GGT vs DCW | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. గత మూడు మ్యాచ్‌లలో బౌలింగ్‌లో విఫలమైన గుజరాత్ జెయింట్స్ ఈ మ్యాచ్‌లోనూ 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 138 పరుగుల వద్దే ఆగిపోయింది. ఫలితంగా ఢిల్లీ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. దీంతో ఈ సీజన్లో గుజరాత్ ఓటమి పరంపర కొనసాగినట్టయ్యింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెరుపు ఆరంభమే దక్కింది. ఓపెనర్ షఫాలీ వర్మ 9 బంతులే ఆడినా ఓ సిక్సర్, ఓ బౌండరీ సాయంతో 13 పరుగులు చేసి ఔట్ అయింది. వన్ డౌన్లో వచ్చిన అలీస్ క్యాప్సీ ఆ ఊపును కొనసాగించింది. కెప్టెన్ మెగ్‌లానింగ్ (41 బంతుల్లో 55, 6 ఫోర్లు, 1 సిక్స్) కూడా వేగంగా పరుగులు రాబట్టడంతో ఢిల్లీ స్కోరు పరుగులెత్తింది. అయితే పరుగులు వస్తున్నా కీలక సమయంలో ఢిల్లీ మూడు వికెట్లు కోల్పోయింది. మేఘనా సింగ్.. ఢిల్లీని వరుస ఓవర్లలో దెబ్బతీసింది. ధాటిగా ఆడుతున్న క్యాప్సీని మేఘనా.. ఏడో ఓవర్లో ఆఖరి బంతికి ఔట్ చేసింది. 40 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న లానింగ్.. మేఘనా వేసిన 13వ ఓవర్లో మూడో బంతికి పెవిలియన్ చేరింది. ఈ సీజన్లో మెప్పించలేకపోతున్న జెమీమా రోడ్రిగ్స్ (7) మరోసారి నిరాశపరిచింది. మన్నత్ కశ్యప్ వేసిన 14వ ఓవర్లో మొదటి బంతికే రోడ్రిగ్స్.. పఠాన్‌కు క్యాచ్ ఇచ్చింది. కీలక బ్యాటర్లు అంతా వెనుదిరిగినా అన్నాబెల్ సదర్లండ్ (12 బంతుల్లో 20, 2 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడటంతో ఢిల్లీ స్కోరు ఈజీగా 180 ప్లస్ దాటుతుందని అనిపించింది. కానీ గుజరాత్ బౌలర్లు ఢిల్లీకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అన్నాబెల్‌ను తనూజా ఔట్ చేయగా జొనాసెన్ (11), అరుంధతి రెడ్డి (5)ని గార్డ్నర్ ఔట్ చేసి ఢిల్లీ భారీ ఆశలపై నీళ్లు చల్లింది. ఆఖర్లో శిఖా పాండే (8 బంతుల్లో 14 నాటౌట్, 2 ఫోర్లు) రెండు బౌండరీలు బాది ఢిల్లీ స్కోరును 160 దాటించింది.
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ పరుగులు తీయడంలో తడబడింది. ఆప్లే గార్డెనర్ (40) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా 25 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొంది.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇక గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో అట్టడుగన నిలబడింది.