయంలోంచి ఉద్భవించిన ఆయుధాన్ని నేను. మీ కలను నేను నిజం చేస్తాను సార్!”“ఇది కలా.. నిజమా!? ఇంతటి అద్భుతం ఎలా సాధ్యమైందమ్మా!?”.“సార్.. మాటలతోనే సరిపుచ్చుతారా. ఈ పూట భోజనం మీతో చేయాలనుకుంటున్నా”.“శారదా! వెళ్లమ్మా.. అందరికీ భోజనాలు సిద్ధం చేయ్. ఈసారి కొత్తగా వసంతం మన గడప తొక్కింది. మన ఇల్లే కాదు, ఆమె పారాడిన నేలంతా పచ్చదనంతో పరవశిస్తుంది”.
భోజనాలు చేస్తున్నప్పుడు తన గతాన్ని చెబుతూ..“ఆనాడు మూర్ఖత్వం ముందు మీ విజ్ఞత వెలవెలబోయింది. మూఢాచారం ముందు నా నిరసన.. స్వరం లేనిదయ్యింది. ఒక్కడే కొడుకు. పదెకరాల భూమి, పెద్ద బిల్డింగ్ ఇవన్నీ నన్ను సుఖపెట్టేవని తొందరపడ్డాడు నాన్న. చదువుకొంటానంటే.. ‘మన కులంలో ఏ ఆడదైనా ఉద్యోగం జేసిందా.. ఊర్లేలిందా!?..’ అంటూ బలవంతంగా పెళ్లి జరిపించాడు. ఇద్దరు పిల్లలై, వాళ్లు బడికి పోతున్నప్పుడు, నాలో నివురు గప్పి ఉన్న ఆశయం నిప్పయి రగిలింది. మీరు నాకోసం పడ్డ ఆరాటం, నన్ను నిలబెట్టాలని చేసిన నిశ్శబ్ద పోరాటం నన్ను నిలువనీయలేదు. పెళ్లయినప్పుడు ఆపేసిన చదువు, తిరిగి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పొందడంతో నన్ను నేను నిరూపించుకున్నాను. సోషల్ మీడియాలో ఎందరివో విజయగాథలు చూశాను. పెళ్లయి, పిల్లలైన తరువాత ఐఏఎస్, ఐసీఎస్‌లకు సెలెక్ట్ అయిన వాళ్ల స్టోరీలు ఒక ఎత్తయితే.. మీ ఆశయాన్ని నిలబెట్టాలన్న సంకల్పం మరొక ఎత్తయి గ్రూప్-1 పరీక్షలో స్టేట్ టాపర్‌గా నిలిచి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ సంపాదించాను. నా తరువాత లక్ష్యం సివిల్స్ రాసి కలెక్టర్ కావడమే. నా ప్రతి ఆలోచనకు మీ ప్రేరణ చోదక శక్తి. తిరిగి వెలిగిన ఈ దీపం వేల దీపాలను వెలిగిస్తూనే ఉంటుంది”.. తన విజయగాథను ముగించింది వసంత.
కానీ, ఆ తీరం చేరుకోవడానికి ఎన్ని తుఫానులను ఎదిరించిందో, ఎన్ని కల్లోలాలకు సవాలు విసిరిందో, కాలానికి ఎంత ఎదురీదిందో.. మొత్తానికి తాను గెలిచి, నన్ను గెలిపించిన వసంత నా ఆశయాన్నీ గెలిపిస్తుందన్న ప్రగాఢ విశ్వాసంతో, ఆశీస్సులందించి విజయగర్వంతో ఆమెను సాగనంపాను. నడిచి వెళ్తున్న వసంత చుట్టూ ఓ కాంతివలయం ప్రసరిస్తున్న భావన నాలో కలిగింది.
గాజోజు నాగభూషణం
జీవితాన్ని ఉన్నతీకరించడంలో సాహిత్యానిది కీలక భూమిక అంటారు రచయిత గాజోజు నాగభూషణం. కవి, రచయిత, గాయకులుగా తెలంగాణ సమాజానికి సుపరిచితులు. ఈయన స్వస్థలం జగిత్యాల. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్లో నివాసం ఉంటున్నారు. అలిశెట్టి ప్రభాకర్ సాన్నిహిత్యంతో, జగిత్యాల రైతాంగ ఉద్యమాల ప్రభావంతో కవిత్వం రాయడం మొదలుపెట్టారు. నిరంతర ఉద్యమాల భాగస్వామ్యంతో ఎరుకలోకి వచ్చిన మానవ జీవన విధ్వంసమంతా.. కథల్లోనే ప్రతిఫలించే అవకాశముందని కథా రచనపై ఆసక్తి పెంచుకున్నారు. కవిత్వంలో ‘మట్టి సరిగమలు’, ‘ప్రాణదీపం’ సంకలనాలు వెలువరించారు. ‘నెత్తుటి గాయాలు’ పేరుతో తెలంగాణ ఉద్యమ గేయాలు రచించి, గానం చేసిన సీడీని విడుదల చేశారు. ఇప్పటివరకు 25 కథలు రాశారు. వీటిలో పదకొండు కథలకు వివిధ పోటీల్లో బహుమతులు అందుకున్నారు. నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీపీఠం కథల పోటీల్లో వరుసగా నాలుగేళ్లుగా బహుమతులు దక్కించుకుంటున్నారు.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన
‘కథల పోటీ-2023/24’లో
రూ.3 వేల బహుమతి పొందిన కథ.
-గాజోజు నాగభూషణం
98854 62052