ఆకాశమంత అభివృద్ధి సరే! ఆ ప్రయత్నంలో కాలుష్య కాసారంగా మారుతున్న భూగోళం పరిస్థితి ఏమిటి? అంతా విధి అనుకుంటే ఎంత పొరపాటు! చెమట నీరు చిందించి బ్రహ్మరాతను మార్చుకోవాలి. అంతేకానీ, వ్యక్తిగత వైఫల్యాలను, సామాజిక రుగ్మతలను దేవుడి రాత అనుకొని సరిపుచ్చుకుంటే.. నష్టపోయేది ఎవరు? పిడికిలి బిగించి,తెగించినప్పుడే చేతి గీత మారుతుంది. పరిస్థితులూ చక్కబడతాయని నిరూపించిన నాటకం ‘రాత’.
గోవర్ధన్ ఓ సోషల్ వర్కర్. కానీ, గాబరా మనిషి. భార్య కీర్తి అంగన్వాడీ కార్యకర్త. వారి కూతురు స్వప్నిక ఎనిమిదో తరగతి విద్యార్థిని. క్రీడలంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం. కోచ్ కిరణ్ స్వప్నికకు కేర్ టేకర్‌గానూ వ్యవహరిస్తుంటాడు. అంగన్వాడికి వచ్చే పిల్లల్లో ఎక్కువ మందికి ఊపిరితిత్తుల వ్యాధి సోకుతుంది. ఆ ఊరిలోని చక్రి ప్లాస్టిక్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలే అందుకు కారణమని కీర్తి భావిస్తుంది. అందుకు తగ్గ ఆధారాలతో నివేదిక రూపొందించి పై అధికారులకు ఫిర్యాదు చేస్తుంది.
తెర వెనుక
ఫ్యాక్టరీ గురించి కీర్తి ఫిర్యాదు చేయడం ఆ ఇండస్ట్రీ అధిపతి సహించలేడు. అతని కొడుకు అజయ్ రంగంలోకి దిగుతాడు. నంబరు లేని వాహనంతో యాక్సిడెంట్ చేయించి ఆమెను అంతమొందిస్తాడు. భార్య పోయాక గోవర్ధన్ తన ఆశలన్నీ కూతురుపైనే పెట్టుకుని జీవిస్తుంటాడు. తనను ఉన్నత చదువులు చదివించాలని తాపత్రయ పడుతుంటాడు. స్వప్నికకు క్రీడలపట్ల ఉన్న ఆసక్తి గోవర్ధన్‌కు రుచించదు. చదువుకు ఆటంకమని భావిస్తుంటాడు.
తెర తీసిన తర్వాత…
గోవర్ధన్ ఇంటికి ఫ్యాక్టరీ అజయ్ వస్తాడు. కీర్తి తమ ఫ్యాక్టరీపై ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోమని గోవర్ధన్‌పై ఒత్తిడి చేస్తాడు. లేదంటే ‘నీ భార్యకు పట్టినగతే నీ కూతురికీ పడుతుంద’ని హెచ్చరిస్తాడు. అప్పటికే గోవర్ధన్ కూతురు ఊపిరితిత్తుల వ్యాధికి గురవుతుంది. ‘మీ అమ్మాయి క్రీడలు కొనసాగిస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం’ అని చెబుతారు వైద్యులు.
‘మన తప్పులు లేకపోయినా.. ఎందుకు ఇలా జరుగుతుంది నాన్నా? నాకెంతో ఇష్టమైన అమ్మను దేవుడు తీసుకెళ్లాడు? ఇప్పుడు నేను ప్రాణంగా ప్రేమించే ఆటలను వదిలేయమని చెబుతున్నారు. ఇదెలా న్యాయం?’ అని ప్రశ్నిస్తుంది స్వప్నిక.
‘మనం పుట్టక ముందే మన తలరాతను బ్రహ్మ రాస్తాడు తల్లి. అతను ఎలా రాస్తే మనం అలా బతకాల్సిందేనమ్మా’ అంటాడు గోవర్ధన్.
‘ఎందుకలా తలరాతలు రాస్తాడో బ్రహ్మనే అడుగుతాను’ అంటూ స్వప్నిక నిద్రలోకి జారుకుంటుంది. అప్పుడు ఆమెకో కల వస్తుంది.. అందులో..
స్వప్నిక బ్రహ్మలోకంలో ప్రవేశిస్తుంది. తన పరిస్థితి గురించి బ్రహ్మ దేవుణ్ని నిలదీస్తుంది.
‘నా తప్పేమీ లేదమ్మా. నేను అందరి తలరాతలను అందంగా, సుందరంగా, సమంగా రాస్తానమ్మా. మీ మానవులే స్వార్థంతో అంతా చిందరవందర చేసుకుంటారు. అన్నం పెట్టిన చేతులనే నరుక్కుంటున్నారు. అభివృద్ధి పేరుతో అమానుషంగా వ్యవహరిస్తున్నారు. ప్రకృతి వినాశనానికి, పర్యావరణ విధ్వంసానికి కారకులవుతున్నారు. నీకు ఇలా అవ్వడానికి మీ అమ్మ అర్ధంతరంగా గతించడానికి ఆ కరడుగట్టిన స్వార్థపరులే కారణమమ్మా’ అని విశదపరుస్తాడు బ్రహ్మదేవుడు.
‘పరిశ్రమలు లేకపోతే ఉద్యోగాలు ఎలా స్వామి?’ అని స్వప్నిక ప్రశ్నిస్తుంది.
‘పరిశ్రమలు కావాలి. ఉద్యోగాలు కావాలి. కానీ, ప్రజల ప్రాణాలు తీసేవిగా కాకుండా పర్యావరణహితంగా జనావాసాలకు దూరంగా ఉండాలి’ అని ఉపదేశిస్తాడు. సత్యం బోధపడిన స్వప్నిక తన ఊళ్లో చక్రి ప్లాస్టిక్ ఇండస్ట్రీస్‌ను మూసేయించే వరకు తనదైన పంథాలో పోరాటం చేయాలని నిర్ణయించుకుంటుంది.
అనారోగ్యంగా ఉన్నా పట్టుదలతో తండ్రిని ఒప్పించి, కోచ్ సహకారంతో ప్రాక్టీస్ ప్రారంభిస్తుంది. ఆ సందర్భంలో.. ‘ఎవరైనా ఏ ప్రమాదం, ఏ రిస్కూ లేకుండా బతికేస్తామన్న గ్యారంటీ ఏమైనా ఉంటుందా నాన్నా? మన చేతుల్లో ఏం లేదు. మానవ ప్రయత్నం తప్ప’ అని స్వప్నిక అంటుంది. జీవన సత్యం తెలిపే మాటలివి. ఆ దృఢ సంకల్పంతో పాల్గొన్న స్వప్నిక జాతీయ స్థాయి క్రీడల్లో విజయం సాధిస్తుంది. మీడియా ముందు… ‘మా అమ్మ చావుకు, ఎంతోమంది పిల్లల అనారోగ్యానికి కారణమైన చక్రి ప్లాస్టిక్ ఫ్యాక్టరీ వంటి వాటిని జనావాసాల నుంచి తొలగిస్తే తప్ప తన గెలుపునకు అర్థం లేదు’ అని ప్రకటిస్తూ ప్రాణాలు వదులుతుంది. ప్రభుత్వం స్వప్నిక ఆశయ సాధనకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవడంతో కథ ముగుస్తుంది.
‘బ్రహ్మ రాతకు అనుగుణంగా జీవితాలు నడవవని, మనిషి చేష్టల వల్లే అతని జీవితం దుఃఖమయం అవుతుంద’ని 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు చెప్పిన విషయాన్ని ఈ ‘రాత’ నాటిక మరో రూపంలో కళ్లకు కడుతుంది. అంతేకాదు పిల్లలను తమ సహజమైన అభిరుచులకు అనుగుణంగా ఆరోగ్యంగా, హాయిగా ఎదగనివ్వాలనే వైజ్ఞానిక భావనను పెద్దలకు తెలియజేసింది. అందుకే ఈ నాటిక పెద్దలను, పిల్లలను అలరించింది. ఆలోచింపజేసింది. ఈ నాటిక ప్రదర్శించిన ప్రతిచోటా బహుమతులను గెలుచుకుంటున్నది.
నాటిక : రాత
రచన, దర్శకత్వం : శ్రీనివాసరావు పోలుదాసు
సంస్థ : వెలగలేరు ఆర్ట్స్ థియేటర్
పాత్రధారులు : సురభి వాగ్దేవి, సురభి రాఘవ, పవన్ కళ్యాణ్, కొండలరావు
…? కె. శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు