(హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)
జరిగిన కథ
సౌగంధికను పంపించి, జయసేనునికి జాగ్రత్తలు చెప్పి, తమ గదికి చేరుకుంటాడు వామదేవుడు. భూగృహం వద్ద బంధించిన యువకుణ్ని చూసిన పోటీసునికి అనుమానం కలుగుతుంది. సాధనానందుని వివరాలు అడుగుతుంది ఆహవసత్తి తర్వాత..
ఆహవసత్తి అడిగిన ప్రశ్నలకు వెంటనే జవాబు చెప్పలేదు సాధనానందుడు.
అందమైన భాణుసత్తిని చూసిన తర్వాత అతని హృదయ మందిరంలో మళ్లీ ప్రేమ మందారాలు వికసించడం మొదలైంది.
‘నాతో ఏదో అనుబంధం ఉండటం వల్లనే భగవంతుడు పదేపదే మమ్ములను కలుపుతున్నాడు. నేను ఆమెను కోరుకున్నట్లే ఆమె కూడా నన్ను కోరుకుంటున్నట్లు నిన్నటి సంభాషణ వల్ల అర్థమయింది. నేను పూర్తిగా శ్రమణకుడిగా మారడానికి ఇష్టపడకపోవడం వెనుక ఇటువంటి మానవాతీతమైన శక్తి ఏదైనా ఉందేమో..’
ఆలోచనల్లో కొట్టుకుంటూ.. జవాబివ్వకుండా చూస్తున్న అతని మీద అనుమానం మరింత బలపడింది ఆహవకు.
“అడుగుతున్నది తమరినే స్వామీ! జవాబు చెప్పరేం?!” కొంచెం వత్తి పలుకుతూ అన్నది.
ఆలస్యం చేస్తే మరిన్ని అనుమానాలకు తావిచ్చినట్లు అవుతుందని నోరు కదిపినాడు అతను..
“అమ్మా! నేనొక దేశ దిమ్మరిని. దొరికిన చోట వేళకింత తిని బతుకు బండి లాగిస్తున్న వాడిని. ఇక పేరు ప్రణాళ.. ప్రణాళానంద!”
“ఆనందనా.. అంటే మీరు బౌద్ధ బిక్షువులా?” వెంటనే అడిగింది వెలుగుతున్న మొహంతో ఆహవసత్తి.
ఇరకాటంలో పడిపోయినాడు సాధనానందుడు. ఒకపక్క అపరాధ భావన; మరొకపక్క ఆనంద శోధన. మధ్యన అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నాడు అతను. ఆహవకు మధ్యేమార్గంగా సమాధానం చెప్పినాడు..
“బౌద్ధం తీసుకోవడానికే బయలుదేరినాను; యోగ్యత కోసం అన్వేషిస్తున్నాను; సాటి మనుషులకు సాయం చేయడం అలవరచుకున్నాను; ఏం చేసినా ఆ బుద్ధ దేవుని దయగా భావిస్తున్నాను!”
“ఎవరితోనే మాట్లాడుతున్నావు?” లోపలి నుండి అంధురాలైన కమల సత్తి అరిచింది.
“నిన్నటి వైద్యుడు వచ్చినాడు అత్తమ్మా! అతనితోనే మాట్లాడుతున్నా!” ఆమెకు వినపడాలని ఆహవసత్తి కూడా బిగ్గరగా అన్నది. అతని కోసమే ఎదురుచూస్తున్న సాలంకృతయైన బంగారు బొమ్మ భాణుసత్తి మరుక్షణం పూలరథంలా పరుగెత్తుకొచ్చి గుమ్మంలో నిలబడి, అతణ్ని చూసి సన్నగా నవ్వింది.
అంత అందం చూసిన సాధనానందుడు మళ్లీ ప్రణాళుడైపోయినాడు.
ముఖము చంద్రబింబ మో సఖియా! కనుల్
కలువలే నిజమ్ము కలికి! రాత్రి
నాల్గు జాములయ్యినను నూరు జాములై
నిదుర కరువు చేసె నీ తలపులు!
(చంద్రబింబం లాంటి ముఖం, కలువల వంటి కన్నులు గల చెలియా! నిన్ను తలుచుకుంటుంటే రాత్రి నిద్దుర పట్టలేదు! నాలుగు జాముల రాత్రి నూరు జాములై రాత్రి గడవడం చాలా కష్టమైంది)’ అనుకున్నాడు.
ఆహవసత్తి మార్చిమార్చి ఇద్దరినీ చూస్తున్నది.
ఏం జరుగుతున్నదో స్పష్టంగా అర్థం కావడం లేదు కానీ, ఏదో జరుగుతున్నట్లు మాత్రం తెలుస్తున్నది.
రాజవైభవం అనుభవించే ఓ గొప్పింటి ఇల్లాలు; దారిన పోయే దానయ్య. ఊరూ పేరూ కూడా సరిగ్గా తెలియని వానితో ఈ అనుబంధాన్ని ఏమనాలి? ఏం జరగబోతోంది..? దీర్ఘాలోచనలో పడిపోయింది ఆహవ.
అధికమైన దుఃఖాన్ని అనుభవించిన మనిషి జీవితం పట్ల విరక్తుడు కావచ్చు. లేదా హృదయం బండబారి దేనికీ చలించని స్థితికి చేరుకోవచ్చు. తట్టుకోలేని సున్నిత మనస్కుడైతే జీవితాన్ని చాలించనూ వచ్చు.
కుసుమ శ్రేష్ఠి పెద్ద వయస్సులో విపరీతమైన ఒత్తిడులకు లోనైనాడు. కళ్లముందే దౌర్జన్యాలు, దాడులు జరిగినాయి; దోపిడి జరిగింది; దహనాలు జరిగినాయి; అపురూపమైన భార్య, అందాల కోడలు ఏమైపోయినారో తెలియదు; కలల సౌధం బుగ్గిపాలయ్యింది; కళ్ల ముందరే తన కొడుకును హింసించారు. ఒక మనిషి అనుభవించడానికి ఇంతకు మించిన దౌర్భాగ్యం ఉంటుందా..!
తిరిగి రాదు వయసు తీవ్రయత్నమునను
నశ్వరమ్ము జీవనము నిజమ్ము!
నిమిష నిమిషముల ననిశ్చితి నెలవాయె!
మనిషి కఠిన మతిగ మారు నేల?
(వయసు మళ్లీ వచ్చేది కాదు. జీవితం అశాశ్వతమైంది. ఏ నిమిషం ఏమి జరుగుతుందో తెలియని స్థితి. ఇవన్నీ తెలిసి కూడా మనిషి కఠినంగా ఎందుకు మారుతాడో తెలియదు)
‘భగవంతుడా! ఎంతో జీవితాన్నిచ్చినావు; మరెంతో సుఖాన్ని, సంతోషాన్ని చవిచూయించినావు; వైభవాన్ని ఇచ్చినావు; రాజులతో సమానమైన గౌరవాన్ని అందించినావు; చివరి దశలో ఇటువంటి చిత్రహింసను అనుభవించేటట్లు చేస్తున్నావు! ఇదంతా నామీద పగబట్టి నీవు పీడిస్తున్నావు అనుకునే అజ్ఞానిని కాదు! కర్మఫలం అనుభవిస్తున్నానని సరిపెట్టుకుంటాను. నా కుటుంబాన్ని ఎందుకింతగా హింసిస్తున్నావు ప్రభూ! దయచేసి నా వాళ్లకు అన్యాయం జరగకుండా చూడు! నా భార్య గానీ, కుమారుడు గానీ, కొత్తగా వచ్చిన కోడలు పిల్లగానీ పదిమందికి మేలుచేసే బుద్ధిగల వాళ్లే కానీ.. కలలో కూడా ఇతరుల కీడెంచని వాళ్లు. మా సేవక పరివారం కూడా ఎంతో విశ్వసనీయులు. ఎవ్వరికీ హాని కలుగనీయకు స్వామీ..!’ అని మనసులోనే అనుకున్నాడు శ్రేష్ఠి.
అతని ముందు వడ్డించి ఉంచిన విస్తరిలోని ఆహారం ముట్టుకోకుండా ధారాపాతంగా కన్నీరు కారుస్తున్న కుసుమ శ్రేష్ఠిని అటుగా వెళ్తున్న
భటుడొకడు చూసినాడు. గబుక్కున ఆ గదిలోకి ప్రవేశించినాడు.
“ఓ పెద్దయ్యా! ఏడిస్తే కడుపు నిండుతుందా? జరిగే పరిణామాలకు నీ కన్నీరు అడ్డుకట్ట కడుతుందా? ఇది జీవితం! ఇక్కడ ఏదైనా జరుగుతుంది. ఈ రోజు నవ్వు.. రేపు ఏడుపుగా మారవచ్చు. ఈరోజు దుఃఖం రేపటి సంతోషం కావచ్చు.. తిను పెద్దయ్యా!” అంటూ చొరవగా విస్తరిలోని అన్నం కలిపి, ముద్ద నోటికి అందించినాడు.
అంతసేపు ఏదో లోకంలో ఉండి కలగంటున్నట్లు భావిస్తున్న కుసుమ శ్రేష్ఠి హఠాత్తుగా ఆ భటుణ్ని గుర్తించినాడు! ఆనందం పట్టలేక..
“జయా..” అనబోయినాడు.
అది ముందుగానే ఊహించిన ఆ రాజభటుడు అతని నోట్లో నుంచి శబ్దం రాకుండా అన్నం ముద్ద పెట్టినాడు.
అమితమైన ఆనందం కారణంగా మెదడులో ఏర్పడ్డ స్తబ్దత నుండి విముక్తి లభించింది కుసుమ శ్రేష్ఠికి. ఇన్నాళ్లు మూగబోయిన గొంతుక.. కొడుకును చూసిన సంతోషంతో కోయిలై గంతులు వేయడానికి సిద్ధపడింది. కానీ, భటుని రూపంలో ఉన్న జయసేనుడు తండ్రికి చేరువగా వెళ్లి, అతని చెవిలో..
“నాన్నా! మరికొన్ని రోజులు ఓపిక పట్టాలి. నాతోపాటు ఇప్పుడు వామదేవుడు కూడా కోటలోనే ఉన్నాడు. మీరు భయపడవలసిన పనిలేదు. పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతున్నాయి. మీరు నిశ్చింతగా ఉండండి! మీకు మాటలు వచ్చిన విషయం; మీరు నన్ను చూసిన సంగతి కూడా ఇప్పుడే ఎవరికీ తెలియనివ్వకూడదు!” హెచ్చరిస్తున్నట్లు అన్నాడు.
కుసుమ శ్రేష్ఠి దుఃఖం ఆనంద స్రవంతిగా మారుతుండగా..
“నాయనా! జయా! ఒక్క పని మాత్రం చేయకుండా నన్ను అడ్డుకోవద్దు!” అంటూనే అన్నం ముద్ద కలిపి, కొడుకుకు ప్రేమతో తినిపించినాడు.
సరిగ్గా అప్పుడే అక్కడికి ఈసాణుడు వచ్చినాడు.
అవణాయరు మందిరం పక్కనున్న గదిలో..
“చెప్పు! మీ అత్తా కోడళ్లు కలిసి నన్ను చంపేయాలని అనుకున్నారు కదా!” సౌగంధిక మీద అరుస్తున్నాడు అవణాయరు.
సమాధానం చెప్పలేక సతమతమవుతున్నది ఆమె. సరిగ్గా అప్పుడే రంగప్రవేశం చేసినాడు వామదేవుడు.
“ప్రభూ! ప్రభూ! నా కోడలిని ఏమీ అనకండి” అంటూ గబగబా దగ్గరకు చేరి..
“మీకు అసలు సంగతి చెప్తా!” అని
అవణాయరు చెవిలో ఏదో ఊదినాడు.
దేవి వెచ్చని స్పర్శ అతనిలో సానుకూల
స్పందనలను పెంపొందించింది.
అదే అదనుగా కోడలి వైపు చూసి..
“ఏయ్ పిల్లా! ప్రభువుల వారి కోసం మధురమైన పాయసం చేసుకుని తీసుకొని రా పో!” అని అక్కడి నుంచి పంపించినాడు.
నెమ్మదిగా తలకు వట్టివేళ్ల అత్తరు కలిపిన కొబ్బరి నూనెతో మర్దన చేస్తూ, మాటలు కలిపినాడు దేవి రూపంలో ఉన్న వామదేవుడు.
“నిజమే ప్రభూ! ఒక పెద్ద తప్పిదం జరిగిపోయింది. రాత్రి మీకు పాలలో మత్తు పదార్థం కలిపి ఇవ్వడం జరిగింది!” అన్నది దేవి నొచ్చుకుంటూ.
“అదే సంగతి నేను నీ కోడలితో అంటున్నాను. నామీద..”
“విష ప్రయోగం కాదు ప్రభూ! మిశ ప్రయోగం!” అన్నాడు అడ్డుకుంటూ.
“ఏందీ? మిశ ప్రయోగమా? అంటే..?” ఆశ్చర్యంగా అడిగినాడు అవణాయరు.
“ఏదో ఒక మిశతో మనం కలుసుకునే ఏర్పాటు చేసుకోవడమే మిశ ప్రయోగం!” హొయలొలుకుతూ వివరించింది దేవి (వామదేవుడు).
“అంటే..???” అర్థం కాలేదన్నట్లు అన్నాడు అవణాయరు.
“ఆఁ.. చిలిపి! అన్నీ తెలిసే అడుగుతారు!” గట్టిగా బుగ్గ గిల్లింది.
పంటి బిగువున బాధను అణుచుకుంటూ..
“నిజంగా దేవీ! నాకు అర్థం కాలేదు. కొంచెం వివరంగా చెప్పు” అన్నాడు.
కమిలిన బుగ్గను సుతారంగా రుద్దుతూ..
“మరేం లేదు ప్రభూ! కోడలు పిల్ల వయసులో చిన్నది. ఈ వయసులో మనం సరసరస గంగలో ఓలలాడుతూండటం అది విన్నా, చూసినా బాగుండదు కదా! అందుకే దాన్ని బజ్జోబెట్టి మనం మన పని నిరాటంకంగా పూర్తి చేసుకోవచ్చు అనుకున్నా..”
“మరి నాకెందుకు మత్తు ఇచ్చినావు..” ఏడుపు మొహం పెట్టినాడు అవణాయరు.
నెత్తిమీద గట్టిగా మొట్టింది దేవి.
దెబ్బకి చుక్కలు కనిపించినాయి అవణాయరుకు.
“ఏదీ పూర్తిగా వినరా ప్రభూ..” అంటూ రాగాలాపన చేసింది దేవి.
అతని కళ్లల్లో నీళ్లు తిరిగినాయి.
“సరసం..” నవ్వుతూ అంది దేవి.
“ఇదే సరసం కదా తమరు కోరుకునేది..” అన్నది మళ్లీ.
అంగట్లో చెంప మీద కొట్టించుకున్న సంఘటన గుర్తుకొచ్చింది అవణాయరుకు. నోరు మెదపలేదు.
“మత్తుమందు నీకు ఇయ్యలేదు ప్రభూ! అది కోడలు పిల్ల కోసం ఏర్పాటు చేసింది..”
దేవి మాట పూర్తిగాకుండానే అవణాయరు..
“ఓహో దానికి ఇవ్వాల్సింది పొరపాటున నాకు ఇచ్చినా వన్నమాట!” అన్నాడు తానంతా గ్రహించేసినానన్న సంతోషంతో.
‘ఇది గ్రహించడానికి ఇంత సమయమారా మట్టిబుర్రా!’ అని మనసులో అనుకొని, పైకి మాత్రం..
“ప్రభూ! బుద్ధిలో తమరు బృహస్పతిని మించినారు! నేను చెప్పకుండానే సర్వం గ్రహించినారు!” అన్నది మెచ్చుకోలుగా.
సంబర పడిపోయినాడు అవణాయరు.
“ఇటువంటి మిశ ప్రయోగాలు అప్పుడప్పుడూ చేయవలసి వస్తుంది ప్రభూ! మీరు కంగారు పడిపోయి ఎవరికైనా చెప్పినా, ఏదైనా చేయాలనుకున్నా.. నా ఆలోచనలన్నీ తలకిందులు అయిపోతాయి! మన శృంగార జీవితం రసభంగమై, శృంగభంగం అయిపోతుంది. ఇవన్నీ మీరు మనసులోనే పెట్టుకొని, మన సుఖం కోసం తోడ్పడాలి!” బతిమిలాడుతున్నట్లు అన్నది దేవి.
“అవునవును ఇవన్నీ మనం ముందుగా అనుకొని ఉంటే ఇటువంటి అనుమానాలు కలిగేవి కావు..”
మళ్లీ ఒక మొట్టికాయ వేసింది దేవి.
మళ్లీ చుక్కలు కనిపించినాయి అవణాయరుకు.
“మళ్లీ ఎందుకు కొట్టినావు?” అవణాయరు బుంగమూతి.
“సరసం.. ప్రణయసరసం..” దేవి నవ్వు.
“ఆఁ..” ఆశ్చర్యం, బాధ.. అవణాయరులో.
“ఆఁ.. సరసంలో.. ముందు అనుకొని చేయడాలు ఉండవు ప్రభూ! అప్పటికప్పుడు కలిగిన ఆలోచనలు ఎప్పటికప్పుడు ఆచరణలో పెట్టడమే!” అన్నది నవ్వుతూ దేవి. అప్పుడే పాలు తీసుకుని వచ్చింది సుద్ది (సౌగంధిక). అందులో అవణాయరును నిద్రపుచ్చే మత్తు పదార్థం ఉందన్న విషయం ఆయనకు ఎంత మాత్రమూ తెలియదు.
(సశేషం)
– దోరవేటి 89788 71961