హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీనియర్ ప్రపంచ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ర్టానికి చెందిన వైష్ణవి వీరవంశం బరిలోకి దిగుతున్నది. బుధవారం నుంచి మొదలవుతున్న ఈ ప్రతిష్ఠాత్మక చాంపియన్‌షిప్‌లో ఈ 15 ఏండ్ల యువ సెయిలర్ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. హైదరాబాద్, ముంబైలో జరిగిన జాతీయ స్థాయి ర్యాంకింగ్ టోర్నీల్లో ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలిచిన వైష్ణవి ప్రదర్శనను భారత సెయిలింగ్ సమాఖ్య పరిగణనలోకి తీసుకుంది. ‘దేశానికి ప్రాతినిధ్యం వహించనుండటం చాలా గర్వంగా ఉంది. లేజర్ రేడియల్ విభాగంలో కేవలం ఆరు నెలల అనుభవమున్న నాకు ఈ టోర్నీలో రాణించడం సవాలే. ప్రపంచ స్థాయి సెయిలర్లు పోటీపడే ఈ చాంపియన్‌షిప్ ద్వారా అనుభవం లభిస్తుంది. నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన కోచ్ సుహేమ్ షేక్‌కు కృతజ్ఞతలు’ అని అంది. మరోవైపు వైష్ణవితో పాటు ఒలింపియన్ నేత్రా కుమానన్ ఈ టోర్నీలో పోటీ దిగుతున్నది. టోక్యో ఒలింపిక్స్ తర్వాత నేత్రకు ఇదే మేజర్ టోర్నీ.