యోగివర్యుని పునర్జన్మ
తన పగ సాధించడానికి పుల్కసుడు అనే మాతంగుణ్ని ఎన్నుకుంది చింతామణి.అతడు చాలా భక్తిపరుడు. ప్రతిరోజూ సూర్యోదయకాలంలో గంగలో మునిగి, సూర్యునికి మొక్కుకునేవాడు. ఇంటికి వచ్చి పట్టెవర్ధనాలు పెట్టుకుని తన గుడిసెలో ఒక మూల వేదికపై దేవతగా నిలుపుకొన్న మట్టిబొమ్మను పూజించి, కులవృత్తి చేసుకునేవాడు.అతని భార్యపేరు మాలిని.
జరిగిన కథ : చింతామణి అనే వేశ్య.. లీలాశుకుని నుంచి దూరమైన తరువాత యోగినిలా బతుకుతుండేది. ఆమె ఒకనాడు అగ్నిశిఖుడనే యోగిని ఆశ్రయించి, ఆత్మజ్ఞానం బోధించమని వేడుకుంది. కానీ, బాహ్యస్మృతి లేని ఆ యోగి.. ఆమె మాటలను ఆలకించలేదు. అది తనను అవమానించడమే అని చింతామణి భావించింది.
తన పగ సాధించడానికి పుల్కసుడు అనే మాతంగుణ్ని ఎన్నుకుంది చింతామణి.అతడు చాలా భక్తిపరుడు. ప్రతిరోజూ సూర్యోదయకాలంలో గంగలో మునిగి, సూర్యునికి మొక్కుకునేవాడు. ఇంటికి వచ్చి పట్టెవర్ధనాలు పెట్టుకుని తన గుడిసెలో ఒక మూల వేదికపై దేవతగా నిలుపుకొన్న మట్టిబొమ్మను పూజించి, కులవృత్తి చేసుకునేవాడు.అతని భార్యపేరు మాలిని. భర్తకు తగిన ఇల్లాలు. తన భర్తకు కావాల్సిన ఉపచారాలన్నీ ఎప్పటికప్పుడు అశ్రద్ధ లేకుండా చేస్తుండేది. భర్త పాటించే ఆచారాలకు తగినట్లుగా తమ గుడిసెను పరిశుభ్రంగా ఉంచుతుండేది. ఆ వాడలో తిరిగే కోడి, కుక్క, పంది వంటి జీవులు తమ గుడిసె దాపులకు కూడా రాకుండా కాపాడుతుండేది.ఆ దంపతులకు అప్పటివరకూ సంతానం కలగలేదు. దానికి ఆమె ఎప్పుడూ బాధపడుతుండేది.
ఒకనాడు భర్తను చేరి..
“నాథా! మన కులంలోని వారందరికీ సంతతి ఉంది. మనమే ఇలా ఉన్నాం. అసలు మనం మన కులాచారాలకు విరుద్ధంగా స్నానాలు, జపాలు, పూజలు చేయడం వల్లనే మనకు పిల్లలు కలగడం లేదని అందరూ చెప్పుకొంటున్నారు. మన తండ్రి, తాతలు ఎరుగని నియమాలు మనకెందుకు?! ఇదేమైనా బెడిసి కొట్టిందేమో, పోనీ మానేయరాదా?” అన్నది.
అందుకు పుల్కసుడు..
“ఓసి వెర్రిదానా! మనం పెట్టిపుట్టలేదు అంతే! ఈ స్నానాలు, పూజలు బిడ్డలకు అడ్డం వస్తాయా?! మనవాళ్లకు తెలియకపోవడం వల్ల అలా మాట్లాడుతుంటారు. వాళ్ల మాటలు పట్టించుకోకు. యోగముంటే ఎప్పటికైనా మనకు సంతానం కలగకపోదు” అని సర్దిచెప్పాడు.
అది జరిగిన మరో రెండు రోజులకు …
“నాథా! పొద్దున్న ఒక బిచ్చగాడు కిన్నర మీటుతూ వచ్చాడు. తోటికోడలు బలవంతం చేస్తే.. ‘మాకు పిల్లలెప్పుడు కలుగుతారు’ అని వాణ్ని శకునం అడిగాను. వాడేవో మంత్రాలు పాడుతూ, నా చేయి చూశాడు. ‘నీకు గాలిసోకింది. అందుకే పిల్లలు పుట్టడం లేదు. ఈ రచ్చరేకు కట్టుకో! కుంచెడు ధాన్యమిస్తే ఇస్తాను’ అని చెప్పాడు. అయితే నేను వెంటనే అంగీకరించకుండా వాణ్ని రేపు రమ్మని చెప్పి పంపేశాను” అన్నది.
అందుకు మాతంగుడు సంతోషించి..
“మంచిపని చేశావు. అటువంటివారిని నమ్మకూడదు. నీకు కావాలంటే ఊళ్లోకి పోయి ఎవరైనా ఆ విధానం సక్రమంగా తెలిసినవారి నుంచి మహిమ కలిగిన రక్షరేకులు తెచ్చిస్తాను” అన్నాడు.ఆ మరునాడు గంగకు పోతుండగా మాతంగునికి ఒక మాలదాసరి ఎదురుపడ్డాడు.
“దాసరీ! నువ్వు దేశాలు తిరుగుతుంటావు కదా! చాలామందిని ఎరిగే ఉంటావు. నేను సంతానం కోసం రక్షరేకు కట్టేవారికోసం చూస్తున్నాను. అటువంటి వారెవరైనా తెలిసుంటే చెబుతావా?!” అని అడిగాడు.
అందుకు మాలదాసరి..
“నేనే కట్టగలను. ఎక్కడికో ఎందుకు?” అని సమాధానం చెప్పాడు.
“నీమాట పక్కన పెట్టు. త్రివేణిలో జపం చేసుకునే బైరాగులను అడిగితే ఇవ్వరా?! నాకు కావాల్సింది అటువంటివి కాదు” అన్నాడు మాతంగుడు.
అందుకు మాలదాసరి..“అయితే ఒకపని చేయి. పల్లపు వీధిలో చింతామణి అని ఒక భోగకాంత ఉంది. ఆమె గొప్ప యోగిని అని పేరు తెచ్చుకున్నది. ఆమెను కలుసుకుంటే నీకు దారి దొరుకుతుంది” అని చెప్పి తన దారిన తాను వెళ్లిపోయాడు.
చింతామణి ఇంటి గురుతులు విని, మాతంగుడు అక్కడికి వెళ్లాడు. ఆమెకు దండాలు పెట్టి..“తల్లీ! నేను నీ దాసుణ్ని. నాకు పిల్లలు లేరు.నా భార్యకు గాలి సోకి అడ్డు పెడుతున్నదని మా వాళ్లంతా అంటున్నారు. నువ్వు కరుణించి రక్షరేకిస్తే కట్టుకుంటాం. మాకు పుట్టే బిడ్డకు నీపేరు పెట్టుకుంటాం” అన్నాడు వినయంగా.
చింతామణికి తన పగతీరే సమయం వచ్చిందని అనిపించింది.“మాతంగా! నీకు రక్షరేకుతో పనిలేదు. నాతో రా!” అని గంగ ఒడ్డుకు తీసుకుపోయింది.ఒకచోట గంగలో నిలబడి జపం చేసుకుంటున్న అగ్నిశిఖుణ్ని చూపించింది.“మాతంగా! ఆయన్ను చూశావు కదా! ఈ వేసవిలో ఆయన కాళ్లకు చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు పాపం. నువ్వు ఆయనకు చెప్పులివ్వాలి. ఊరికే ఇస్తే తీసుకోడు. ప్రతిరోజూ ఆయన గంగనుంచి పైకి లేచే సమయంలోపల అక్కడక్కడా కొన్ని చెప్పుల జతలుంచు. ఆయన నీ చెప్పులేసుకుంటే నీ పంట పండినట్లే! ఆ పుణ్యం వల్ల పదినెలలు తిరిగే లోపుగా నీకు తప్పక పుత్రసంతానం కలుగుతుంది” అని బోధించింది.
మాతంగుడు శ్రద్ధగా ఆమె మాటలు ఆలకించాడు. అగ్నిశిఖుడు గంగనుంచి పైకిలేచి, ఆశ్రమానికి వెళ్లేవరకు వేచి చూశాడు. దూరంగానే ఉండి ఆయన పాదాలకు నమస్కరించాడు. తన దుకాణానికి పరుగు పరుగున వెళ్లి, ఆయనకు సరిపడేలా మూడు జతల చెప్పులు తయారుచేశాడు.
ఆనాటినుంచి అగ్నిశిఖుడు గంగలో దిగిన వెంటనే.. ఆయన తిరిగి వచ్చే తోవలో మాతంగుడు చెప్పులు పెట్టేవాడు. చుర్రుమనే ఎండకు కాళ్లు కాలుతున్నా అగ్నిశిఖుడు ఓర్చుకునేవాడు కానీ, ఎక్కడా నీడకోసం వేచి చూసేవాడు కాదు. పాదరక్షలు ధరించేవాడు కాదు.
మాతంగుడు కూడా నిరాశపడేవాడు కాదు. రోజూ గంగకు వచ్చి అగ్నిశిఖుని జపం పూర్తయ్యే వరకు వేచి చూసేవాడు. ఆయన వెళ్లిపోయిన తరువాత చెప్పులు తీసుకుని వెళ్లిపోయేవాడు.కొన్నాళ్ల తరువాత ఒకరోజున.. వేడిగాడుపులు ఎక్కువగా ఉన్నాయి. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. గంగ ఒడ్డున ఇసుక రేణువులు పెనంలో పెట్టినట్లు కాగిపోతున్నాయి. అగ్నిశిఖుడు అలవాటు చొప్పున పాదరక్షలు లేకుండానే ఇసుకలో నడవసాగాడు. ఎందుకో ఆరోజున ఆయన పాపం తట్టుకోలేక పోయాడు. పాదాలు బొబ్బలెక్కాయి.కనీసం ఏదైనా ఆకుమీదనైనా కాలు పెట్టకపోతే అడుగు వేయడం కష్టమనిపించింది. అటువంటి స్థితిలో విధి ప్రేరితుడై మాతంగుడు ఉంచిన చెప్పుల్లో కాలుపెట్టాడు. అడుగులు కొద్దిగా చల్లబడగానే ఆ చెప్పులు విడిచి మఠానికి వెళ్లిపోయాడు.
కానీ, ఆ రాత్రి ఆయనకు నిద్రపట్టలేదు.
‘అయ్యయ్యో! నేనొక తాపసిని కదా! తితీక్ష వహించకుండా ఇతరుల పాదరక్షలలో కాలుపెట్టాను. వారికి రుణపడ్డాను. ఛీఛీ శీతోష్ణ సహనం లేని నా తపస్సు ఇంకెందుకు? అయ్యయ్యో! దేహరక్షణ కోసం అధముడినై పోయాను!’ అని చాలా బాధపడ్డాడు.
అగ్నిశిఖునికి ఇక ఆ బాధ చివరిరోజు వరకూ వదిలిపెట్టలేదు. ప్రాణం పోయే సమయంలో కూడా ఆయనకు ఆ పాదరక్షలే జ్ఞాపకం వచ్చాయి. ఆనాడు తనకు అంటిన కల్మషాన్నే మనసులో తలచుకుంటూ ప్రాణాలు విడిచిపెట్టాడు.
ఎంతటి యోగులకైనా ప్రారబ్ధాన్ని అనుభవించక తప్పదు. జన్మ తీసుకోకముందు, తీసుకున్న తరువాత కూడా.. ప్రారబ్ధ కర్మను బట్టే బుద్ధి మనిషిని ఆయా పనులకు ప్రేరేపిస్తూ ఉంటుంది.
అగ్నిశిఖుడు పరమపదించిన కొన్నాళ్లకే మాలిని నెల తప్పింది. గర్భచిహ్నాలు కనిపించగానే మాతంగుడు చింతామణి దగ్గరికి వెళ్లాడు. దండాలు పెట్టి, తన సంతోషాన్ని తెలియచేశాడు.
చింతామణి కొంతసేపు ధ్యానంలో కళ్లు మూసుకుని తలపంకిస్తూ..“ఓరీ! నీకు మంచి కుమారుడు పుట్టగలడు. నీ భార్య నొప్పులు పడుతున్నప్పుడు నాతో చెప్పు. నేను వచ్చి చూస్తాను. ఇక వెళ్లు!” అని పలికింది.అటుపైన మఠానికి వెళ్లి విచారించగా.. అగ్నిశిఖుడు పరమపదించినట్లు తెలిసింది.
చింతామణి అప్పుడు పరితాపానికి గురైంది.‘ఆహా! క్రోధానికి లోనై ఎంత పాపం మూటగట్టుకున్నాను?! మోక్షసాధనలో ఉన్న యతికి మళ్లీ జన్మించాల్సిన అవసరం కల్పించాను. కామాన్ని జయించానని అనుకున్నాను కానీ, క్రోధమనే శత్రువు చేతిలో పడి పాపాత్మురాలిగా మిగిలిపోవాల్సి వచ్చింది కదా!’ అనుకుని నెలలు లెక్కపెట్టుకుంటూ గడపసాగింది.
ఒకనాడు మాతంగుడు.. చింతామణి వాకిట నిలబడి..“అమ్మగారూ! మా ఇంటిదానికి నొప్పులు వస్తున్నాయి!” అని తెలియచేశాడు.చింతామణి పరుగు పరుగున మాతంగుని గుడిసెకు వెళ్లింది. అప్పటికి మాలినికి ప్రసవమై గడియసేపైంది. మగశిశువు పుట్టాడు. కానీ, పిల్లవాడు పాలు తాగడం లేదు. దాంతో ఆ తల్లి దుఃఖపడుతున్నది. చింతామణి శిశువును ఎత్తుకుని, ఆకార లక్షణాలు పరిశీలించింది. అగ్నిశిఖుడే అలా పుట్టాడని తీర్మానించుకుంది.ఆ శిశువుతో సంస్కృతంలో సంభాషించసాగింది.
“ఓ బాలుడా! నీవెవ్వరు?”. “బాలికా! నేను యతిని”.
“ఇలా ఎందుకు జన్మించావు?”.“నేను పూర్వజన్మలో ఒక వేసవికాలంలో గంగ నుంచి మఠానికి పోతూ ఎండకు తాళలేక.. ఈ మాతంగుడు ఉంచిన పాదుకలలో కాళ్లు పెట్టాను. ఇతనికి రుణగ్రస్థుడినయ్యాను. ఆ విషయాన్నే తలుచుకుంటూ ప్రాణం వదలడం వల్ల వీనికి పుత్రుడినై పుట్టాను. ప్రాణం పోతున్న సమయంలో బుద్ధి ఎలా ఉంటుందో.. అటువంటి జన్మమే వస్తుందని శాస్ర్తాలు చెబుతున్నాయి కదా!”.
“అయితే పాలు ఎందుకు తాగడం లేదు?! వీళ్లు అపవిత్రులని తలస్తున్నావా?”.
“లేదు. పాలు తాగితే వీళ్లకు మరింతగా రుణగ్రస్తుణ్ని కావాల్సి వస్తుంది. అందుకే మానేశాను” అని చెప్పాడు బాలుడు.
ఆ మాటలు వింటున్న మాలినికి.. అంతసేపూ చింతామణి పిల్లాడితో ఏం మాట్లాడుతున్నదో తెలియదు. బాలుడు కూడా ఆమెతో మాట్లాడుతున్న సంగతి అసలే తెలియదు.“తల్లీ! వీడు బతుకుతాడా? అయ్యో! నువ్వు కూడా కన్నీరు పెట్టుకుంటున్నావు ఏమిటమ్మా! నిజం చెప్పు” అని బతిమాలింది.చింతామణి ఆ పిల్లవాణ్ని తల్లి చేతికి ఇచ్చేసింది.
“వీనికేమీ భయం లేదు. కాకపోతే తల్లిపాలు పడవు. ఆవుపాలు కావాలి. నేను పోయి తీసుకుని వస్తాను” అన్నది.“తల్లీ! నువ్వు సెలవిస్తే నేనే వెళ్లి పాలు తీసుకొస్తాను” అన్నాడు మాతంగుడు.కానీ, అతను తెచ్చిన పాలను పిల్లవాడు తాగలేదు. చింతామణి తనింటికి పోయి పాలు తెచ్చింది. ఆ పాలను కూడా పిల్లవాడు ముట్టలేదు. చివరికి ఒక బ్రాహ్మణుడి ఇంటినుంచి ఆవుపాలు తీసుకురాగా.. వాటిని తాగాడు.
ఆ మరునాడు కూడా అదే ఆవుపాలు తీసుకొస్తే తాగలేదు. ఆరోజు నుంచి చింతామణి తానే రోజుకొక బ్రాహ్మణుని ఇంటినుంచి ఆవుపాలు యాచించి తెచ్చి, పిల్లవానికి పట్టించేది. పిల్లవాడు దినదినాభివృద్ధి పొందుతూ పెరుగుతున్నాడు. నవ్వడం, దొర్లడం, కూర్చోవడం, పాకడం నేర్చుకున్నాడు. పిల్లవానికి అన్నప్రాశన చేసే నిమిత్తం చింతామణి ఎక్కణ్నుంచో పాయసాన్ని తీసుకువచ్చింది. కానీ పిల్లవాడు దానిని తినలేదు. దాంతో పళ్లు పెట్టడం అలవాటు చేసింది. పిల్లవాడు పళ్లు, పాలు తప్ప మరేదీ తీసుకునేవాడు కాదు.
మాతంగుడు ఆ పిల్లవానికి ‘చింతామణి’ అనే పేరు పెట్టుకున్నాడు. పిల్లవాడు బుడిబుడి నడకలు వేస్తుండగా ఒకనాడు చింతామణి ఇలా చెప్పింది.
“మాతంగా! ఒక్క విషయం గుర్తుపెట్టుకో! ఎన్నడూ నీ కుమారుడి నుంచి ఏదీ స్వీకరించవద్దు. ధనరూపంగా, వస్తురూపంగా అతను ఏమిచ్చినా పుచ్చుకోవద్దు. నువ్వు ఏనాడూ అతని సంపాదనను ఆశించకు. ఈ నియమం పాటించినంత కాలం మాత్రమే అతను నీతో ఉంటాడు. తరువాత నీ ఇష్టం!”.
“అలాగే తల్లీ! ఈ విషయం నా భార్యకు కూడా చెబుతాను. జాగ్రత్త పడతాం” అన్నాడు మాతంగుడు.మాతంగుడు, మాలిని తమ కొడుకును ఎప్పుడూ గుడిసె దాటి బయటికి పోనిచ్చేవారు కాదు. అతను కూడా ఆటపాటల ధ్యాస కూడా లేకుండా ఎప్పుడూ ఏదో ధ్యానంలో గడుపుతుండేవాడు.కాలక్రమంలో మాతంగుని కొడుకైన చింతామణికి ఏడేళ్ల వయసు వచ్చింది.మాతంగునికి ప్రయాగలో నెలకొక రాత్రి గస్తీ తిరగాల్సిన వంతు ఉండేది. అలా గస్తీ తిరిగినందుకు గానూ రాజభవనం నుంచి కొంత మాన్యం ఆ కుటుంబానికి ప్రతినెలా ముడుతుంది. ఎప్పుడైనా వంతునాడు గస్తీ తిరగకపోతే వానికిచ్చిన మాన్యం ఉపసంహరిస్తారు. అందుకే మాతంగుడు ఎప్పుడూ తన వంతు మానేవాడు కాదు.ఒకసారి తప్పనిసరి పని పడి మాతంగుడు తన వంతునాడు వేరే ఊరికి వెళ్లాడు. గస్తీ సమయానికి తిరిగి రావాలని ప్రయత్నిస్తుంటే.. దారిలో గంగ పొంగింది. రేవు దాటించే నావ దొరకలేదు. మాన్యం పోతుందని బాధపడుతూ అతను అవతలి ఒడ్డునే ఉండిపోయాడు.
(వచ్చేవారం.. తస్మాత్ జాగృత జాగృత)
-అనుసృజన:
నేతి సూర్యనారాయణ శర్మ
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

