WPL | వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో ఈ టోర్నీలోనే భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ.. రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఢిల్లీ నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలోనే దంచేసింది. బెంగళూరు సారథి స్మృతి మంధాన (47 బంతుల్లో 81, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతోమెరుపులు మెరిపించగా హాడ్జ్ (33 బంతుల్లో 42, 7 ఫోర్లు) ధాటిగా ఆడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 19.3 ఓవర్లలో 141 పరుగులే చేసింది. రోడ్రిగ్స్ (34) టాప్ స్కోరర్. రేణుకాసింగ్ (3/23), వర్హెమ్ (3/25) ఢిల్లీ బ్యాటర్లను కట్టడిచేశారు.
స్వల్ప ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్లు మంధాన, వ్యాట్ హాడ్జ్ దంచికొట్టడంతో లక్ష్యం మరింత చిన్నదైంది. కాప్ మొదటి ఓవర్లోనే రెండు బౌండరీలు బాదిన మంధాన మిన్ను మణి 3వ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టింది. శిఖా 4వ ఓవర్లో వ్యాట్ సైతం బ్యాక్ టు బ్యాక్ బౌండరీలతో అలరించింది. ఈ ఇద్దరి జోరుతో 5 ఓవర్లకే ఆ జట్టు స్కోరు 50 పరుగుల మార్కును దాటింది. అదే జోరును కొనసాగిస్తూ ఈ ద్వయం బౌండరీల వర్షం కురిపించింది. 27 బంతుల్లోనే మంధాన అర్ధ సెంచరీ పూర్తిచేసింది. వ్యక్తిగత స్కోరు 34 పరుగల వద్ద వ్యాట్ ఇచ్చిన క్యాచ్‌ను జెమీమా జారవిడిచినా మళ్లీ 11వ ఓవర్లో రన్నింగ్ క్యాచ్‌తో 107 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. బెంగళూరు విజయానికి 9 పరుగుల దూరంలో మంధాన ఔట్ అయినా పెర్రీ (7 నాటౌట్), రిచా (11 నాటౌట్) లాంఛనాన్ని పూర్తిచేశారు.
ఢిల్లీ: 19.3 ఓవర్లలో 141 ఆలౌట్ (జెమీమా 34, సారా 23, రేణుకా 3/23, వర్హెమ్ 3/25); బెంగళూరు: 16.2 ఓవర్లలో 146/2 (మంధాన 47 బంతుల్లో 81, వ్యాట్హాడ్జ్ 42, అరుంధతి 1/25, శిఖా 1/27)