జాయ సేనాపతి
దేశీ (జనుల భాష) అయినా, మార్గి (శిష్ట భాష) అయినా.. కొంత సంస్కరించి గ్రంథస్తం చేసుకోవాలి. అర్థం కాలేదా!? మీరు నాట్యకారులు కదా.. ఓ పాత్ర ఓ సంభాషణ చెప్పాలి. ఓ అగసాలిని ‘నా కత్తి పని ఎంతవరకు వచ్చింది?’ అని రైతు అడిగితే ఎవంటాడు?! ‘కత్తా.. గిత్తా.. అమాస దాటాక కనబడు!’ అంటాడు.
- చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ : ఓ సాధారణ పౌరుడిగా వెలనాడు వీధుల్లో తిరుగుతున్న జాయపునికి.. పరాశరదాసు అనే గేయ కవి కలిశాడు. అయితే, అతనికి తన పేరు ‘జగన్నాథుడు’ అనీ, తనో నాట్యాచార్యుడిననీ అబద్ధం చెప్పాడు జాయపుడు. ఇద్దరికీ మంచి మైత్రి కుదిరింది. ఇద్దరూ కలిసి పెద్దనార్య అనే మరో మిత్రుని ఇంటికి వెళ్లి.. అక్కడ జరిగే సాహిత్య చర్చల్లో పాల్గొంటున్నారు. ఆ రోజున పాతిక ముప్ఫైమంది కవి పండితులు అక్కడ సమావేశమయ్యారు. ‘తెలుగు భాష’పైన చర్చోపచర్చలు సాగిస్తున్నారు.
“దేశీ (జనుల భాష) అయినా, మార్గి (శిష్ట భాష) అయినా.. కొంత సంస్కరించి గ్రంథస్తం చేసుకోవాలి. అర్థం కాలేదా!? మీరు నాట్యకారులు కదా.. ఓ పాత్ర ఓ సంభాషణ చెప్పాలి. ఓ అగసాలిని ‘నా కత్తి పని ఎంతవరకు వచ్చింది?’ అని రైతు అడిగితే ఎవంటాడు?! ‘కత్తా.. గిత్తా.. అమాస దాటాక కనబడు!’ అంటాడు. కానీ, అదే సంభాషణ నాట్యరచనలో పెడితే ఏమని రాస్తారు?! ‘అయ్యయ్యో.. నీకత్తి మొనగాడి కత్తి. దానికి పదును పెట్టుటయన్నది ఎంత జాగరూకతతో చేయవలెను!? అందువల్ల మరొక మాసము.. అమావాస్య వెళ్లిన పిదప విచ్చేయవలసినదిగా మనవి!’ అని రాస్తాం. లేదా పద్యరూపంలో చెబుతాం. అవునా.. అదే సంస్కరించడం అంటే!” వివరించాడు ఓ కవి మిత్రుడు.
“అబ్బబ్బ! సంస్కరించడం.. సంస్కరించడం! ఇక ఆపి ఇదిగో ఈ సల్లచారు.. చల్లగా ఉన్నాయి. గొంతులో పోసుకోండి..” అంటూ వచ్చింది పెద్దనార్యుని భార్య, వింజమాంబ పరిచారికతో.
అందరూ భళ్లున నవ్వడంతో ఆ ప్రసక్తి అక్కడితో ఆగిపోయింది. అందరూ గృహాలవద్ద తీక్షణమైన ఏకాగ్రతతో గ్రంథ పఠనం, కావ్యరచన సాగిస్తున్నా ఇక్కడ మిత్ర పండితుల సాహచర్యంలో కాలక్షేపంగా, చలోక్తులతో గడుపుతారు. తెలుగు సంస్కృతాలలో స్వతంత్ర రచనలు, అనువాదాలు చేసేవారు మాత్రమే కాదు.. రాజలేఖకులు, శాసనాల రచయితలు కూడా ఉన్నారిందులో.
ఇక్కడి రాజాస్థానాలకు, వణిజ శ్రేణులకు మాత్రమేకాకుండా.. వేరువేరు రాజ్యాల సభలకు వెళ్లడం, అక్కడి పండితులతో చర్చలు, సన్మానాలు, మడిమాన్యాలు
.. ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. ఆయా రాజ్యాలవారి గౌరవాభిమానాలు పెరిగిపోతే అక్కడే స్థిరపడతారు. దక్షిణావర్తం, ఆర్యావర్తం అంతా వెలనాడు పండితులు, నాట్యకారులు అంటే వెలలేని పేరు ప్రఖ్యాతులున్నాయి. వెలనాడులోకి నిరాసక్తంగా ప్రవేశించిన జాయపుడు.. ఇప్పుడు ఈ పెద్దన కళాగృహంలో కాస్త సాంత్వన పొందుతున్నాడు.
మరోరోజు కళాగృహంలో.. అందరి మనసూ శృంగారం మీదికి పోయింది.
“యది హరిస్మరణే సరసం మనో యది విలాసకళాసు కుతూహలం మధుర కోమల కాంత పదావళీం శృణు తథా జయదేవ సరస్వతీం”
.. విలాస కళలు అన్నాడోయ్ జయదేవుడు. మహా రసికుడోయ్ మహానుభావుడు..” అన్నాడు సంస్కృత కవి ధవళేశునామయ్య.
ధన మదాంధత పొంగి ప్రవహించే వెలనాడులో శృంగారం.. విచ్చలవిడి బూతు కూడా ఎక్కువే.వణిజులు, ఉత్పత్తిదారులు, వస్తు సరఫరాదారులు.. అందరూ మహాధనవంతులు. రైతులు కూడా కష్టనష్టాలమధ్య బండి నడిపిస్తూ పాతర్లు, పుర్రెలు, గాదెల కొద్దీ పంటరాశులతో ఇతర ధనవంతులకు ఏమాత్రం తీసిపోరు.
సమాజంలో భక్తి, మధుర భక్తి, ముగ్ధ భక్తి, ఆరాధన, తాదాత్మ్యం, మానసిక అనురాగం.. హృదయ స్పందన, ప్రేమపూరిత దగ్గరితనం.. రెండు హృదయాలు ఏకమవ్వడం.. లాంటి కొంగొత్త భావనలు వ్యక్తులలో తీవ్రంగా వ్యక్తమవుతున్న కాలం. చిత్రంగా ఇవన్నీ పెళ్లాడిన భార్యపై కాకుండా, ఇతర స్త్రీలపట్ల ఏర్పడటం ధనమదాంధత వల్ల ఎక్కువయ్యింది. వీళ్లంతా వేశ్యావాటికలలో చేరడం.. అక్కడ గణికలతో ఆడిపాడి సంపాదించిన సొమ్ము విసిరేయడం సాధారణం.
వెలనాడు పండిత, కవి, గాయకులు కూడా ఈ విషయంలో తక్కువ తినలేదు. ఒక్కొక్కడికి ఇద్దరు ముగ్గురేసి ఉంపుడుగత్తెలు. భార్యలు కూడా ఒక్కరు కాదు.. కనీసం ఇద్దరు. సాహిత్యంలో కూడా రసికత, ప్రేమ, అమలిన శృంగారంతోపాటు పచ్చిబూతు నిర్భీతిగా రాస్తున్నారు. ఈ భక్తి ప్రభావిత కావ్యాలకు, ప్రబంధాలకు మతంతో అల్లిన భక్తికి, రక్తితో జతకట్టిన బూతుకు దగ్గరి సంబంధం కుదిరింది. దేవుడు, శృంగారం, భక్తి, మతం.. కలిసి కావ్యానికి గొప్ప సరుకు అయ్యింది.
ఇంతలో నాగయకవి మరో శృంగార గుళిక విసిరాడు. అందరూ చప్పట్లతో అతణ్ని అభినందించారు.
అవన్నీ జాగ్రత్తగా వింటున్న జాయపుణ్ని మరో మిత్రుడు ఆట పట్టించాడు.
“మాట్లాడటంలేదు కానీ, మన జగన్నాథునికి చెవిమైథునం ఎక్కువలాగుంది. ఏమీ మాట్లాడకుండా అన్నీ చెవి రిక్కించి వింటున్నాడు చూడండి!”.
సిగ్గుపడిపోయాడు జాయపుడు.
“ముఖారవిందం చూస్తే పెళ్లి సంగతి ఏమో కానీ.. శృంగారానుభవం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది”.
“వేశ్యా సమాగమం ఉండే ఉంటుంది. అందులోనూ అనుమకొండ వాసి అంటే ఇహ చెప్పేదేముంది!? పైగా అందగాడు, నాట్యకారుడు. కనీసంలో కనీసం ఇద్దరు?!.. ఏమంటావ్ జగన్నాథా!?”..
నవ్వుల కృష్ణమ్మకు వరదొచ్చింది. ఉక్కిరిబిక్కిరయ్యాడు జాయపుడు.
మరుక్షణమే లేచి నడుంవద్ద పంచె బిగలాగి, కాళ్లకున్న మట్టెలు బిగించి గొంతు సవరించుకుని.. స్త్రీలా ఒయ్యారంగా స్థానకం తీసుకున్నాడు. ఓ శృంగారగీతాన్ని పాడుతూ నాట్యమాడసాగాడు. జాయపుని అద్భుత నాట్య గానవిలాసం.. అందరూ తొలిసారి చూడటం!
“పోర సామి వేగ నీవు.. పొద్దుబాయే నీకు చాల రనిచ్చినందు కూన.. చెయ్యి బట్టి వదలవౌర ॥పోర॥
ఇరుగుపొరుగు వారు నన్ను చెరగు బట్ట జూచితేనూ
తరిగిపోవు పరువు నాది.. తాకబోకు సామి నన్ను ॥పోర॥”..
సిగ్గు దొంతరల నడుమ గతరేయి శృంగారాన్ని తలచుకుంటూ ప్రియునికి చెబుతున్న జాగ్రత్తలను మార్గి అభినయ విన్యాసంతో ఓ గ్రామీణ ముగ్ధరాలిగా జాయపుడు నర్తిస్తుంటే.. కవి పండితులందరూ రెప్పవేయకుండా దిమ్మెరబోయి చూస్తున్నారు.
“హెచ్చుగాను నీవు నన్ను గ్రుచ్చి కౌగిలించ రాకు
వచ్చిపోయేవారు జూచి.. రచ్చలెల్ల రద్ది జేయు ॥పోర॥
ఎందూకు ఈ రద్ది చేటు మదినిండిన గోపాలుడ..
సందకాడ వచ్చి నీవు.. పొందు గూడి పొమ్ము వేగ ॥పోర॥”..
“పోర సామి వేగ నీవు..”
“పోర సామి వేగ నీవు..”
మొత్తం అక్కడున్న పాతికమంది పండితులు, వింజమాంబ, ఆమె పరిచారికలతోసహా అందరూ జాయపునితో కలిసి.. ‘పోరసామి వేగ నీవు.. పోరసామి వేగ నీవు’ అంటూ ఆయనతో పాడుతూ ఆడుతూ.. ఎంతోసేపు.. తన్మయత్వ మధురిమతో.. జాయపుని చుట్టూ గంతులు వేసి వేసి కూలబడ్డారు. కూలబడ్డాక పరాశరునితో సహా అందరూ సంభ్రమముఖాలతో లిప్తకాలం ఆయననే చూస్తూ ఉండిపోయి.. ఆనక కరతాళధ్వనులతో హోరెత్తించారు. అందరూ జాయపుని భుజం తట్టారు.. భేషో!!
ఇకపై తాను కూడా చదువుకోడానికి, ప్రదర్శనకు కావాల్సిన సృజనాత్మక సాహిత్యం లిఖించాలని నిర్ణయించుకున్నాడు. తనలో మహాశక్తి ఉన్నదని తెలిసేది రెచ్చగొట్టినప్పుడే.. హనుమంతునిలోనైనా..
జాయపునిలోనైనా!
నిత్యమూ ధనదుపురం రావడం.. కళాగృహంలో కవిపండితులతో కబుర్లు.. వర్తమాన సాహిత్య రచనల వివరాలు, వాటిపై చర్చలు.. జాయపుడు ఎంతో సంతోషిస్తున్నాడు. పెద్దన కళాగృహంలో పరిచయమున్న పండితులను సాహిత్య రచనలను, వాటిలోని అద్భుత అంశాలను విశ్లేషించి చెప్పగలడు. అందరిలోనున్న పాండిత్య ప్రకర్ష, సృజనశీలత, తీవ్రమైన ఉద్వేగ ఉత్సాహాలు.. కృష్ణమ్మకున్న వేగం, వొడుపు వీళ్లకు కూడా ఉండటం జాయపుని కళాత్మక హృదయాన్ని మైమరపిస్తున్నాయి. రానున్న తెలుగుసాహితీ మాగాణిలో వీరంతా అద్భుత రచనా పంటలు పండించగలరు అనుకుంటాడు.
వీరిలో హాలుడు, కాళిదాసులు, భారవిలు, భవభూతులు, భర్తృహరిలు, భాసుడు, బాణులు, మాఘులు, దండి, జయదేవులు.. ఉన్నారని ఆగామి దశాబ్దాలలో వీరంతా తెలుగు సాహిత్యాన్ని, ప్రదర్శన కళలను సమున్నత స్థాయికి తీసుకుపోతారని అతని నమ్మకం.
చిత్రం ఏమిటంటే.. వారందరిలాగే తనూ భరతమునికి వారసుడు కాబోతున్నాడని పసిగట్టలేదు జాయపుడు.
“నారాయణ హరి నమోనమో..
శ్రీమన్నారాయణ నమోనమో!”..
ముందు ఒకరు అంటుండగా, ఎదురుగా కూర్చున్న మరెంతోమంది వంత పాడుతున్నారు. కంచు చిడతల భజనహోరుతో దూరానికే ఆ మందిరం ఖంగు ఖంగుమంటూ ధ్వనిస్తున్నది.
“మునిజన వందిత నమోనమో..
మంగళాంగ నమోనమో..”
వింటూ లోపలికి వెళ్లారు జాయపుడు, పరాశరుడు.
అది ధనదుపురంలోని ప్రధాన వైష్ణవ మఠం. ఎదురుగా వేదికపై ఓ ప్రముఖవ్యక్తి కూర్చుని అర్ధనిమీలిత నేత్రాలతో చిన్నగా ఊగుతుండగా.. ఆయనకు ఆవలగా అదే వేదికపై నిలబడి ఓ వ్యక్తి ఉద్వేగంతో ఊగిపోతూ చిడుతలు మోగిస్తూ ఖంగున పాడుతున్నాడు. కింద కూర్చున్న దాదాపు వందమంది ఆడ, మగ అదే వల్లెవేస్తూ భజన చేస్తూ తన్మయత్వంతో ఊగిపోతున్నారు.
జాయపుడు ప్రశ్నార్థకంగా చూస్తే,
“అవును. ఆయనే ఈ వైష్ణవ మఠాధిపతి యతిరాజులవారు..” అన్నాడు పరాశరుడు తగ్గుస్వరంతో.
ముక్కుపొడుంలో మీగడ కలిపినట్లున్న శరీరఛాయ.. వయసువల్ల ముడుచుకున్న శరీరం, వడకలై తరహా తిరుమణి (తిరునామాలు), సమ్మిశ్రయనం (భుజాలపై చక్రాంకితాలు), ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలు (శరీరంపై తిరు, చందననామాలు), చంకల కిందనుంచి మోకాళ్ల వరకు శరీరానికి కప్పుకొన్న కాషాయ శాలువా, తలపై గోష్పాదమంతటి కొప్పు, దానిలో ముడిచిన తాజా కనకాంబరాలు, భక్తి తాదాత్మ్యతతో వెలుగుతున్న ముఖం..
చూస్తేనే గౌరవం కలిగించే స్వరూపం!!
చిన్ననాడు విద్యఘటికలో చూసిన నాగంభట్టు తండ్రి శివభట్టు గుర్తొచ్చాడు.
అది పూర్తిగా లౌకిక విద్యాసంస్థ అయితే.. ఇది పూర్తిగా మత సంస్థ. వైష్ణవ దేవుళ్ల మహత్తులను.. వైష్ణవమత విధానాల ప్రాచుర్యంతోపాటు.. సమాజంలో ఆధ్యాత్మిక విలువల వ్యాప్తికోసం పనిచేస్తున్న సంస్థ. కేవలం వైష్ణవ మతాంశాలే ప్రబోధిస్తారు. పరమతసహనం ఉన్నదోలేదో సందేహమే!? నిత్యమూ నిద్ర లేచాక ‘ఓం నమశ్శివాయ’ అనుకునే జాయపునికి ఇక్కడ ఆ స్మరణ నిషిద్ధమేమోననే సందేహం వచ్చింది. నోరు అదుపులో పెట్టుకోవాలి సుమా..
శ్రీమన్నారాయణుని భజనతో ఓస్థాయి ఉద్వేగంతో, భక్తిభావనలతో పులకించిపోతున్నదా మందిరం. ప్రవేశిస్తూనే పరాశరుడు పరవశుడై భజనలా చేతులతో చప్పట్లు చరుస్తూ శ్రీమన్నారాయణుని భజిస్తూ అందరిలో ఒకడై పోయాడు.
నిజానికి పరాశరుడు వైష్ణవ ఆహార్యంతో కాకుండా, సాధారణ పౌరునిలా ఉంటాడు.
అదే అడిగాడు జాయపుడు.
“నిన్ను చూస్తుంటే.. నీది మారువేషమా? అని సందేహంగా ఉంది పరాశరా!”.
“అదేమిటి అలా అడిగావూ?” ఆశ్చర్యంగా అన్నాడు పరాశరుడు.
(సశేషం)
సిగ్గు దొంతరల నడుమ గతరేయి శృంగారాన్ని తలచుకుంటూ ప్రియునికి చెబుతున్న జాగ్రత్తలను మార్గి అభినయ విన్యాసంతో ఓ గ్రామీణ ముగ్ధరాలిగా జాయపుడు నర్తిస్తుంటే.. కవి పండితులందరూ రెప్పవేయకుండా దిమ్మెరబోయి చూస్తున్నారు.
-మత్తి భానుమూర్తి
99893 71284
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

