అర్లింగ్టన్ (యూఎస్ఏ): వరల్డ్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్‌ను ఓడించిన తర్వాత యూఎస్ఏ గ్రాండ్‌మాస్టర్ హికారు నకమురా వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్లింగ్టన్ వేదికగా చెక్‌మేట్ ఈవెంట్ ఓపెనింగ్ లెగ్‌లో నకమురా.. గుకేశ్‌ను ఓడించిన వెంటనే బోర్డు మీద ఉన్న ‘కింగ్’ను తీసి ప్రేక్షకుల్లోకి విసిరాడు. ఆటలో గెలుపోటములు సాధారణమే అయినప్పటికీ హుందాగా ఆడే చెస్‌లో ఒక ఆటగాడు ఇంత అగ్రెసివ్‌గా సంబురాలు చేసుకోవడం చాలా అరుదు. ఈ ఈవెంట్లో యూఎస్ఏ.. 5-0తో భారత్‌పై ఏకపక్ష విజయం సాధించింది.
ఇక నకమురా తీరుపై మాజీ ప్లేయర్లు విమర్శల బాణం ఎక్కుపెట్టారు. దీనిపై ప్రపంచ మాజీ చాంపియన్ వ్లాదిమిర్ క్రామ్నిక్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇది అసభ్యత మాత్రమే కాదు.. ఆధునిక చెస్ పతనానికి నిదర్శనం’ అని రాసుకొచ్చారు. గెలిచాక హుందాగా ప్రవర్తించాల్సిన ప్లేయర్.. ఇలా చేసి ఆటను అవమానిస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెస్ దిగ్గజం గారీ కాస్పరోవ్ సైతం నకమురా తీరుపై స్పందిస్తూ ఇది అంగీకరించడానికి కష్టంగా ఉందని తెలిపారు. నకమురా మాత్రం తన చర్యను సమర్థించుకున్నాడు. మరోవైపు ఈవెంట్ ఆర్గనైజర్లు సైతం ప్లేయర్లను ఇలా చేయాలని ప్రోత్సహించినట్టు.. తద్వారా ప్రేక్షకులను అలరింపజేయడమే తమ ఉద్దేశమని పేర్కొనడం గమనార్హం.