Travis Head | హైదరాబాద్: ఐపీఎల్ 17వ సీజన్ కోసం ఆస్ట్రేలియా హార్డ్‌హిట్టర్ ట్రావిస్ హెడ్ భారత్‌కు వచ్చేశాడు. ఈ నెల 22 నుంచి మొదలవుతున్న ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) తరఫున హెడ్ బరిలోకి దిగబోతున్నాడు. ఇటీవల జరిగిన ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలువడంలో కీలకంగా వ్యవహరించిన హెడ్..ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఆడబోతున్నాడు.
సరిగ్గా ఏడేండ్ల క్రితం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన హెడ్..ఇప్పుడు హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తన ఆగమనంపై హెడ్ మాట్లాడిన వీడియోను ఎస్ఆర్హెచ్ తమ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘లీగ్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. జట్టు మెరుగ్గా కనిపిస్తున్నది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాను. సొంత ప్రేక్షకుల మధ్య ఆడేందుకు ఆసక్తితో ఉన్నాను. జట్టు తరఫున వీలైనన్ని పరుగులు సాధించి విజయాల్లో కీలకమవుతాను’ అని పేర్కొన్నాడు. ఈసారి హైదరాబాద్ జట్టుకు న్యూజిలాండ్ దిగ్గజం డానియల్ వెటోరీ చీఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. చివరిసారి 2016లో టైటిల్ గెలిచిన హైదరాబాద్ మరోమారు అదే ప్రదర్శన పునరావృతం చేయాలని చూస్తున్నది.