కరాచీ: తాజా మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (395 బంతుల్లో 200 నాటౌట్; 21 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ డబుల్ సెంచరీతో చెలరేగడంతో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టుపై న్యూజిలాండ్ పట్టు బిగించింది. ఆతిథ్య పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేయగా.. కేన్ మారథాన్ ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ 612/9 వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి 174 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. పాకిస్థాన్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 5, నౌమాన్ అలీ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది.