నిజాం రాజ్యంలో దేశ్ముఖ్, పట్వారీ, పటేళ్ల నిరంకుశత్వం పల్లెల్ని పీడిస్తున్న కాలం అది. రజాకార్ల పదఘట్టనలో తెలంగాణ పల్లెలు భయంకరంగా నలిగిపోతున్న సందర్భమది. ఓ పండుగ, పబ్బం, అచ్చట, ముచ్చట జరుపుకోలేని దయనీయ స్థితిలో జనం ఉన్నారు. ముష్కర రజాకార్లను ఎలాగైనా ప్రతిఘటించి ప్రజలకు రక్షణ కల్పించాలనుకునే విప్లవ వీరుల ఎర్రజెండా దండు ఆవిర్భావం అప్పుడే! ఒకవైపు రజాకార్ల గుంపు, మరోవైపు విప్లవ వీరులదండు మధ్యలో నలిగిపోతున్న సామాన్య ప్రజానీకం. ఇది గొల్ల రామవ్వ నాటికకు భూమిక.
ఓ ఊరి జనం ఆ ఊరి దొర అండదండలతో బతుకమ్మ పండుగను జరుపుకొంటూ ఉంటారు. గొల్ల రామవ్వ, పెళ్లీడుకొచ్చిన తన పెద్ద మనుమరాలు మల్లి కూడా ఆ వేడుకలకు హాజరవుతారు. మల్లికి ఆ ఊరి యువకుడు మల్లిగానితో మనువు కుదిరి నిశ్చితార్థం అవుతుంది. ఈ సంతోషాన్ని ఆ వేడుకలో పంచుకునే వేళ అకస్మాత్తుగా రజాకార్లు ప్రవేశించి దౌర్జన్యం చేస్తారు. విప్లవకారుల జాడ తెలపమని జనాన్ని, దొరను హింసిస్తారు. అడ్డొచ్చిన దొర మనుమరాళ్లు ఇద్దర్నీ సామూహిక మానభంగం చేస్తారు. జనాన్ని చితకబాదుతారు. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది.
ఇలా ఉండగా ఒకనాడు రజాకర్ల దాడి నుంచి రామయ్య అనే విప్లవ యువకుడు తప్పించుకుని రక్తసిక్త గాయాలతో గొల్ల రామవ్వ ఇంటికి చేరతాడు. సత్తువ లేక స్పృహతప్పి పడిపోతాడు. రామవ్వ, మల్లి ఆ యువకుడికి సపర్యలు చేస్తారు. గాయాలకు మందు పూస్తారు. కాళ్లలో గుచ్చుకున్న ముళ్లు తీస్తారు. మంచం మీద పడుకోబెడతారు. పాపం రామయ్యకు ఆ క్షణాన ఎలాంటి సోయి ఉండదు.
రామయ్యను వెతుకుతూ వచ్చిన రజాకార్లు గొల్ల రామవ్వ ఇంటిని చిందరవందర చేస్తారు. ఆ సమయాన రామవ్వ, యువకుడు పడుకున్న మంచం మీద మనమరాలు మల్లిని కూడా నేర్పుగా పడుకోబెట్టి, సగం కనిపించేలా దుప్పటి కప్పెట్టి… ‘కొత్తగా పెండ్లయిన జంట పగలల్లా పన్జేసి ఆదమరచి నిద్రపోతున్నారు. వార్నేం చేయకండి. మీ బాంచన్ దొరా కాల్మొక్కుతా’ అంటూ యాగీ చేసి వేడుకుంటుంది. రజాకార్లు ఆ చీకట్లో చూసీ చూడనట్టు వెళ్లిపోతారు.
అలా గొల్ల రామవ్వ ఆ విప్లవ యువకుడు రామయ్య ప్రాణాలు కాపాడుతుంది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఊళ్లో పంచాయితీ పెడతారు. రామవ్వను, మల్లిని నిలదీస్తారు పెద్దలు. రజాకార్లు వెనకుండి అపవాదును ఎగదోస్తారు. విప్లవకారుడి ప్రాణాలు కాపాడేందుకు మల్లిని మంచం మీద పడుకోబెట్టింది నిజమేనని రామవ్వ, పడుకున్నది నిజమేనని మల్లి ఒప్పుకొంటారు. మల్లిగాడు మల్లితో తెగదెంపులు చేసుకుని పంచాయితీ పెద్దల నుంచి దూరంగా పోతాడు. అదే క్షణంలో అకస్మాత్తుగా రామయ్య నేతృత్వంలో విప్లవ దండు గెరిల్లా దాడిచేసి రజాకార్లను కొందరిని హతమారుస్తారు. మరికొందరు పారిపోతారు. ఆ ఘర్షణలో డబ్బు ఏండ్ల గొల్ల రామవ్వ నేలకొరుగుతుంది. మల్లి దిక్కులేని అనాథ అవుతుంది.
‘మల్లికి నేను ఆశ్రయం ఇస్తాను.’ అని రామయ్య అంటాడు. మనువాడి ఆశ్రయమివ్వమని జనం అడుగుతారు. ‘నేను విప్లవకారుణ్ని. నా ప్రాణం ఎప్పుడు? ఏ క్షణం పోతుందో నాకే తెలియదు. అలాంటప్పుడు మల్లికి నేను న్యాయం చేయలేను’ అని రామయ్య అంటాడు. ఆ వెంటనే.. ‘అనుమానంతో మనసులేని పెనిమిటితో వందేండ్లు బతికేకన్నా, నీ లెక్క, నీతో ఒక్కరోజు కలిసి బతికితే.. అదే నిజమైన మనువు’ అని మల్లి అంటుంది. రజాకార్ల మృతదేహాలను కుప్పగా పోసి తగలబెట్టడంతో నాటిక ముగుస్తుంది.
తెలంగాణ సాయుధ పోరాట నేపథ్య కథల్లో ‘గొల్ల రామవ్వ’ చాలా ప్రసిద్ధమైనది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ కథను నాటికగా పలు సందర్భాల్లో ప్రదర్శిస్తున్నారు. ఈ కథ రాసింది మన తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. జూన్ 28న ఆయన జయంతిని పురస్కరించుకొని అంతకు ముందురోజు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ‘గొల్ల రామవ్వ’ నాటికను ప్రదర్శించారు. శాస్త్రీయ శిక్షణతో కూడిన అభినయం, ఆహార్యం, రంగాలంకరణ, రంగోద్దీపనం, ప్రదర్శనకు వన్నె చేకూర్చాయి. దాదాపు నలభైమంది యువకళాకారులు నలభై రోజుల శిక్షణతో ప్రదర్శనకు కృషిచేయడం అభినందనీయం.
నాటిక పేరు: గొల్ల రామవ్వ
మూల కథ: పీవీ నరసింహారావు నాటకీకరణ, దర్శకత్వం: అజయ్ మంకెనపల్లి
సమర్పణ: తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ, క్రియేటివ్ థియేటర్
పాత్రధారులు: అనూష, మనోహర్, సంధ్య, కాళిదాస్, వేణు, ధనుంజయ్, కీర్తన,త్రిష మొదలైనవారు.
…? కె. శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు