మిచెల్ స్టార్క్..పేస్ బౌలింగ్‌కు పెట్టింది పేరు. మేటి బ్యాటర్లను తన స్వింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ఘనుడు. ఫార్మాట్ ఏదైనా వికెట్ల వేట కొనసాగించడంలో ఈ ఆస్ట్రేలియా స్టార్ పేసర్ సిద్దహస్తుడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. నాణానికి మరోవైపు అన్నట్లు స్టార్క్..ఐపీఎల్ ప్రదర్శన ముక్కున వేలేసుకునేటట్లు ఉంది. అవును అసలు పేసర్లకే కరువు ఉన్నట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్ మేనేజ్మెంట్ గత ఐపీఎల్ వేలంలో రికార్డులు బద్దలు కొడుతూ స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఎవరూ ఊహించని విధంగా మిగతా ఫ్రాంచైజీలతో పోటీపడుతూ స్టార్క్‌ను కండ్లు చెదిరే మొత్తానికి దక్కించుకుంది. ఇంత మొత్తాన్ని ఈ ఆసీస్ పేసర్ కూడా ఊహించి ఉండడు. బంపర్ లాటరీ తగిలినట్లు తొమ్మిదేండ్ల మళ్లీ ఐపీఎల్ బరిలోకి దిగిన స్టార్క్ పెట్టిన రేటుకు ఏ మాత్రం న్యాయం చేయకుండా పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు.
ఈ నెల 23న ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఈ లెఫ్టార్మ్ స్పీడ్‌స్టర్ నాలుగు ఓవర్లు వేసి ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. గల్లీ స్థాయి బౌలర్లా కనిపించిన స్టార్క్‌ను హైదరాబాద్ బ్యాటర్లు ఉతికి ఆరేశారు. తన రీఎంట్రీ మ్యాచ్‌లోనే స్టార్క్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కేకేఆర్ ఏరికోరి తెచ్చుకున్న బౌలర్ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం కేకేఆర్ ఫ్యాన్స్‌కు రుచించలేదు. దీనికి కొనసాగింపు అన్నట్లు ఆర్సీబీతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ స్టార్క్ 47 పరుగులు ఇచ్చి నిరాశపరిచాడు. స్టార్క్ బౌలింగ్‌లో కోహ్లీ ఆన్‌సైడ్‌లో కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. మొత్తంగా రెండు మ్యాచ్‌ల్లో 8 ఓవర్లు వేసిన స్టార్క్ ఒక్క వికెట్ తీయకుండా 100 పరుగులు ఇచ్చుకున్నాడు. ఐపీఎల్లో స్టార్క్ ప్రదర్శనపై సోషల్‌మీడియాలో సెటైర్లు, మీమ్స్‌కు లెక్కలేకుండా పోయింది.