Sakshi Malik | న్యూఢిల్లీ: జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) మళ్లీ వార్తల్లోకెక్కింది. పలు అవాంతరాల అనంతరం తాజాగా జరిగిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు మరోమలుపు తీసుకున్నాయి. గురువారం జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజయ్‌సింగ్..సమీప ప్రత్యర్థి అనితా షెరాన్‌పై ఏకపక్ష విజయం సాధించాడు. సంజయ్‌సింగ్‌కు 40 ఓట్లు పోల్ కాగా, అనిత ఏడు ఓట్లతో సరిపెట్టుకుంది. అయితే అనిత వర్గానికి చెందిన ప్రేమ్‌చంద్ కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవి దక్కించుకోగా, దేవందర్సింగ్ కదియాన్ సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
మొత్తం గా 15 స్థానాల్లో సంజయ్‌సింగ్ వర్గం 13 స్థానాలు తమ ఖాతాలో వేసుకుంది. ఇక్కడికి వరకు బాగానే ఉంది. బీడబ్ల్యూఎఫ్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ సన్నిహితుడైన సంజయ్‌సింగ్ ఎన్నిక కావడాన్ని స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ పునియా, వినేశ్ ఫోగట్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఓవైపు సంజయ్‌సింగ్ విజయంతో బ్రిజ్‌భూషణ్ వర్గం పెద్ద ఎత్తున సంబురాల్లో ఉంటే..మరోవైపు పునియా, వినేశ్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న సాక్షి మాలిక్ సంచలన నిర్ణయం తీసుకుంది. బ్రిజ్‌భూషణ్ మనిషిగా ముద్రపడ్డ సంజయ్‌సింగ్ అధ్యక్ష పదవి దక్కించుకోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ తన కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ సాక్షి..మీడియా ముఖంగా ప్రకటించింది.
ఇక నుంచి తాను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి బరిలోకి దిగనని ప్రకటిస్తూ తన షూస్‌ను టేబుల్‌పై పెడుతూ మధ్యలోనే బయటకు వెళ్లిపోయింది. మరోవైపు బజరంగ్ పునియా, వినేవ్ ఫోగట్..సంజయ్‌సింగ్ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మేము ఎవరిపైన అయితే పోరాడామో.. తిరిగి వారే పదవిలోకి రావడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోమని ప్రకటించారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్న బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఇన్నాళ్లు తాము చేసిన పోరాటానికి విలువ లేకుండా పోయిందని ఈ సందర్భంగా స్టార్ రెజ్లర్లు వాపోయారు.
డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ అరాచకాలపై రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్‌తో పాటు పలువురు రెజ్లర్లు చేసిన పోరాటానికి ఫలితం లేకుండా పోయింది. బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఢిల్లీ నడివీధుల్లో గొంతు చించుకుని పోరాడిన కుస్తీవీరుల ఆశయం నెరవేరలేదు. ప్రతికూల పరిస్థితుల మధ్య రెజ్లర్లు చేసిన పోరాటానికి యావత్ దేశం మద్దతుగా నిలిచింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన రెజ్లర్లు చేసిన ధర్నాకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చింది. బ్రిజ్‌భూషణ్‌కు సంబంధించిన మనుషులను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల గోదాలో నిలబడనీయబోమని మంత్రి అనురాగ్ ఇచ్చిన హామీ మేరకు రెజ్లర్లు తమ నిరసనకు ముగింపు పలికిన సంగతి తెలిసిందే.