హైదరాబాద్, ఆట ప్రతినిధి : నార్త్ అమెరికాలో జరిగిన సీఆర్ఏ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో తెలుగు యువ రేసర్ సాయిదీప్ విజేతగా నిలిచాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన రేసులో ప్రత్యర్థులకు దీటుగా రాణిస్తూ సాయిదీప్ 400జీటీ, 400 సూపర్‌బైక్ విభాగాల్లో అగ్రస్థానాల్లో నిలిచాడు. చాంపియన్‌షిప్‌లో మరో మూడు రేసులు మిగిలుండగానే సాయిదీప్ అద్భుత ప్రదర్శనతో ప్రస్తుతం టాప్‌లో కొనసాగుతున్నాడు.
ఎమ్ఎస్డీ రేసింగ్-నార్త్ కాలిఫోర్నియా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సాయిదీప్ తన విజయంపై స్పందిస్తూ ‘ఈ సీజన్లో మెరుగ్గా రాణించడం చాలా సంతోషంగా ఉంది. పోటీ తీవ్ర ఉత్కంఠ మధ్య సాగింది. రెండు చాంపియన్‌షిప్‌లలో టాప్‌లో కొనసాగుతుండటం గర్వంగా ఉంది. వరుసగా మూడోసారి పోడియం ఫినిష్ చేయబోతున్నందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నాడు. సీఆర్ఏ రేసింగ్ చివరి దశకు చేరుకోగా, ఈనెల 27 నుంచి 29 వరకు కాలిఫోర్నియాలో చివరి అంచె పోటీలు జరుగనున్నాయి.