మయామి గార్డెన్స్ (ఫ్లోరిడా): ఫిఫా ప్రపంచకప్‌లో చిరు దేశం కాబో వెర్డె తన సంచలన ప్రదర్శనను కొనసాగిస్తోంది. గత వారం టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన స్పెయిన్‌ను నిలువరించి సాకర్ సామ్రాజ్యంలో ప్రకంపనలు సృష్టించిన కాబో ఈసారి రెండు సార్లు ప్రపంచ చాంపియన్ ఉరుగ్వేను అడ్డుకుంది. సోమవారం హోరాహోరీగా సాగిన గ్రూప్-హెచ్ పోరులో 2-2తో ఉరుగ్వేను నిలువరించింది. మ్యాచ్ 21వ నిమిషంలోలభించిన ఫ్రీ కిక్‌ను కాబో ప్లేయర్ కెవిన్ పినా నెట్లోకి పంపి ప్రపంచకప్ చరిత్రలోతమ దేశానికి తొలి గోల్ సాధించి సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. దాంతో కాబో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లగా స్టేడియంలోని ఉరుగ్వే అభిమానులు సైలెంట్ అయ్యారు.
ఈ గోల్ ఇచ్చుకున్న తర్వాత ఉరుగ్వే పట్టుబిగించింది. తొలి అర్ధభాగం చివర్లో ఉరుగ్వే తరఫున మ్యాక్సీ అరౌజో (44వ ని), అగస్టిన్ కానోబియో (45+6వ ని) వెంటవెంటనే చెరో గోల్ సాధించడంతో ఉరుగ్వే 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయినా కాబో ఏమాత్రం వెనక్కుతగ్గలేదు. రెండో అర్ధభాగంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన కాబో ప్లేయర్ హెలియో కొన్ని నిమిషాలకే సంచలనం సృష్టించాడు. 61వ నిమిషంలో ఉరుగ్వే ఆటగాడు మథియాస్ ఒలివెరా చేసిన తప్పుడు పాస్‌ను అనుకూలంగా మార్చుకున్న హెలియో.. కీపర్ ముస్లెరా తన స్థానంలో లేకపోవడాన్ని గమనించి ఖాళీ నెట్లోకి బంతిని పంపి 2-2తో స్కోరును సమం చేశాడు. ఆఖర్లో ఉరుగ్వే గోల్ కోసం చేసిన ప్రయత్నాలను కాబో డిఫెన్స్ సమర్థవంతంగా తిప్పికొట్టి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఈ డ్రాతో కాబో వరల్డ్‌కప్ తొలిప్రయత్నంలోనే నాకౌట్ చేరుకునే అవకాశాలు మెరుగుపరుచుకుంది.