World Cup | బెంగళూరు: కర్నాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ)కు ఆ రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వాల్సి ఉన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి కర్నాటక ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్టు సమాచారం. ఐపీఎల్లో తొలి ట్రోఫీ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జూన్ 4న చేపట్టిన విజయయాత్రలో భాగంగా చిన్నస్వామిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది చనిపోగా సుమారు 50 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిన్నస్వామిలో భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్టు తెలుస్తున్నది.
తొక్కిసలాట ఘటన అనంతరం ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ కన్హువ కమిషన్ కూడా చిన్నస్వామి డిజైన్, నిర్మాణంలో లోపాలున్నాయని తేల్చింది. ఇదే కారణంతో కర్నాటకలో జరిగే మహారాజ ట్రోఫీ (టీ20 లీగ్)ను సైతం చిన్నస్వామి నుంచి మైసూరుకు తరలించారు. మహిళల వన్డే ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌తో పాటు ఇక్కడ గ్రూప్ దశలో మరో రెండు, సెమీస్ మ్యాచ్‌కు ఈ స్టేడియం ఆతిథ్యమివ్వాల్సి ఉంది. ప్రేక్షకుల్లేకుండా మ్యాచ్‌లను నిర్వహిస్తామని కేఎస్‌సీఏ ప్రతిపాదించినా ప్రభుత్వం ఒప్పుకోలేదని తెలిసింది.