పుణె: మహిళల టీ20 చాలెంజ్‌లో వెలాసిటీ జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది. గురువారం జరిగిన పోరులో వెలాసిటీ 16 పరుగుల తేడాతో ట్రయల్‌బ్లేజర్స్ చేతిలో ఓడినా.. మెరుగైన రన్‌రేట్ కారణంగా ముందంజ వేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (47 బంతుల్లో 73; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), జెమీమా రోడ్రిగ్స్ (44 బంతుల్లో 66; 7 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 73 బంతుల్లోనే 113 పరుగులు జోడించడంతో ట్రయల్ బ్లేజర్స్ మహిళల టీ20 చాలెంజ్లోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. వెలాసిటీ బౌలర్లలో సిమ్రన్ బహదూర్ 2 వికెట్లు పడగొట్టింది.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెలాసిటీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. అరంగేట్ర ప్లేయర్ కిరణ్ ప్రభు నవగిరే (34 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకోగా.. యువ ఓపెనర్ షఫాలీ వర్మ (15 బంతుల్లో 29; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు ధనాధన్ షాట్లతో అలరించింది. ట్రయల్ బ్లేజర్స్ బౌలర్లలో పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. జెమీమా రోడ్రిగ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. శనివారం జరుగనున్న ఫైనల్లో సూపర్ నోవాస్‌తో వెలాసిటీ అమీతుమీ తేల్చుకోనుంది.
సంక్షిప్త స్కోర్లు
ట్రయల్ బ్లేజర్స్: 20 ఓవర్లలో 190/5 (మేఘన 73, జెమీమా 66; సిమ్రన్ 2/31), వెలాసిటీ:20 ఓవర్లలో 174/9 (కిరణ్ ప్రభు 69, షఫాలీ 29; పూనమ్ 2/33).