క్రికెట్ ప్రపంచంలో కొన్ని దృశ్యాలు కాలంతో సంబంధం లేకుండా అభిమానుల గుండెల్లో నిలిచిపోతాయి. 1991-92 సీజన్లో ఆస్ట్రేలియా గడ్డపై టీనేజర్‌గా సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తుంటే.. ఆసీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ మెర్వ్ హ్యూస్ ముఖంలో కనిపించిన ఆశ్చర్యం, నివ్వెరపాటు క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ గుర్తే. నాడు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో రింగుల జుట్టు, అమాయకపు ముఖంతో ఉన్న కుర్ర సచిన్ కొట్టిన అద్భుత స్ట్రెయిట్ ్రడ్రైవ్కు హ్యూస్ నోరెళ్లబెట్టాడు.
మూడు దశాబ్దాల తర్వాత ఐపీఎల్ 2026లో ఈ తరం మేటి బౌలర్ల ముఖాల్లో మళ్లీ అలాంటి హావభావాలే కనిపిస్తున్నాయి. కారణం సరికొత్తగా దూసుకొచ్చిన మరో టీనేజర్ వైభవ్ సూర్యవంశీ!
స్టార్క్, బుమ్రా, కమిన్స్, హేజిల్‌వుడ్, ఎంగిడి… ఇలా బౌలర్ ఎవరైనా, ఎంతటి పేరున్నా ఈ బీహార్ బుడ్డోడు.. కాదు కాదు బుల్డోజర్ ఎవ్వరినీ వదలడం లేదు. మైదానంలో అతడు సాగిస్తున్న పరుగుల వేట, సృష్టిస్తున్న విధ్వంసం సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌తో మరో స్థాయికి చేరింది. మెగా లీగ్‌లో వరల్డ్ క్లాస్ బౌలర్లకు నిద్రలేకుండా చేస్తున్న ఈ కుర్ర సంచలనం సాంకేతిక నైపుణ్యం, మానసిక పరిణతిపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..
ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ బ్యాట్ నుంచి సిక్సర్ల సునామీ కురుస్తోంది. ఏకంగా 53 సిక్సర్లు బాదడం, ఒకే సీజన్లో 50 సిక్సర్ల మైలురాయిని దాటిన భాతర తొలి ఆటగాడిగా నిలవడం సామాన్యమైన విషయం కాదు. దీనికి అసాధారణమైన కండ బలం, విస్ఫోటక శక్తి అవసరం. 2012లో క్రిస్ గేల్ నెలకొల్పిన 59 సిక్సర్ల రికార్డును అధిగమించడానికి కేవలం 6 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 236.32 స్ట్రయిక్ రేట్‌తో సూర్యవంశీ దూసుకుపోతున్నాడు. పవర్‌ప్లేలోనే 37 సిక్సర్లు బాదడం అతడి పవర్‌కు నిదర్శనం. అతని బలం కేవలం చేతుల్లోనే లేదు. షాట్ ఆడేప్పుడు అతని మణికట్టు వేగం అమోఘం.
సూర్యవంశీ కొడుతున్న సిక్సర్ల గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు, కానీ అతని ఆట పునాది బలమైన టెక్నిక్‌తో నిర్మితమైంది. చాలా మంది పవర్ హిట్టర్లలా కాకుండా, ఈ లెఫ్ట్ హ్యాండర్ బంతిని ఆడే సమయంలో తన తలని ఎంతో స్థిరంగా ఉంచుతున్నాడు. మయాంక్ యాదవ్ వంటి బౌలర్లు 145-150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్నా.. సూర్యవంశీ కంగారు పడకుండా ఆ వేగాన్నే తనకి అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఎక్స్ట్రా కవర్ మీదుగా అతను ఆడే షాట్లకు మైక్రో సెకన్ల టైమింగ్ అవసరం. ఇక వికెట్ కీపర్ తల మీదుగా ఆడే ర్యాంప్ షాట్ ఏదో కంగారులో ఆడే స్కూప్ షాట్ లాగా కాకుండా.. బ్యాట్ ఫేస్ నేరుగా ఉంచి అత్యంత వేగవంతమైన బంతిని తెలివిగా డైరెక్షన్ మార్చే ఒక అద్భుతమైన కళలా కనిపిస్తోంది. బంతి వేగాన్ని వాడుకుంటూ.., తల కదలకుండా అతడు ఆడే షాట్లు క్లాసిక్ టెక్నిక్‌ను తలపిస్తున్నాయి.
వైభవ్ బ్యాటింగ్‌లో ఓ మేటి క్రికెటర్లోని డేరింగ్.. నిర్భయత్వం కనిపిస్తుంది. తను క్రీజులోకి వచ్చిన తర్వాత ఎదురుగా ఉన్న బౌలర్ చేతిలో బంతిని తప్ప ఆ వ్యక్తి ఎవరనేది అతనికి అనవసరం.స్టార్క్, బుమ్రా, కమిన్స్, లక్నో పేస్ దళం.. ఇలా ప్రతి ఒక్కరికీ అతను ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇచ్చాడు. బౌలర్ లెంగ్త్‌లో చిన్న పొరపాటు చేసినా బంతిని నేరుగా స్టాండ్స్‌లోకి పంపుతున్నాడు. గత మ్యాచ్‌లో ఒక్కసారి గేర్ మార్చాక.. ఆకాష్ సింగ్ ఓవర్లో 26 పరుగులు, మయాంక్ యాదవ్ ఓవర్లో 29 పరుగులు రాబట్టి లక్నో బౌలర్లు ఊపిరి సలపకుండా చేశాడు.
వైభవ్ ప్రదర్శనలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అతని మానసిక పరిణతి. లక్నో నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఏ కుర్రాడైనా ఒత్తిడికి లోనవుతాడు. కానీ ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సీనియర్ ఆటగాడిలా ప్రణాళికాబద్ధంగా ఆడాడు. ఆరంభంలో తన ఈగోను పక్కనబెట్టి 12 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. మరో ఎండ్‌లో యశస్వి జైస్వాల్ వేగంగా పరుగులు చేస్తున్నప్పుడు ఏమాత్రం సంయమనం కోల్పోకుండా పిచ్ ఎలా స్పందిస్తోంది.. ఔట్ ఫీల్డ్ ఎలా ఉందని అంచనా వేస్తూ సమయం తీసుకున్నాడు. జట్టుకు తన దూకుడు అవసరం అవ్వగానే విరుచుకుపడ్డాడు. సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయం ఖాయం చేశాడు. ఈ సీజన్లో రెండో శతకాన్ని తృటిలో చేజార్చుకున్నా.. ఎలాంటి భావోద్వేగాలకు లోనవ్వకుండా ప్రశాంతంగా మైదానాన్ని వీడుతూ తనలోని మరో కోణాన్ని చూపెట్టాడు.
ఐపీఎల్ చరిత్రలో ఎందరో ఆటగాళ్లు తమ ప్రతిభతో కథలు రాశారు. కానీ ఈ సీజన్లో రాజస్థాన్ పింక్ జెర్సీ ధరించి 15 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ చేస్తున్న ప్రదర్శన ఒక స్క్రిప్ట్లా లేదు. ఆధునిక క్రికెట్‌పై అతడు సాధిస్తున్న ఏకపక్ష ఆధిపత్యంలా కనిపిస్తోంది. 579 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న సూర్యవంశీ ఆట కేవలం ఒక తాత్కాలిక ఫామ్ కాదు. ఇది కొత్త తరానికి సరికొత్త దిగ్గజ ఆగమనం అనొచ్చు. వైభవ్‌లో భారత క్రికెట్ భవిష్యత్తును ఏలబోయే ఒక కొత్త సూపర్ స్టార్ కనిపిస్తున్నాడు.