Fan gets RCB Captain SIM : క్రికెటర్లకు వీరాభిమానులు చాలామందే ఉంటారు. తమ అభిమాన ఆటగాళ్లను స్టేడియంలో చూసి మురిసిపోయేవాళ్లు కొందరైతే.. మరికొందరు భద్రతా వలయాన్ని దాటి మైదానంలోకి పరుగెత్తుతూ వెళ్లి తమ హీరోను హగ్ చేసుకుంటారు. అంతేతప్ప వాళ్ల ఫోన్ నంబర్‌గానీ, వాళ్లతో ముఖాముఖిగానీ సాధ్యం కావు. కానీ, ఒక కుర్రాడు మాత్రం ఏకంగా విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్లతో నేరుగా వాట్సాప్‌లో సందేశాలు పంపాడు. మారుమూల పల్లెటూరుకు చెందిన అతడికి ఇదంతా ఎలా సాధ్యమైందంటే..?
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మనిష్ బిసి (Manish Bisi) ఒకరోజు తమ ప్రాంతంలోని మొబైల్ దుకాణంలో ఒక సిమ్ కార్డు కొన్నాడు. ఆ సిమ్ నంబరే అతడికి క్రికెట్ దిగ్గజాలతో మాట్లాడే అవకాశం కల్పించింది. ఇంతకూ ఆ నంబర్ ఎవరిదంటే.. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్‌గా ఉన్న రజత్ పాటిదార్(Rajat Patidar)ది. మనిష్ తన స్నేహితుడు ఖెమ్రాజ్ సాయంతో వాట్సా్ప్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. తీరా.. ప్రొఫైల్ ఫొటో చూస్తూ రజత్ పాటిదార్‌ది ఉంది. అయితే.. అతడు సరేలే అని అనుకున్నాడు. కానీ, ఆర్సీబీ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, యశ్ దయాల్.. తదితరుల పేర్లతో నుంచి తనకు సందేశాలు రావడంతో మనిష్ సంతోషం పట్టలేకపోయాడు. రెండు వారాలు అతడు తన స్నేహితుడితో కలిసి క్రికెట్ స్టార్లతో చిట్‌చాట్ చేశాడు. అయితే.. బదులిచ్చే క్రమంలో అతడు వాడిన భాష చూసి ఆర్సీబీ ఆటగాళ్లకు అనుమానం వచ్చింది.
☎️ Man gets calls from Virat Kohli & AB de Villiers after SIM mix-up in Gariaband district, Chattisgarh. 🤯🏏
💬 The man bought new SIM and on activating WhatsApp, it displayed RCB captain Rajat Patidar’s photo.
🔁 Patidar’s old number Reassigned to him. pic.twitter.com/RXJ2fwRMBK
— Dr. Aniket Sakhare 𝕏 (@meaniketsakhare) August 10, 2025
ఇదే విషయం పాటిదార్ దృష్టికి రాగా.. అతడు మధ్యప్రదేశ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో, రంగంలోకి దిగిన సైబర్ సెల్ టీమ్ త్వరగానే మనిష్ జాడను కనిపెట్టింది. టెలికామ్ నిబంధనల ప్రకారం ఆ నంబర్‌ను మళ్లీ యాక్టివేట్ చేసి.. అమ్మినట్టు సైబర్ బృందం గ్రహించింది. ఇదే విషయంపై గరియబంద్ ఎస్పీ మాట్లాడుతూ.. ‘కంపెనీ నిబంధనల ప్రకారం ఒక సిమ్ నంబర్‌ను ఆరు నెలలు నిరుపయోగంగా ఉంచుతారు. ఆ తర్వాత కొత్త వినియోగదారులకు ఆ నంబర్‌ను కేటాయిస్తారు. ఇప్పుడు ఆ సిమ్‌ను మళ్లీ పాటిదార్‌కే అందజేశాం’ అని వెల్లడించాడు. ఎట్టకేలకు సమస్య పరిష్కారం కావడంతో ఆర్సీబీ సారథి ఊపిరిపీల్చుకున్నాడు. ఐపీఎల్ 18వ సీజన్లో ఆర్సీబీ సారథిగా వ్యవహరించిన పాటిదార్ తమ జట్టు టైటిల్ కరువు తీర్చాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన బెంగళూరు తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది.