గోల్డ్‌కోస్ట్: టాపార్డర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. వన్డే సిరీస్ కోల్పోయి.. ఏకైక టెస్టును ‘డ్రా’ చేసుకున్న భారత్.. పొట్టి ఫార్మాట్లో ప్రభావం చూపలేకపోయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. శనివారం రెండో పోరులో భారత్ 4 వికెట్ల తేడాతో ఓడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 118 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్లు స్మృతి మందన (1), షఫాలీ వర్మ (3) త్వరగానే ఔట్ కాగా.. వర్షం కారణంగా రైద్దెన తొలి పోరులో ధాటిగా ఆడిన జెమీమా రోడ్రిగ్స్ (7) కూడా ఎక్కువసేపు నిలువలేకపోయింది. దీంతో 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (28; 5 ఫోర్లు) కాస్త పోరాడగా.. యస్తిక (8), రిచా ఘోష్ (2) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆఖర్లో పూజా వస్ర్తాకర్ (26 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కంగారూలపై ఎదురుదాడికి దిగి వేగంగా పరుగులు రాబట్టింది. ఆసీస్ బౌలర్లలో తైలా వ్లామింక్, సోఫియా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. తహిలా మెక్‌గ్రాత్ (42 నాటౌట్; 6 ఫోర్లు), బెత్ మూనీ (34) రాణించారు. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 3 వికెట్లు పడగొట్టగా.. పేసర్ శిఖా పాండే (1/27) అద్భుత బంతితో అలీసా హీలీ (4)ని ఔట్ చేసింది. ఒత్తిడిలో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన తహిలా మెక్‌గ్రాత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లగా.. ఇరు జట్ల మధ్య ఆదివారం ఇక్కడే ఆఖరి టీ20 జరుగనుంది. మ్యాచ్ అనంతరం భారత సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘మరో 20 పరుగులు చేసుంటే.. ఫలితం తారుమారయ్యేది. మా మట్టుకు చేయాల్సిందంతా చేశాం. చివరి వరకు విజయం కోసం పోరాడం’ అని చెప్పింది.
స్కోరు బోర్డు
భారత్: స్మృతి (సి) కారీ (బి) వ్లామింక్ 1, షఫాలీ (సి) డార్లింగ్టోన్ (బి) వ్లామింక్ 3, జెమీమా (సి) డార్లింగ్టోన్ (బి) సోఫియా 7, హర్మన్‌ప్రీత్ (స్టంప్డ్) హీలీ (బి)జార్జియా 28, యస్తిక (రనౌట్) 8, రిచ (బి) కారీ 2, దీప్తి (రనౌట్) 16, పూజ (నాటౌట్) 37, శిఖ (బి) గార్డ్నెర్ 1, రేణుక (బి) సోఫియా 1, రాజేశ్వరి (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 14, మొత్తం: 20 ఓవర్లలో 118/9. వికెట్ల పతనం: 1-5, 2-12, 3-24, 4-50, 5-52, 6-61, 7-76, 8-78, 9-81, బౌలింగ్: తైలా వ్లామింక్ 3-0-18-2, సోఫియా 4-0-11-2, పెర్రీ 2-0-17-0, గార్డ్నెర్ 4-0-12-1, జార్జియా 2-0-14-1, కారీ 3-0-25-1, డార్లింగ్టోన్ 2-0-19-0.
ఆస్ట్రేలియా: హీలీ (బి) శిఖ 4, మూనీ (స్టంప్డ్) రిచ (బి) రాజేశ్వరి 34, లానింగ్ (సి) రిచ (బి) రాజేశ్వరి 15, గార్డ్నెర్ (సి) రాజేశ్వరి (బి) హర్మన్‌ప్రీత్ 1, పెర్రీ (సి) హర్మన్‌ప్రీత్ (బి) దీప్తి 2, తహిలా (నాటౌట్) 42, కారీ (స్టంప్డ్) రిచ (బి) రాజేశ్వరి 7, జార్జియా (నాటౌట్) 10, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 19.1 ఓవర్లలో 119/6. వికెట్ల పతనం: 1-4, 2-35, 3-38, 4-46, 5-71, 6-94, బౌలింగ్: శిఖ 4-0-27-1, రేణుక 4-1-27-0, పూజ 3.1-0-21-0, రాజేశ్వరి 4-0-21-3, హర్మన్‌ప్రీత్ 2-0-9-1, దీప్తి 2-0-11-1.