మెహిదీపట్నం: స్విట్జర్లాండ్లో జరిగిన ప్రపంచ సుమో రెజ్లింగ్ చాంపియన్షిప్లో హైదరాబాదీ వినాయక్రాజ్సింగ్ పసిడి పతకంతో మెరిశాడు. ఈ నెల 6వ తేదీన జరిగిన అండర్-17 విభాగంలో వినాయక్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ప్రత్యర్థులను తన ఉడుం పట్టుతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ పోడియం ఫినిష్ చేశాడు. హైదరాబాద్ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జీవన్చంద్ర శైలేందర్సింగ్ కొడుకు అయిన వినాయక్రాజ్సింగ్ జాతీయస్థాయిలోనూ మూడు సార్లు విజేతగా నిలిచాడు. తన తండ్రిని ఆదర్శంగా తీసుకుంటూ పోటీకి దిగిన ప్రతీ టోర్నీలో సత్తాచాటుతున్నాడు. గురువు శ్రీరాం పహిల్వాన్ శిక్షణలో తన కొడుకు ఈ స్థాయికి ఎదిగాడని శైలేందర్ పేర్కొన్నాడు.