Virat Kohli | టీం ఇండియా సారధి విరాట్ కోహ్లీ మరో రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు. అదీ కూడా ప్రస్తుతం జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నమోదు చేసిన రికార్డును అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కేప్‌టౌన్‌లో మంగళవారం నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ మరో 14 పరుగులు చేస్తే అధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ జాబితాలో రెండో స్థానంలో నిలువనున్నాడు. మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. దక్షిణాఫ్రికాలో 15 టెస్ట్‌ల్లో 1,161 పరుగులు చేశాడు. టీం ఇండియా క్రికెటర్లలో అందరికంటే ముందు ఉన్నాడు. సచిన్ రికార్డులో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
రాహుల్ ద్రావిడ్ 11 టెస్ట్‌లు ఆడి 624 పరుగులు చేశాడు. ఇప్పటివరకు సచిన్ తర్వాత స్థానం రాహుల్ ద్రావిడ్దే. కానీ విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు సఫారీల గడ్డపై కేవలం ఆరు టెస్ట్ మ్యాచ్‌ల్లోనే 611 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వాటిలో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
రెండో టెస్ట్‌లో వెన్నునొప్పి వల్ల ఆడలేకపోయిన కోహ్లీ మూడో టెస్ట్‌కు అందుబాటులో ఉండే చాన్స్ ఉంది. కేప్‌టౌన్‌లో మూడో టెస్ట్ కోసం తాజాగా ఆయన నెట్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్, దక్షిణాఫ్రికా చెరో టెస్ట్ మ్యాచ్ గెలుచుకున్నాయి. సిరీస్ కైవశం చేసుకోవాలంటే రెండుజట్లకు ఈ మ్యాచ్ కీలకం కానున్నది.