Pink Ball Test | అడిలైడ్: గులాబీ టెస్టుపై భారత్ పట్టు కోల్పోతోంది! అడిలైడ్ ఓవల్ వేదికగా శుక్రవారం మొదలైన రెండో టెస్టులో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణిస్తున్న ఆతిథ్య ఆస్ట్రేలియా రెండో రోజూ పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించి ఈ మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది. భారత్‌కు కొరకరాని కొయ్య అయిన స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (141 బంతుల్లో 140, 17 ఫోర్లు, 4 సిక్సర్లు) శతక దూకుడు తో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 87.3 ఓవర్లలో 337 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టుకు 152 పరుగుల కీలక ఆధిక్యం దక్కింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమ్ఇండియా బ్యాటింగ్‌లో మళ్లీ తడబడటంతో రెం డో రోజు ఆట ముగిసే సమయానికి 24 ఓవర్లలో 128 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పో యి పీకల్లోతు కష్టాల్లో పడింది. రిషభ్ పంత్ (28 నాటౌట్), నితీశ్ రెడ్డి (15 నాటౌట్) క్రీజులో ఉండగా భారత్ ఇంకా 29 పరుగులు వెనుకంజలో ఉంది. ఆసీస్ పేస్ త్రయం కమిన్స్ (2/33), బొలాండ్ (2/39), స్టార్క్ (1/49) ధాటికి భారత టాపార్డర్ విలవిల్లాడింది. మూడో రోజు ఆటలో భారత ఆశలన్నీ పంత్, నితీశ్ మీదే ఉన్నాయి.
ఓవర్ నైట్ స్కోరు 86/1తో రెండో రోజు ఆరంభించిన ఆసీస్.. ఆట మూడో ఓవర్లోనే మెక్‌స్వీని (39) వికెట్‌ను కోల్పోయింది. బుమ్రా (4/61) మరోసారి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. కొద్దిసేపటికే అతడు ప్రమాదకర స్టీవ్ స్మిత్ (2)నూ వెనక్కి పంపాడు. కానీ లబూషేన్ (64), లోకల్ హీరో హెడ్ భారత బౌలర్లను నిలువరించారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. హెడ్ ఆదినుంచే దూకుడుగా ఆడగా లబూషేన్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఈ ఇద్దరూ హర్షిత్ రాణాను లక్ష్యంగా చేసుకుని పరుగులు రాబట్టారు. అయితే బౌలింగ్ మార్పుగా వచ్చిన నితీశ్ (1/53).. ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.
లబూషేన్ నిష్క్రమించినా హెడ్ దూకుడు ఆపలేదు. సిరాజ్ బౌలింగ్‌లో బౌండరీతో 63 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న హెడ్.. టీ విరామం మరింత జోరు పెంచాడు. మిచెల్ మార్ష్ (9), అలెక్స్ కేరీ (12) విఫలమైనా అప్పటికే క్రీజులో కుదురుకున్న అతడు.. వన్డే తరహా ఆట ఆడాడు. రాణా వేసిన వరుస ఓవర్లలో రెండేసి బౌండరీలతో 90లలోకి వచ్చిన అతడు.. అశ్విన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 111 బంతుల్లో శతకాన్ని సాధించాడు. సెంచరీ అనంతరం దూకుడు పెంచిన హెడ్.. సిరాజ్ 82వ ఓవర్లో 4, 6 బాదాడు. కానీ అదే ఓవర్లో నాలుగో బంతికి క్లీన్‌బౌల్డ్ అవడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.
తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనప్పటికీ పెర్త్ టెస్టు మాదిరిగా పుంజుకుంటుందనుకున్న భారత్.. అడిలైడ్‌లో మాత్రం ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయింది. కేఎల్ రాహుల్ (7)ను నాలుగో ఓవర్లోనే ఆసీస్ సారథి కమిన్స్ ఔట్ చేయడంతో భారత వికెట్ల పతనం మొదలైంది. 31 బంతుల్లో 4 ఫోర్లు బాది 24 పరుగులు చేసిన యశస్వీ జైస్వాల్‌ను బొలాండ్ బోల్తా కొట్టించాడు. కోహ్లీ (11) కూడా అతడి బౌలింగ్‌కే బలై నిరాశపరిచాడు. గిల్ (30 బంతుల్లో 28, 3 ఫోర్లు) కాసేపు ప్రతిఘటించినా స్టార్క్ అద్భుత బంతితో అతడిని వెనక్కి పంపించాడు. భారీ ఆశలు పెట్టుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ (6) మరోసారి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఆశలు నిలవాలంటే మూడో రోజు పంత్, నితీశ్ అద్భుతాలు చేయాల్సిందే!
భారత్ తొలి ఇన్నింగ్స్: 180 ఆలౌట్
ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 87.3 ఓవర్లలో 337 ఆలౌట్ (హెడ్ 140, లబూషేన్ 64, బుమ్రా 4/61, 4/98) భారత్ రెండో ఇన్నింగ్స్: 24 ఓవర్లలో 128/5 (పంత్ 28 నాటౌట్, గిల్ 28, కమిన్స్ 2/33, బొలాండ్ 2/39)