లిమా: ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. పెరు రాజధాని లిమాలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ మెగాటోర్నీలో 14 పతకాలు (6 స్వర్ణాలు, 6 రజతాలు, 2 కాంస్యాలు) సాధించిన భారత్.. పతకాల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. నాలుగు స్వర్ణాలు కైవసం చేసుకున్న అమెరికా రెండో స్థానంలో ఉంది. టోక్యో ఒలింపిక్స్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన స్టార్ షూటర్ మనూ బాకర్.. ఈ టోర్నీలో మూడు బంగారు పతకాలతో సత్తా చాటగా.. 10 మీటర్ల పిస్టల్ విభాగంలో పతకాలన్నింటినీ మన షూటర్లే కైవసం చేసుకున్నారు. సోమవారం భారత షూటర్లు 25 మీటర్ల పిస్టల్ విభాగంలో బరిలోకి దిగనున్నారు.