అమ్మాయిల పొట్టి పోరు ముగిసింది..ఇక అబ్బాయిల వంతు మిగిలింది. మూడు రోజుల వ్యవధిలో ఐపీఎల్-17వ సీజన్‌కు అట్టహాసంగా తెరలేవబోతున్నది. నెలన్నర రోజులు అభిమానులకు పసందైన విందు అందించేందుకు ఫ్రాంచైజీలు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నాయి. ఓవైపు సార్వత్రిక ఎన్నికల శంఖారావం మొదలైతే..మరోవైపు ఐపీఎల్ ఫీవర్ దేశాన్ని ఓ ఊపు ఊపనుంది. విరామం తర్వాత విరాట్ కోహ్లీ ఆర్సీబీ క్యాంప్‌లో అడుగుపెడితే..కేఎల్ రాహుల్ ఫిట్నెస్ పరీక్షలో పాసయ్యాడు. రోహిత్ మద్దతుతో ముంబైని ముందుకు నడిపిస్తానని కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పుకొస్తున్నాడు.
IPL | బెంగళూరు: ఐపీఎల్ సమరానికి సమయం ఆసన్నమైంది. రాయ ల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయంతో అమ్మాయిల ఐపీఎల్ అట్టహాసంగా ముగియగా, అబ్బాయిల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. ముంబై, చెన్నై రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్‌ను దక్కించుకుంటాయా లేక..ఆర్సీబీ కప్ కల నెరవేరుతుందా.. ఢిల్లీ, పంజాబ్, లక్నో కప్‌ను ముద్దాడుతాయా? కోల్‌కతా, రాజస్థాన్, హైదరాబాద్ టైటిల్‌పై కన్నేసాయా అన్నది తేలనుంది.
కోహ్లీ ప్రాక్టీస్:
ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్న విరాట్.. తాజాగా ఆర్సీబీ ప్లేయర్లతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. సోమవారం సహచర క్రికెటర్లతో కలిసి విరాట్ వామప్ చేశాడు. ఆర్సీబీ అమ్మాయిలు టైటిల్ గెలువడంతో ఈసారి అబ్బాయిలపై ఒత్తిడి నెలకొంది.
రాహుల్ ఫిట్:
లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫిట్నెస్ పరీక్ష పాసయ్యాడు. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) సోమవారం రాహుల్‌కు లైన్‌క్లియర్ చేసింది. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు సందర్భంగా గాయపడ్డ రాహుల్ మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే గాయం నుంచి తేరుకున్నప్పటికీ కొన్ని మ్యాచ్‌ల వరకు వికెట్‌కీపింగ్ చేయవద్దని రాహుల్‌కు ఎన్సీఏ వాళ్లు సూచించారు. ఈ నెల 24న తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌తో లక్నో తలపడుతుంది.
రాహుల్ మద్దతుతో:
మాజీ కెప్టెన్ రోహిత్‌శర్మ మద్దతుతో ముందుకెళ్తానని ముంబై ఇండియన్స్ నూతన సారథి హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. సోమవారం ప్రమోషన్ ఈవెంట్లో కోచ్ మార్క్ బౌచర్‌తో కలిసి పాండ్యా పాల్గొన్నాడు. ‘ముంబైకి మళ్లీ తిరిగి రావడం సంతోషంగా ఉంది. రోహిత్ మద్దతుతో ముంబైని ముందుకు నడిపిస్తాను. అతని సహకారం కచ్చితంగా ఉంటుంది. రోహిత్ వారసత్వాన్ని కొనసాగిస్తాను. మేమిద్దరం కలిసి గత 10 ఏండ్లుగా ఆడుతున్నాం. నా కెరీర్ మొత్తం అతని కెప్టెన్సీలోనే ఆడాడు. అభిమానులను గౌరవిస్తాం… అదే సమయంలో జట్టు అవసరాలను గుర్తించాల్సి ఉంటుంది’ అని అన్నాడు. ఇదిలా ఉంటే గాయపడ్డ జాసన్ బెహెన్‌డార్ఫ్ స్థానంలో ల్యూక్ వుడ్(ఇంగ్లండ్)ను ముంబై తీసుకుంది.