హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుత ఫలితాలు సాధిస్తామని నిరూపిస్తూ సత్తాచాటుతున్నారు. అథ్లెటిక్స్‌లో నిలకడగా రాణిస్తున్న గురుకుల యువ అథ్లెట్ అగసర నందిని..ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్‌కు ఎంపికైంది.
హంగ్జు(చైనా) వేదికగా సెప్టెంబర్ 23 నుంచి మొదలయ్యే మెగాటోర్నీలో హెప్టాథ్లాన్(100మీ, 200మీ, షాట్‌పుట్, లాంగ్‌జంప్, హైజంప్, జావెలిన్ త్రో)లో బరిలోకి దిగనుంది. అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలు సాధిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నందిని..ఆసియా గేమ్స్‌లో తొలిసారి అరంగేట్రం చేయనుంది. ప్రస్తుతం సంగారెడ్డి ఎస్సీ గురుకుల కాలేజీలో బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్న నందిని..గురుకులాల నుంచి ఆసియా గేమ్స్ ఎంపికైన తొలి తెలంగాణ ప్లేయర్‌గా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్, గురుకులాల కార్యదర్శి నవీన్ నికోలస్..నందినిని ప్రత్యేకంగా అభినందించారు.