టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వారి జాబితాలో అండర్సన్ (167) నాలుగో స్థానానికి చేరాడు. సచిన్ (200), పాంటింగ్ (168), స్టీవ్ వా (168) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్‌కే చెందిన స్టువర్ట్ బ్రాడ్ (150) టాప్-10లో అడుగుపెట్టాడు. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి 10 మందిలో వీరిద్దరు మాత్రమే పేస్ బౌలర్లు ఉండటం విశేషం.
అడిలైడ్: విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (95), వన్‌డౌన్ ఆటగాడు మార్నస్ లబుషేన్ (95 బ్యాటింగ్) సత్తాచాటడంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ రెండో టెస్టు (డే అండ్ నైట్)లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కలిసిన కారణంగా ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ మ్యాచ్‌కు దూరమవగా.. వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. గతంలో ఆస్ట్రేలియాకు రెగ్యులర్ కెప్టెన్‌గా వ్యవహరించిన స్మిత్ బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో కెప్టెన్సీ కోల్పోయిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి టెస్టు నెగ్గి 1-0తో ఆధిక్యంలో ఉన్న ఆసీస్.. గురువారం ప్రారంభమైన గులాబీ టెస్టులో శుభారంభం చేసింది. మార్కస్ హారిస్ (3) విఫలమైనా.. వార్నర్, లబుషేన్ రాణించారు. ఇంగ్లండ్ పాతకాపులు జేమ్స్ అండర్సన్ (0/29), స్టువర్ట్ బ్రాడ్ (1/34) నిప్పులు చెరుగుతున్నా.. ఏ మాత్రం వెనక్కి తగ్గని ఆసీస్ జోడీ.. రెండో వికెట్‌కు 172 పరుగులు జోడించింది. ప్రస్తుతం లబుషేన్‌తో పాటు స్టీవ్ స్మిత్ (18) క్రీజులో ఉన్నాడు.
బుధవారం రాత్రి ఓ రెస్టారెంట్లో భోజనం చేసేందుకు వెళ్లిన పాట్ కమిన్స్ అక్కడ.. కొవిడ్-19 పాజిటివ్ వ్యక్తిని కలిశాడు. దీంతో మ్యాచ్‌కు మూడు గంటల ముందు కమిన్స్ రెండో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది.
నెల రోజుల వ్యవధిలో ఆస్ట్రేలియా జట్టుకు ముగ్గురు కెప్టెన్లుగా వ్యవహరించడం గమనార్హం. ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ఆరంభానికి ముందు టిమ్ పైన్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోగా.. అతడి స్థానంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పాట్ కమిన్స్‌కు పగ్గాలు అప్పగించింది. తాజాగా కొవిడ్-19 ప్రొటోకాల్స్ నేపథ్యంలో కమిన్స్ రెండో టెస్టుకు దూరమవడంతో అతడి స్థానంలో స్మిత్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.
అడిలైడ్ ఓవల్ మైదానంలో బంతి స్వింగ్‌కు సహకరిస్తున్న సమయంలో ఇంగ్లండ్ పేసర్లు రెచ్చిపోతున్నా.. ఆసీస్ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఆరంభంలోనే హారిస్ వికెట్ కోల్పోయిన ఆసీస్ ఆ తర్వాత ఆచితూచి ముందుకు సాగింది. ఈ క్రమంలో లబుషేన్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను వికెట్ కీపర్ బట్లర్ వదిలేయగా.. తొలి టెస్టులో తృటిలో శతకం చేసే అవకాశం జారవిడుచుకున్న వార్నర్‌కు ఈ మ్యాచ్‌లోనూ నిరాశ తప్పలేదు.
గతంలో ఆసీస్ జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా వ్యవహరించిన స్మిత్ మళ్లీ మూడేండ్ల తర్వాత అనూహ్యంగా జట్టు పగ్గాలు అందుకున్నాడు. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో జట్టు పగ్గాలతో పాటు ఏడాది ఆటకు దూరమైన స్మిత్.. చాన్నాళ్ల తర్వాత కెప్టెన్సీ గ్రూప్‌లో చోటు దక్కించుకోగలిగాడు. ప్రస్తుత యాషెస్ సిరీస్‌కు స్మిత్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. కమిన్స్ దూరమవడంతో ఎట్టకేలకు మూడేండ్ల తర్వాత స్మిత్‌కు కంగారూలను నడిపించే చాన్స్ దక్కింది.