Usman Khawaja : పెర్త్ టెస్టులో నల్ల రిబ్బన్ ధరించి ఐసీసీ(ICC) ఆగ్రహానికి గురైన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja)కు రోజురోజుకు మాజీ క్రికెటర్లు మద్దతు పెరుగుతోంది. తాజాగా వెస్టిండీస్ దిగ్గజం మైఖేల్ హోల్డింగ్(Michael Holding) ఐసీసీ తీరును తప్పుబట్టాడు. ఖవాజా విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తోందని హోల్డింగ్ అన్నాడు.
‘ఐసీసీలో నైతిక విలువల ప్రమాణాలు పడిపోయాయి. ఖవాజా విషయంలో ఐసీసీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది. గతంలో ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్'(Black Lives Matters) క్యాంపెయిన్‌కు క్రికెటర్లు మోకాళ్లపై నిల్చొని సానుభూతి తెలిపేందుకు ఐసీసీ అంగీకరించింది. ఎల్జీబీటీ(LGBT)లకు మద్దతుగా స్టంప్స్‌ను రెయిన్బో రంగుల్లోకి మార్చింది. కానీ, పాలస్తీనాకు సపోర్టుగా నల్ల రిబ్బన్ ధరించాడని ఖవాజాను టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉంద’ని హోల్డింగ్ ఐసీసీ తీరును నిలదీశాడు.
పెర్త్‌లో పాకిస్థాన్(Pakistan)తో జరిగిన తొలి టెస్టులో ఖవాజా భుజానికి నల్ల రిబ్బన్(Black Ribbon) ధరించి బ్యాటింగ్ చేశాడు. అయితే.. క్రికెట్ ఆస్ట్రేలియా, ఐసీసీ అనుమతి తీసుకోకుండా ఖవాజా నల్ల రిబ్బన్ ధరించడాన్ని ఐసీసీ తప్పుబట్టింది. అంతర్జాతీయ మ్యాచుల్లో ఐసీసీ నియమాల(ICC Rules)కు విరుద్ధంగా వ్యవహరించాడనే కారణంతో ఈ ఓపెనర్‌పై చర్యలకు ఉపక్రమించింది. ‘ఐసీసీ ప్లేయింగ్ కండీషన్స్ పేజీలో రాసున్న క్రికెటర్ల దుస్తులు, వస్తువుల నియంత్రణకు సంబంధించిన క్లాజ్ ‘ఎఫ్’ను ఖవాజా ఉల్లంఘించాడు. తొలి టెస్టులో బ్లాక్ రిబ్బన్ ద్వారా అతడు వ్యక్తిగత మెసేజ్‌ను ప్రదర్శించాడు’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఐసీసీ నియమ నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా ఆటగాళ్లు ఏదైనా మెసేజ్‌నుజెర్సీలు, బ్యాటుపై లేదా షూ, రిబ్బన్ బ్యాండ్ల ద్వారా ప్రదర్శించడం నేరం. ఈ నియమాల్ని అతిక్రమిస్తే ఐసీసీ చర్యలు తీసుకుంటుంది. ఖవాజా ఈ మధ్య పలు సందర్భాల్లో తన షూ మీద.. ‘ఫ్రీడం అనేది మానవుల హక్కు’, ‘అందరి జీవితాలు సమానమే’ వంటి మెసేజ్‌లతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. స్వదేశంలో పాక్‌తో జరిగిన తొలి టెస్టులో ఖవాజా తొలి ఇన్నింగ్స్‌లో 41, రెండో ఇన్నింగ్స్‌లో 90 పరుగులతో అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 360 పరుగుల భారీ తేడాతో గెలుపొంది 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్టు డిసెంబర్ 26న మెల్బోర్న్లో జరుగనుంది.