ఢిల్లీ : జర్మనీలోని సుహ్ల్లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్లో భారత యువ షూటర్ తేజస్విని స్వర్ణంతో మెరిసింది. మహిళల 25 మీటర్ల పిస్టోల్ ఈవెంట్లో ఆమె 31 పాయింట్లు స్కోరు చేసి పసిడి కైవసం చేసుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో 8 మంది పాల్గొనగా తేజస్విని..
గురి తప్పని ప్రదర్శనతో అగ్రస్థానాన నిలవగా బెలారస్ షూటర్ అలినా 29 పాయింట్లతో రజతం, మిరియమ్ జాకొ (హంగేరి) 23 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకున్నారు. క్వాలిఫికేషన్ రౌండ్లో 575 పాయింట్లు స్కోరు చేసి ఫైనల్కు అర్హత సాధించిన 20 ఏండ్ల ఈ హర్యానా అమ్మాయి.. తుది పోరులోనూ రాణించింది. తేజస్విని స్వర్ణంతో ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో భారత్ మొత్తం 11 పతకాలతో అగ్రస్థానంలో నిలవడం విశేషం.